యూపీ అసెంబ్లీ పోరు- ఎస్పీ-ఆర్జేడీకి మద్దతు ఒట్టిదే- రైతు సంఘాల నేత రాకేష్ తికాయత్ క్లారిటీ
ఉత్తర్ ప్రదేశ్ లో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ, రాష్ట్రీయ లోక్ దళ్ కూటమికి తాము మద్దతిస్తున్నట్లు వచ్చిన వార్తల్ని రైతు సంఘాల నేత రాకేష్ తికాయత్ ఖండించారు. ఎస్పీ-ఆర్ఎల్డీ కూటమికి తాము మద్దతివ్వడం లేదని ఆయన స్పష్టం చేశారు. విపక్ష కూటమికి మద్దతు విషయంలో గందరగోళం నెలకొందని ఆయన తెలిపారు.
అంతకుముందు ఆయన సోదరుడు, భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత నరేష్ తికాయత్.. బీజేపీకి వ్యతిరేకంగా ఈ ఎన్నికల్లో ఎస్పీ-ఆర్ఎల్డీ కూటమికి మద్దతిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఈ వ్యవహారంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కేంద్రంలో, యూపీలో ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలతో రైతులు జట్టు కట్టారన్న చర్చ తలెత్తింది. దీంతో జోక్యం చేసుకున్న రాకేష్ తికాయత్... దీనిపై తాజాగా క్లారిటీ ఇచ్చారు.

ఎస్పీ-ఆర్ఎల్డీ కూటమికి తాము ఎటువంటి మద్దతు ఇవ్వలేదని, ప్రజలు అర్థం చేసుకోవడంలో పొరపాటు చేశారంటూ రాకేష్ తికాయత్ వ్యాఖ్యానించారు. ఎస్పీ-ఆర్ఎల్డీ కూటమికి నరేష్ తికాయత్ మద్దతు తెలుపుతున్నట్లు సూచిస్తున్న వీడియో ఒకటి తాజాగా విడుదలైంది. దీనిపై ఆయన్ను ప్రశ్నించగా.. తాము ఇంకా ఎటువంటి మద్దతును అందించలేదని, తమ అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా కూడా త్వరలో దీనిపై క్లారిటీ ఇస్తామని రాకేష్ తికాయత్ వెల్లడించారు.
ఎవరైనా తమ వద్దకు ఓటేయాలని కోరినా వారికి మద్దతివ్వడం లేదని, ఎవరికీ మద్దతివ్వరాదనేది తమ నిర్ణయమని ఆయన పేర్కొన్నారు. ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారని తెలిస్తే వారేం చేస్తారో తెలుసంటూ బీజేపీని ఉద్దేశించి తికాయత్ పరోక్ష వ్యాఖ్యలు చేశారు.