గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే ఎన్కౌంటర్... అనుమానం రేకెత్తిస్తున్న 5 ప్రశ్నలు...
కాన్పూర్ గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే ఎన్కౌంటర్ తీవ్ర వివాదాస్పదమవుతోంది. ఎన్‌కౌంటర్‌కి సంబంధించి పోలీసులు చెప్తున్న కథనంపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ సహా పలువురు నేతలు ఎన్‌కౌంటర్‌పై ఇప్పటికే అనుమానం వ్యక్తం చేశారు. దూబేని విచారిస్తే రాజకీయ నాయకులు,పోలీసులతో ఎక్కడ అతని లింకులు బయటపడుతాయేమోన్న ఉద్దేశంతోనే అతన్ని ఎన్కౌంటర్ చేశారని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్‌కౌంటర్‌కి సంబంధించి ప్రముఖ జాతీయ మీడియా ఐదు కీలక ప్రశ్నలను తెరపైకి తెచ్చింది.

వేర్వేరు కార్లు... అనుమానాలు...
వికాస్ దూబేని కారులో కాన్పూర్ తరలిస్తుండగా ఆ వాహనం బోల్తా కొట్టిందని పోలీసులు చెప్తున్నారు. కానీ అక్కడికి సమీపంలోని టోల్ ప్లాజా వద్ద తెల్లవారుజామున 4గంటలకు సీసీటీవీలో రికార్డయిన దృశ్యాల్లో.. వికాస్ బోల్తా కొట్టిన కారులో కాకుండా వేరే కారులో ఉన్నట్లు కనిపించింది. అంటే టోల్ ప్లాజా దాటాక వికాస్‌ను మరో కారులో ఎక్కించారా.. లేక పోలీసులు చెప్తున్న కథనం అవాస్తవమా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

బేడీలు ఎందుకు వేయలేదు..?
5 హత్యలతో సహా 60 కేసుల్లో నిందితుడైన వికాస్ దూబేని చేతులకు బేడీలు లేకుండా తరలించారా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఒకవేళ అతని చేతులకు బేడీలు వేసి ఉంటే... కారు బోల్తా పడ్డ సందర్భంలో పోలీస్ వద్ద నుంచి గన్ ఎలా లాక్కున్నాడన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కారు బోల్తా పడ్డ తర్వాత చేతులకు బేడీలు వేసివున్న వ్యక్తి... అందులో నుంచి తనంతట తానే బయటకు రావడం అంత సులువు కాదు కదా అన్న ప్రశ్నలు కూడా వ్యక్తమవుతున్నాయి.

యాక్సిడెంట్ ఎలా జరిగినట్లు..?
కారు బోల్తా కొట్టినట్లుగా చెబుతున్న ప్రదేశంలో నిజానికి అక్కడ ఎటువంటి అడ్డంకులు లేవు. ఆ ప్రదేశానికి ఆనుకుని పక్కనే పంట పొలాల్లోకి వెళ్లే ఓ రోడ్డు ఉంది. వికాస్ దూబే ఆ రోడ్డు వైపే పారిపోయే ప్రయత్నం చేశాడని పోలీసులు చెప్తున్నారు. అయితే రోడ్డుపై దానంతట అదే కారు ఎలా బోల్తా పడిందన్నది మిస్టరీగా మారింది.

యాక్సిడెంట్ గురించి ప్రస్తావించని ప్రత్యక్ష సాక్షులు...
కొంతమంది ప్రత్యక్ష సాక్షులు మాట్లాడుతూ తాము గన్ సౌండ్స్ విన్నామని చెప్పారు. కానీ కారు బోల్తా పడిన శబ్దమేదీ వినిపించినట్లుగా చెప్పలేదు. వికాస్ దూబేని తరలిస్తున్న కాన్వాయ్‌ని ఫాలో అవుతూ కొంతమంది రిపోర్టర్స్ తమ వాహనాల్లో వాటి వెనకాలే వెళ్లారు. కానీ మార్గమధ్యలో ఓచోట పోలీసులు అన్ని వాహనాలను ఆపేశారు. కేవలం వికాస్ దూబేని తరలిస్తున్న కాన్వాయ్‌ని మాత్రమే పంపించి.. మిగతా వాహనాలను అక్కడే నిలిపేశారు. దీంతో వికాస్ దూబేని ఎన్కౌంటర్ చేసేందుకే... అటువైపు ఎవరూ వెళ్లకుండా వాహనాలను నిలిపివేశారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశానికి 2కి.మీ దూరంలో వాహనాలను నిలిపివేశారు.

వాహనాలు ఎందుకు నిలిపేశారు..?
జాతీయ మీడియాకు చెందిన ఓ రిపోర్టర్ మాట్లాడుతూ... 'ఉదయం 6.56గంటల సమయంలో... అప్పటిదాకా అక్కడ ఎలాంటి ట్రాఫిక్ జామ్ లేదు. కానీ అకస్మాత్తుగా వాహనాలన్నింటిని ఆపేశారు. కేవలం దూబేని తరలిస్తున్న కాన్వాయ్‌ని మాత్రమే పంపించారు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఎన్కౌంటర్ జరిగినట్లు కాన్పూర్ పోలీసులు ప్రకటించారు.' అని చెప్పారు. దూబేకి బేడీలు వేయలేదని,ఇద్దరు పోలీసుల మధ్య కూర్చుని ఉన్నాడని... కాన్వాయ్ వెళ్తున్నప్పుడు తాను చూశానని పేర్కొన్నారు.