రాఫెల్ ల్యాండింగ్ వేళ: వి మిస్ యూ: మనోహర్ పారికర్‌ను స్మరిస్తోన్న దేశం: సర్జికల్ స్ట్రైక్-1
న్యూఢిల్లీ: మనోహర్ పారికర్.. ప్రస్తుతం దేశ ప్రజలు ఆయన పేరును స్మరించుకుంటున్నారు. భారత వైమానిక దళం అమ్ములపొదిలో బ్రహ్మాస్త్రంగా భావిస్తోన్న అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఙానంతో రూపుదిద్దుకున్న రాఫెల్ యుద్ధ విమానాలు ల్యాండ్ అయిన వేళ.. ఆయనను గుర్తు చేస్తున్నారు. వి మిస్ యు సర్ అంటూ నివాళి అర్పిస్తున్నారు. కారణం.. రాఫెల్ యుద్ధ విమానాలను భారత వైమానిక దళంలో చేర్చాలనే ఆలోచన ఆయనదే కావడం.. తన ఆలోచనను కార్యాచరణ రూపంలోకి తీసుకుని రావడం.. యుద్ధ ప్రాతిపదికన ఫ్రాన్స్‌తో ఒప్పందాలను కుదుర్చుకోవడం.

పారికర్ హయాంలోనే రాఫెల్ డీల్..
ప్రపంచంలో అతికొద్ది దేశాల వద్ద, పరిమితంగా ఉన్న రాఫెల్ యుద్ధ విమానాలను భారత్ వైమానిక దళంలోనూ చేర్చాలనే ప్రతిపాదనను ఆయనే మొదటిసారిగా తీసుకొచ్చారు. దీనికి అవసరమైన ప్రతిపాదనలను రూపొందించారు. ఫ్రాన్స్‌తో ఒప్పందాలను కుదుర్చుకున్నారు. ఆ దేశానికి చెందిన డస్సాల్ట్ ఏవియేషన్ సంస్థ.. రాఫెల్ యుద్ధ విమానాలను తయారు చేసింది. దీనికి అవసరమైన ఒప్పందాలను కుదర్చుకోవడానికి శక్తివంచన లేకుండా కృషి చేశారు.

రక్షణమంత్రిగా శతృదుర్భేద్యంగా..
ఉత్తర ప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన మనోహర్ పారికర్.. ఎన్డీఏ-1 హయాంలో రక్షణమంత్రిగా పనిచేసిన విషయం తెలిసిందే. ఐఐటీ పూర్వ విద్యార్థి పారికర్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రక్షణశాఖ బాధ్యతలను అప్పగించారు. 2016లో పాకిస్తాన్‌పై భారత వైమానిక దళం సర్జికల్ స్ట్రైక్-1 నిర్వహించిన సమయంలో రక్షణశాఖ మంత్రి ఆయనే. 2016 సెప్టెంబర్ 28వ తేదీన వైమానిక దళాలు సరిహద్దులను దాటుకుని వెళ్లి.. పాకిస్తాన్‌పై మెరుపుదాడులు చేయగా..దానికి అయిదురోజులకు ముందే అత్యాధునికమైన రాఫెల్ వంటి యుద్ధ విమానాలను కొనుగోలు చేయడానికి భారత్ ఒప్పందాలను కుదుర్చుకుంది.

గోవా ముఖ్యమంత్రిగా.. కన్నుమూత
2016 సెప్టెంబర్ 23వ తేదీన కేంద్ర ప్రభుత్వం రాఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయడానికి అవసరమైన ఒప్పందాలను కుదుర్చుకుంది. రక్షణమంత్రిగా కొనసాగుతున్న సమయంలోనే గోవాలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో పారికర్‌ను అక్కడికి పంపించింది భారతీయ జనతా పార్టీ. గోవా ముఖ్యమంత్రిగా నియమించింది. రక్షణమంత్రిగా రాజీనామా చేసిన ఆయన 2017 మార్చి 14వ తేదీన గోవా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం అనారోగ్యానికిక గురయ్యారు. పాంక్రియాటివ్ కేన్సర్ బారిన పడ్డారు. చికిత్స పొందుతూ 2019 మార్చి 17వ తేదీన కన్నుమూశారు.