రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై నిలిపేస్తామన్న గూగుల్ .. కొనసాగిస్తామన్న రైల్ టెల్

రైల్వే స్టేషన్లలో తాము అందించే వైఫై సేవలు నిలిపివేస్తున్నట్టు ప్రకటించి గూగుల్ సంచలన నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా అన్ని రైల్వే స్టేషన్లలో తాము అందిస్తున్న ఉచిత వైఫైను ఎత్తివేస్తున్నట్లు గూగుల్ తాజాగా ప్రకటించటంతో రైల్ టెల్ స్పందించింది. గూగుల్ వెనక్కు తగ్గినా రైల్వే స్టేషన్లలో వైఫై సేవలు అందిస్తామని స్పష్టం చేసింది.

రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై సర్వీసులు ఆపేస్తామన్న గూగుల్
2015లో భారతీయ రైల్వే, రైల్ టెల్ భాగస్వామ్యంతో గూగుల్ ఉచిత పబ్లిక్ వైఫై సేవలను ప్రారంభించింది. ఇప్పటికి ఇది 5 సంవత్సరాలను పూర్తి చేసుకున్న నేపధ్యంలో గూగుల్ ఉపాధ్యక్షుడు సీజర్ గుప్తా మాట్లాడారు. 2020 నాటికి 400కు పైగా అన్ని రైల్వే స్టేషన్లలో అమర్చాలని లక్ష్యంగా పెట్టుకోగా జూన్ 2018 నాటికే ఆ లక్ష్యాన్ని అధిగమించినట్లు సీజర్ గుప్తా వెల్లడించారు. రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై సర్వీసులు ఇక నుంచి ఆగిపోనున్నాయని పేర్కొన్నారు.

ఇంటర్నెట్ సేవలు ప్రతి ఒక్కరికి అందుబాటులో . అందుకే నిర్ణయం
గతంతో పోలిస్తే ఇప్పుడు ఇంటర్నెట్ సేవలు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్నాయని , ధరలు చాలా చౌకగా మారిపోయాయని పేర్కొన్న ఆయన మొబైల్ కనెక్టివిటీ పెరిగింది కాబట్టి రైల్వే స్టేషన్ లలో వైఫై సేవలు నిలిపివేస్తామని చెప్పారు. వివిధ రకాల ధరల్లో సులభంగా ఇంటర్నెట్ సేవలు లభ్యమవుతున్నాయని పేర్కొన్న ఆయన చాలా ఫాస్ట్‌గా నెట్ వర్క్ అందుతోందని కనుకనే దేశవ్యాప్తంగా వున్న అన్ని రైల్వే స్టేషన్లలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తున్నట్టు పేర్కొన్నారు .

గూగూల్ ప్రకటనపై స్పందించిన రైల్ టెల్
ఇక ఈ వార్త ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్ .. అయితే దీనిపై స్పందించిన రైల్ టెల్ ప్రయాణికులకు ఊరటనిచ్చే వార్త చెప్పింది . రైల్వే ప్రయాణికుల సౌకర్యం కోసం..దేశంలోని ప్రధాన రైల్వే స్టేషన్లలో వైఫై సేవలు అందించేందుకు ఐదేళ్ల కిందట గూగుల్ స్టేషన్ పేరుతో గూగుల్ తో టై అప్ చేసుకున్న అంశంపై మాట్లాడుతూ భారతీయ రైల్వే అనుబంధ సంస్థ రైల్ టెల్ స్పందించింది.

ఇతర సంస్థల సాయంతో ఉచిత వైఫై కొనసాగిస్తామని ప్రకటన
రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై పథకంలో గూగుల్ కేవలం 415 స్టేషన్లలో మాత్రమే భాగస్వామి అని రైల్ టెల్ తెలిపింది . ప్రస్తుతం దేశంలో ఉచిత వైఫై సేవలు అందిస్తున్న రైల్వే స్టేషన్ల సంఖ్య 5,600కి చేరిందని పేర్కొంది రైల్ టెల్గూగుల్ తో పాటు మరికొన్ని సంస్థలు కూడా ఇందులో భాగస్వాములని చెప్పిన రైల్ టెల్ గూగుల్ వెనక్కి తగ్గినా కూడా తాము ఇతర సంస్థల సాయంతో ఉచిత వైఫై అందించే కార్యక్రమం కొనసాగిస్తామని రైల్ టెల్ స్పష్టం చేసింది.