శివసేన మళ్లీ బీజేపీతో కలవాలి, లేదంటే ఎన్సీపీ శరద్ పవార్ కలుస్తారు, పెద్ద పదవి: కేంద్రమంత్రి
ముంబై: కేంద్రమంత్రి, ఆర్పీఐ(ఏ) పార్టీ నేత రాందాస్ అథవాలే సంచలన వ్యాఖ్యలు చేశారు. శివసేన మహారాష్ట్రలో మళ్లీ బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని అన్నారు. అధికారం పంచుకునే ఫార్ములాను రెండు కాషాయ పార్టీలకు ప్రతిపాదిస్తున్నట్లు తెలిపారు.

బీజేపీతో శివసేన మళ్లీ కలవాలి..
సోమవారం అథవాలే మీడియాతో మాట్లాడుతూ.. శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే ఏడాదిపాటు సీఎంగా ఉండాలని, ఆ తర్వాత మూడేళ్లపాటు ఆ పదవిలో బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ఉంటారని సూచించారు. ఒకవేళ బీజేపీతో శివసేన బంధం ఏర్పరచుకునేందుకు ముందుకు రాకపోతే.. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఎన్డీఏతో కలుస్తారంటూ వ్యాఖ్యానించారు.

అలా చేస్తే.. శరద్ పవార్‌కు పెద్ద పదవి..
అంతేగాక, ఎన్డీయేతో శరద్ పవార్ చేతులు కలిపితే ఆయనకు భవిష్యత్తులో పెద్ద పదవి వచ్చే అవకాశం ఉందని కేంద్రమంత్రి అథవాలే చెప్పుకొచ్చారు. మాజీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌ను శివసేన ఎంపీ సంజయ్ రౌత్ శనివారం ఓ హోటల్లో కలవడంపై అనేక ప్రచారాలు జరుగుతున్న నేపథ్యంలో కేంద్రమంత్రి అథవాలే ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది.

మూడేళ్లపాటు బీజేపీ సీఎం, శివసేనకు కేంద్రమంత్రి పదవులు
అయితే, ఫడ్నవీస్‌ను ఇంటర్వ్యూ కోసమే కలిసినట్లు సామ్నా పత్రిక ఎగ్జిక్యూటివ్ ఎడిటర్‌గా ఉన్న రౌత్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే అథవాలే స్పందించారు. శివసేన బీజేపీతో మళ్లీ కలిస్తే ఉద్ధవ్ థాక్రే ఏడాదిపాటు, మిగితా మూడేళ్లు దేవేంద్ర ఫడ్నవీస్ సీఎంగా కొనసాగవచ్చని తెలిపారు. అంతేగాక, శివసేనకు ఒకటి లేదా రెండు కేంద్రమంత్రి పదవులు కూడా దక్కే అవకాశం ఉంటుందన్నారు. 2019 మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ, శివసేన కలిసి పోటీ చేసిన విషయం తెలిసిందే. అయితే, సీఎం కోసం శివసేన పట్టుబట్టడంతో ఈ బంధం తెగింది. దీంతో కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
శివసేన సీఎంతోపాటు పలు మంత్రి పదవులు పొందగా, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యమయ్యాయి.