మరో వివాదంలో రాహుల్ గాంధీ - లండన్ లో కాంగ్రెస్ నేత : పొలిటికల్ క్లియరెన్స్ లేకుండా..!!
కాంగ్రెస్ అధినాయకుడు రాహుల్ గాంధీ మరో వివాదంలో చిక్కుకున్నారు. రాహుల్ ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్నారు. అయితే, తన పర్యటనకు రాహుల్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి రాజకీయ ఆమోదం తీసుకోకుండా వెళ్లారని తెలుస్తోంది. పార్లమెంట్ సభ్యులు విదేశీ పర్యటనలకు వెళ్లే ముందు తమ పర్యటనకు సంబంధించిన సమాచారాన్ని విదేశాంగ శాఖ వెబ్సైట్లో కనీసం మూడు వారాల ముందే ఉంచాలి. ఈ నిబంధనను రాహుల్ గాంధీ పాటించలేదని సమాచారం. దీని ద్వారా ఎంపీలు విదేశాలకు వెళ్లే ముందు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి రాజకీయ ఆమోదం పొందాల్సి ఉంటుంది.
ఎప్పటి నుంచో ఈ నిబంధనలు ఉన్నాయని కేంద్ర ప్రతినిధులు చెబుతున్నారు. కానీ, కాంగ్రెస్ నేతలు మాత్రం వీటితో విభేదిస్తున్నారు. అధికారిక విదేశీ పర్యటనలు కానప్పుడు ప్రధాని లేదా కేంద్రం నుంచి రాజకీయ పరమైన అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదని వాదిస్తున్నారు. ఈ వివాదం కొనసాగుతున్న సమయంలో కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా ట్వీట్ చేశారు. అందులో ప్రధాని కార్యాలయం వాట్సాప్ నుంచి వచ్చే సందేశాలను గుడ్డిగా ఫాలో కావద్దంటూ పేర్కొన్నారు. లండన్ పర్యటనలో భాగంగా రాహుల్ అక్కడ బ్రిటన్ రాజకీయ నాయకుడు జెరెమీని కలిశారు. దీని పైన స్పందించిన బీజేపీ ఎంపీలు రాహుల్ తీరు పైన ఫైర్ అయ్యారు.


కశ్మీర్ వేర్పాటును ప్రోత్సహించే వ్యక్తిని రాహుల్ కలిసారంటూ ఫైర్ అయ్యారు. వీటిని కాంగ్రెస్ ఖండించింది. పరస్పర విభిన్న భావజాలాలు ఉన్న రెండు దేశాల రాజకీయ నాయకులు గతంలోనూ కలుసుకున్నారని, భవిష్యత్‌లోనూ కలుసుకుంటారని అన్నారు. జెరెమీతో మోదీ సమావేశం కావడంపై ప్రశ్నలు సంధించారు. ఓ బహిరంగ సమావేశంలో మెహుల్ ఛోక్సీని సోదరుడిగా పిలుస్తూ మోదీ చేసిన వ్యాఖ్యలపై ప్రశ్నించాలంటూ రణదీప్ సుర్జేవాలా పేర్కొన్నారు. గతంలో రాహుల్ నేపాల్ లో ఒక వివాహంలో పాల్గొనేందుకు వెళ్లిన సమయంలో ఒక నైట్ క్లబ్ లో ఉన్న వీడియోతో బీజేపీ నేతలు పెద్ద ఎత్తున విమర్శలు చేసారు. ఇక, ఇప్పుడు లండన్ పర్యటన..అక్కడ రాహుల్ కలిసిన వారి విషయంలోనూ బీజేపీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ఈ వ్యవహారం పైన కాంగ్రెస్ - బీజేపీ నేతల మధ్య ట్వీట్ల వార్ నడుస్తోంది.