శరద్ యాదవ్ వద్ద రాహుల్ మొహమాటం: వెంటనే అందుకున్న ఏచూరి
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ.. జేడీయూ సీనియర్ నేత శరద్ యాదవ్‌ను ఓ విషయంపై అడిగేందుకు మొహమాటపడ్డారట. దీంతో అక్కడేవున్న సీపీఎం నేత సీతారాం ఏచూరి కల్పించుకుని రాహుల్ అడగాలనుకున్నది అడిగేశారట.

శరద్ యాదవ్ సుదీర్ఘ ప్రసంగం
అసలు విషయంలోకి వెళితే.. మంగళవారం ప్రతిపక్షాలు భేటీ అయిన సందర్భంలో రైతు సమస్యలపైన చర్చించారు. ఈ సమస్యను ప్రజల్లోకి తీసుకెళ్లి మోడీ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో చెబుతూ కేంద్ర ప్రభుత్వాన్ని కార్నర్ చేయాలని భావించాయి. కాగా, ఈ సమావేశానికి హాజరైన శరద్ యాదవ్ రైతుల సమస్యలపై చాలా సేపు మాట్లాడారు.

రాహుల్ మొహమాటం
దీంతో అక్కడే ఉన్న రాహుల్ గాంధీతో సహా పలువురు నేతలకు ఓ సందేహం వచ్చింది. శరద్ యాదవ్ పార్టీ తరపున ఈ విషయం చెప్పారా? లేక వ్యక్తిగతంగా చెప్పారా? అని తెలుసుకోవాలనుకున్నాయి. నేరుగా ఈ విషయాన్ని అడగాలనుకున్నప్పటికీ రాహుల్ గాంధీ అడగలేకపోయారు.


సీతారాం ఏచూరి అడిగేశారు..
ఈ నేపథ్యంలో సీపీఎం నేత సీతారాం ఏచూరి ఆ బాధ్యత తీసుకుని ఏ మాత్రం ఆలస్యం చేయకుండా శరద్ యాదవ్‌ను అడిగేశారు. దీంతో రైతుల సమస్యలపై తమ పార్టీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోందని, తాను తన పార్టీ తరపునే మాట్లాడానని శరద్ యాదవ్ స్పష్టం చేశారు.

నితీష్ వ్యవహారం వల్లే..
కాగా, గతంలో పెద్ద నోట్ల రద్దుకు వ్యతిరేకంగా శరద్ యాదవ్ మాట్లాడగా, అదే పార్టీకి చెందిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మాత్రం విభేధించినట్లు ఈ సందర్భంగా కొందరు గుర్తు చేశారు. అంతేగాక, ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థికి కూడా నితీష్ మద్దతు పలకడంతో ఆయన ఆ
కూటమికి దగ్గరవుతున్నారని రాహుల్ గాంధీ కూడా భావించినట్లున్నారు. ఈ నేపథ్యంలోనే రాహుల్.. శరద్ యాదవ్‌ను ఈ ప్రశ్న అడగాలని అనుకున్నట్లు తెలుస్తోంది.