
ఘోరం: బావిలో విగతజీవులుగా ముగ్గురు అక్కా చెల్లెళ్లు, వారి పిల్లలు
జైపూర్: రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్లో విషాద ఘటన చోటు చేసుకుంది. శనివారం ఇక్కడ డూడూ ప్రాంతంలోని బావిలో నవజాత శిశువుతో సహా ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి మృతదేహాలు కనిపించడంతో ఇది ఆత్మహత్యగా పోలీసులు అనుమానిస్తున్నారు.
మృతులు మీనో కా మొహల్లాలో నివసించేవారు. మే 25న మార్కెట్కు వెళ్లాలని చెప్పి ఇంటి నుంచి వెళ్లిపోయారని పోలీసులు తెలిపారు. వారు ఇంటికి తిరిగి రాకపోవడంతో, వారి కుటుంబ సభ్యులు వేర్వేరు ప్రాంతాల్లో మిస్సింగ్ పోస్టర్లు వేసి, పోలీసులకు ఫిర్యాదు చేశారని వారు తెలిపారు.

బావి నుంచి మృతదేహాలను వెలికితీశామని, పోస్టుమార్టం జరుగుతోందని ఎస్హెచ్ఓ చేతారామ్ తెలిపారు. మృతులను సోదరీమణులు కాళీదేవి (27), మమతా మీనా (23), కమలేష్ మీనా (20), హర్షిత్ (4), మరో 20 రోజుల పాపగా గుర్తించారు.
కాగా, ముగ్గురు సోదరీమణులకు ఒకే కుటుంబానికి చెందిన వారిని వివాహం చేసుకున్నారు. వీరిని అత్తమామలు వేధిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయని, విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. వరకట్న వేధింపుల వల్లే వీరంతా బలవన్మరణానికి పాల్పడ్డారని మృతుల బంధువులు ఆరోపిస్తున్నారు. వీరి ఆత్మహత్యకు కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.