రాహుల్ గాంధీ ఫిరంగిలాంటోడు..నేను ఏకే - 47 టైప్
సిమ్లా: వివాదాస్పద వ్యాఖ్యానాలు చేస్తూ తరచూ వార్తల్లోకి ఎక్కే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ.. మరోమారు తన వైఖరిని బయట పెట్టుకున్నారు. రాహుల్ గాంధీ ఫిరంగి లాంటివారని, తాను ఏకే - 47 లా దూసుకెళ్లే మనస్తత్వం ఉన్నవాడినని అన్నారు. చివరి విడత లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా..ఆయన హిమాచల్ ప్రదేశ్లో పర్యటించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ సుడిగాలి పర్యటనలు చేపట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటైన బహిరంగ సభల్లో సిద్ధూ తనదైన శైలిలో ప్రసంగించారు.
అనుక్షణం అప్రమత్తం: నిర్లక్ష్యానికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి రావచ్చు:
నాడు గంగానది కుమారుడు..నేడు రాఫెల్ ఏజెంట్
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని లక్ష్యంగా చేసుకుని సిద్ధూ వాగ్బాణాలు సంధించారు. 2014 ఎన్నికల సమయంలో తాను పవిత్రమైన గంగానది కుమారుడి లాంటివాడనని చెప్పుకొని మోడీ ఎన్నికల్లో ప్రచారం చేసి, ప్రజలను మోసగించారని విమర్శించారు. గంగానది కుమారుడిలా ప్రధాన మంత్రి పీఠాన్ని అధిష్ఠించిన మోడీ..ఈ అయిదేళ్ల కాలంలో రాఫెల్ ఏజెంట్ అనే పేరు తెచ్చుకున్నారని ఎద్దేవా చేశారు. రాఫెల్ ఏజెంట్ అనే ముద్ర వేసుకుని పదవి నుంచి దిగిపోతున్నారని ఆరోపించారు. మోడీ హయాం మొత్తం అవినీతిమయమేనని ధ్వజమెత్తారు. ఈ అవినీతికి మోడీ సమాధానం చెప్పుకోవాల్సి రోజు తప్పకుండా వస్తుందని అన్నారు. రాఫెల్ డీల్ కోసం కమీషన్ తీసుకున్నారా? లేదా? అనే ప్రశ్నకు మోడీ బదులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై తాను ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎవ్వరితోనైనా చర్చించడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు.

రాహుల్ నాయకత్వం అవసరం
ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో రాహుల్ గాంధీ దేశానికి నాయకత్వం వహించాల్సిన అవసరం ఎంతైన ఉందని సిద్ధూ అన్నారు. రాహుల్ గాంధీ- అవినీతికి దూరంగా ఉంటారని అన్నారు. ఆయన తినరు..ఎవ్వర్నీ తిననివ్వరు.. అని చెప్పారు. రాహుల్ గాంధీ ఫిరంగిలాంటి వారని చెప్పారు. నరేంద్ర మోడీ పాలనపై ఎక్కు పెట్టిన ఫిరంగిలాంటి వారని, ఏకే-47లా దూసుకెళ్లే తత్వం తనదని అన్నారు.