వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏడేళ్ల జైలు శిక్ష: నాంపల్లి కోర్టులో సవాల్ చేసిన రామలింగరాజు

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సత్యం కుంభకోణం కేసులో దోషులుగా నిర్ధారితమై జైలు శిక్ష అనుభవిస్తున్న రామలింగ రాజు, ఆయన సోదరుడు రామరాజులు సోమవారం నాడు నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తీర్పును సవాల్ చేస్తూ వారు అప్పీల్ పిటిషన్ దాఖలు చేశారు. వారు ఏడేళ్ల జైలు శిక్షను సవాల్ చేశారు. ప్రత్యేక కోర్టు తీర్పు కొట్టివేయాలని వారు కోరారు. న్యాయస్థానం కేసు విచారణను బుధవారానికి వాయిదా వేసింది.

కాగా, సత్యం కుంభకోణం కేసులో రామలింగ రాజుకు, మరో తొమ్మిది మందికి నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టు ఏడేళ్ల జైలు శిక్షను, నగదు జరిమానాను విధించిన విషయం తెలిసిందే. దీనిపై పై కోర్టుకు అప్పీల్ చేసుకునేందుకు న్యాయస్థానం సమయమిచ్చింది. దీంతో సోమవారం రామలింగ రాజు నాంపల్లి కోర్టులో అప్పీల్ చేశారు.

కాగా, మూడు రోజుల క్రితం తనకు శిక్ష ఖరారు చేయడానికి ముందు రామలింగ రాజు న్యాయమూర్తికి తాను అందించిన సేవల గురించి వివరించిన విషయం తెలిసిందే. తన ఆరోగ్య పరిస్థితిని, తాను అందించిన సేవలను గుర్తించి తనకు శిక్ష తగ్గించాలని ఆయన న్యాయమూర్తిని కోరుకున్నారు.

Ramalinga Raju challenges in Nampally court

దేశం కోసం, సమాజం కోసం తాను చాలా చేశానని, వాటిని కూడా దృష్టిలో ఉంచుకుని శిక్షను ఖరారు చేయాలని సత్యం కంప్యూటర్స్ వ్యవస్థాపక చైర్మన్ బైర్రాజు రామలింగరాజు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తిని వేడుకున్నారు. మీపై నేరం రుజువైందని, మీకు గరిష్ఠంగా 14 ఏళ్లు జైలు శిక్ష, అపరిమితమైన జరిమానా విధించవచ్చని, శిక్ష ఖరారు చేసేముందు చెప్పుకునేది ఏమైనా ఉందా అని న్యాయమూర్తి రామలింగరాజును అడిగినప్పుడు ఆయన చెప్పిన మాటలు ఇలా ఉన్నాయి.

నేను దేశం కోసం చేసిన కొన్ని సేవలను మీ ముందుంచాలని భావిస్తున్నాను. దేశంలోనే మొదటిసారిగా 108 సర్వీసులను ప్రారంభించాను. అమెరికాలో 911 సర్వీసు తరహాలో ఈ విధానాన్ని ప్రవేశపెట్టాం. 108 సర్వీసుల ద్వారా ఒక మిలియన్ ప్రాణాలను కాపాడాం. ఆపదలో ఉన్న 35 మిలియన్ల ప్రజలకు సర్వీసు అందించాం. ఈ సర్వీసు ద్వారా 40 వేల మందికి ఉపాధి కల్పించాం.

దేశవ్యాప్తంగా 700 మిలియన్ల ప్రజలకు ఈ సర్వీసు ద్వారా సేవలు అందించాం. బైర్రాజు ఫౌండేషన్ ద్వారా 200 గ్రామాలకు ప్రత్యక్షంగా, సమీపంలోని గ్రామాలకు పరోక్షంగా 30 రకాల సేవలను అందించాం. ఇందులో విద్య, వైద్యం, పర్యావరణం, జీవనోపాధి తదితర సేవలు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాలకు ఇంటి దగ్గరకే మినరల్ వాటర్‌ను తొలిసారిగా అందించాం. స్వర్గీయ అంజిరెడ్డితో కలిసి నాంది ఫౌండేషన్‌ను స్థాపించాం.

