చారిత్రక ఘట్టాలకు సాక్షి, సెకండ్ హౌస్, నాట్ సెకండరీ, మేధావులకు ప్రాతినిధ్యం: రాజ్యసభలో మోడీ
చారిత్రక ఘట్టాలకు రాజ్యసభ సాక్షిభూతంగా నిలిచిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. పార్లమెంట్లో రాజ్యసభ ముఖ్యభూమిక పోషిస్తోందని చెప్పారు. దేశ అభివృద్ధిలో దిగువసభ లోక్‌సభతోపాటు సమానంగా రాజ్యసభ పాత్ర కూడా ఉందని మోడీ గుర్తుచేశారు. రాజ్యసభ 250వ సెషన్ సందర్భంగా ప్రధాని మోడీ ఎగువసభలో ప్రసంగించారు. సభ్యులందరికీ అభినందలు చెప్పారు.

సాక్షిగా నిలిచాయి..
భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం కలిగి ఉంది అని మోడీ అన్నారు. ఇన్ని వైవిద్యతలకు ఉభయసభలు సాక్ష్యంగా నిలుస్తున్నాయని చెప్పారు. కీలక బిల్లులకు ఆమోదం తెలిపి ఉభయ సభలు చరిత్ర సృష్టించాయని తెలిపారు. చారిత్రక ఘట్టాలకు రాజ్యసభ సాక్ష్యంగా నిలిచిందన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కూడా రాజ్యసభ సభ్యునిగానే పార్లమెంట్లో అడుగుపెట్టాడని మోడీ గుర్తుచేశారు.

మేధావులకు ప్రాతినిధ్యం
లోక్‌సభకు ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ప్రతినిధులు ఎన్నకవగా.. రాజ్యసభలో మాత్రం రాజకీయలతో సంబంధం లేని వారు మాత్రం ఆశీనులయ్యే అవకాశం ఉందన్నారు. వివిధ వర్గాలకు చెందిన మేధావులకు కూడా చోటు కల్పిస్తారని గుర్తుచేశారు. రాజ్యసభలో అనుభవజ్ఞులు, మేధావులతో నిండి ఉంటుందని చెప్పారు. మహిళ సాధికారతకు కట్టుబడి ఉన్నామని మోడీ మరోసారి స్పష్టంచేశారు.

సెకండరీ కాదు
మాజీ ప్రధాని అటల్ బిహరీ వాజ్‌పేయి రాజ్యసభ ఔన్నత్యం గురించి చాలా సందర్భాల్లో తెలిపారని పేర్కొన్నారు. రాజ్యసభ రెండో సభనే కానీ.. అస్థిత్వం, ఉనికి లేని సభ కాదని పేర్కొన్నారు. రాజ్యసభ సెకండ్ సభ కానీ... సెకండరీ సభ కాదని స్పష్టంచేశారు. గొప్ప నేతలు, మేధావులు రాజ్యసభ నుంచి ప్రాతినిధ్యం వహించారని మోడీ తెలిపారు.

పరిష్కారమార్గం..
ఎన్నో ఏళ్లుగా వేధిస్తోన్న సమస్యలకు రాజ్యసభ పరిష్కారం చూపగలిగిందని చెప్పారు. ముస్లిం మహిళల పట్ల బ్రహ్మస్త్రం త్రిపుల్ తలాక్ బిల్లుకు రాజ్యసభ ఆమోదంతోనే చట్టరూపం దాల్చిందని చెప్పారు. విలువ ఆధారిత పన్ను స్థానంతో జీఎస్టీ అమలు చేశామని చెప్పారు. కశ్మీర్‌కు సంబంధించి ఆర్టికల్ 370 రద్దు సమయంలో కూడా రాజ్యసభ అభిప్రాయం తీసుకొని ముందుడుగు వేశామని మోడీ వివరించారు.

1991 నుంచి
మారుతున్న కాలంతోపాటు మారేందుకు రాజ్యసభ పాటుపడుతుందని ప్రధాని మోడీ చెప్పారు. తాను సభలో మాట్లాడే అవకాశం ఇచ్చిన చైర్మన్‌కు ధన్యవాదాలు తెలిపారు. తర్వాత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభ 250 సెషన్ గురించి ప్రసంగించారు. తాను 1991 నుంచి సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నానని గుర్తుచేశారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!