ఈ సంస్థ 14 రాష్ట్రాల్లో సమర్ధంగా ప్రజలకు సేవలు అందిస్తోంది. పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియాను స్థాపించిన వ్యక్తుల్లో నేనూ ఉన్నాను. ప్రజలకు వైద్యం అందివ్వడంలో ఈ సంస్థ బాగా పనిచేస్తోంది. ప్రపంచంలోనే ఉత్తమ బిజినెస్ స్కూల్‌గా గుర్తింపు పొందిన ఇండియన్ బిజినెస్ స్కూల్‌ను ప్రారంభించిన సభ్యుల్లో నేనూ ఉన్నా. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు 104 సర్వీసును ప్రారంభించాం.

సత్యం కంప్యూటర్స్ ద్వారా 55 వేల మందికి ఉపాధి కల్పించాం. అనేక సంస్థలకు ఐటీ సేవలను అందించాం. దేశంలోనే మొదటిసారిగా సిఫీ ఇంటర్‌నెట్ సంస్థను స్థాపించి ప్రజలకు ఇంటర్‌నెట్‌ను అందుబాటులోకి తెచ్చాం. ఈ సంస్థకు 260 మిలియన్ ఇంటర్‌నెట్ కనెక్షన్లు ఉన్నాయి. శాటిలైట్ వ్యవస్థను అనుసంధానం చేయడం ద్వారా ఆఫ్ షోర్ సర్వీసులను అందించాం.

జాయింట్ వెంచర్ ద్వారా కాగ్నిజెంట్ కంపెనీతో కలిసి 2.11 లక్షల మందికి ఉపాధి కల్పించాం. ఇందులో 80 శాతానికి పైగా భారతీయులే ఉన్నారు. సత్యం కంపెనీని టెక్ మహీంద్ర కొనుగోలు చేసేనాటికి షేర్ విలువ 58 రూపాయలు ఉండగా ప్రస్తుతం 320 రూపాయలు ఉంది.

ఇటీవలే మదుపుదార్లకు బోనస్ షేర్‌లను కూడా ఇచ్చారు. సమాజానికి ప్రయోజనకరమైన పనులు ఎన్నో చేశా. 33 నెలలపాటు రిమాండ్‌లో ఉన్నా. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని శిక్షను ఖరారు చేయండి.

"కుటుంబానికి మేమే ఆధారం. ఈ కేసు నమోదు చేసినప్పటి నుంచి ఆరేళ్లుగా తీవ్రమైన మానసిక క్షోభను అనుభవిస్తున్నాం. 30 నెలలు జైల్లో ఉన్నాం. మా కుటుంబాలు అన్ని రకాలుగా చితికిపోయాయి. బంధువులు, మిత్రులు మమ్మల్ని సాంఘికంగా బహిష్కరించారు. మా మీదే ఆధారపడి పిల్లలు, భార్య, తల్లిదండ్రులు ఉన్నారు. తల్లిదండ్రులు వృద్ధాప్యంలో అనారోగ్యంతో ఉన్నారు.

వారిని పోషించాల్సిన బాధ్యత మాపైనే ఉంది. దాదాపు మూడేళ్లు విచారణ ఖైదీలుగా ఉన్నాం. చాలా నెలలు రిమాండ్ ఖైదీలుగా జైలులో ఉన్నాం. మేం చేసిన అపరాధానికి ఈ శిక్ష సరిపోతుందని భావిస్తున్నాం'' అని ఇతర నిందితులు కూడా న్యాయమూర్తికి నివేదించారు. తాను తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నానని, ఈ కేసు తర్వాత తన కుమార్తెకు పెళ్లి సంబంధాలు కూడా రావడం లేదు మరో నిందితుడు ప్రభాకర్‌గుప్తా న్యాయమూర్తికి నివేదించారు.

English summary
Satyam Ramalinga Raju challenges in Nampally court
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X