వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆర్‌బీఐ: అంబానీ, అదానీ.. సొంత బ్యాంకులు ఏర్పాటు చేసుకుంటే ఏమవుతుంది?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
ఆర్‌బీఐ

దేశంలో పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు సొంత బ్యాంకులు ఏర్పాటు చేసుకునేందుకు వీలు కల్పించాలని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ)కి చెందిన ఇంటర్నల్ వర్కింగ్ గ్రూప్ (ఐడబ్ల్యూజీ) సూచించింది.

అంటే.. అంబానీ, అదానీ, టాటా, పిరామల్, బజాజ్ లాంటి పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు లైసెన్సులు తీసుకుని బ్యాంకులు ఏర్పాటుచేసుకొనేందుకు అనుమతించాలని చెప్తోంది.

ప్రైవేటు బ్యాంకుల విధివిధానాలు, యాజమాన్య నిబంధనలు, మార్గదర్శకాలను సమీక్షించేందుకు ఏర్పాటైన ఈ కమిటీ విడుదల చేసిన తాజా నివేదిక చర్చనీయాంశంగా మారింది.

''స్వాతంత్ర్యం అనంతరం వాణిజ్య బ్యాంకులు (కార్పొరేట్ సంస్థల ఆధీనంలో ఉన్నవి) సామాజిక లక్ష్యాలను చేరుకోవడంలో వెనుకపడ్డాయి. అందుకే భారత ప్రభుత్వం 1969లో ఆరు అతి పెద్ద వాణిజ్య బ్యాంకులను జాతీయం చేసింది. అలానే 1980లో మరో 14 బ్యాంకులను జాతీయకరణ చేశారు’’ అని ఐడబ్ల్యూజీ తన నివేదికలో పేర్కొంది.

''అయితే, 1990ల్లో ఆర్థిక సంస్కరణల తర్వాత ప్రైవేటు బ్యాంకుల పాత్ర పెరిగింది. ఇవి ప్రజల్లోకి చొచ్చుకొని వెళ్తున్నాయి. గత కొన్నేళ్లలో భారత బ్యాంకింగ్ రంగం విస్తృతంగా పెరిగింది. కానీ ఇప్పటికీ బ్యాంకుల మొత్తం బ్యాలెన్సు షీటు చూస్తే.. భారత జీడీజీలో 70 శాతం మాత్రమే ఉంది. ప్రపంచంలోని మిగతా దేశాలతో పోలిస్తే.. ఇది చాలా తక్కువ. పైగా భారత్‌లో ఆర్థిక రంగాన్ని బ్యాంకులే ముందుండి నడిపిస్తాయి’’ అని ప్రస్తావించింది.

ఎస్బీ‌ఐ

బ్యాంకుల అసవరం ఎంత?

బ్యాంకుల బ్యాలెన్స్ షీట్లు జీడీపీలో కేవలం 70 శాతం మాత్రమే ఉంది అంటే.. అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలో డిమాండ్‌ను బ్యాంకులు అందుకోలేకపోతున్నట్లే.

ప్రపంచంలో అతి పెద్ద వంద బ్యాంకుల్లో భారత్‌కు చెందిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రమే చోటు దక్కించుకోగలిగింది.

మరోవైపు ప్రభుత్వ బ్యాంకులతో పోల్చినప్పుడు, ప్రైవేటు రంగ బ్యాంకులు మెరుగ్గా రాణిస్తున్నాయని నివేదికలో పేర్కొన్నారు. ఇవి రిస్కులు తీసుకోవడంలో ముందుండటంతో పాటు, వీటి సామర్థ్యం, లాభాలు ఎక్కువగా ఉన్నాయని వివరించారు.

''గత ఐదేళ్లలో ప్రభుత్వ రంగ బ్యాంకుల మార్కెట్ షేర్ క్రమంగా తగ్గుతూ వస్తోంది. అదే సమయంలో ప్రైవేటు రంగ బ్యాంకుల పాత్ర పెరుగుతోంది’’ అని నివేదికలో చెప్పారు.

భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఐదు ట్రిలియన్ డాలర్లకు పెరగాలంటే, కచ్చితంగా బ్యాంకింగ్ రంగాన్ని మరింత విస్తరించాల్సి ఉంది. ఈ కోణంలోనే తాజా వర్కింగ్ గ్రూప్ మార్గదర్శకాలను సిద్ధంచేశారు.

రఘురామ్ రాజన్

సమస్య ఎక్కడ?

ఈ విషయంపై ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్, మాజీ డిప్యూటీ గవర్నర్ విరాల్ ఆచార్య కూడా స్పందించారు. తన లింకిడ్‌ఇన్ ఖాతాలో మూడు పేజీల పోస్ట్‌ను రఘురామ్ షేర్ చేశారు. కార్పొరేట్ సంస్థలు బ్యాంకింగ్ రంగంలోకి అడుగుపెడితే చెడు పరిణామాలు చూడాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.

''పెద్దపెద్ద కార్పొరేట్ సంస్థలను బ్యాంకింగ్ రంగంలోకి అనుమతించే ముందు, వారిపై చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వానికి అధికారముందా? దీనిపై మేం చర్చలు పెట్టాలని అనుకోవట్లేదు. మరోవైపు ఇప్పటికే బ్యాంకింగ్ రంగంలో ఉన్న కార్పొరేట్ సంస్థల పాత్రను చాలా నియంత్రించాల్సిన అవసరముంది’’ అని వారిద్దరూ అభిప్రాయపడ్డారు.

ఒక వేళ కార్పొరేట్‌లు సొంత బ్యాంకులు పెట్టుకునే అధికారమిస్తే.. ఆర్థిక వ్యవహారాల నియంత్రణ శక్తి కొన్ని కార్పొరేట్ సంస్థల చేతుల్లోకి వెళ్లిపోతుందని వారు అభిప్రాయపడ్డారు.

యస్ బ్యాంక్

ఈ కార్పొరేట్ సంస్థలకు ఆర్థికపరమైన అవసరాలు ఉంటాయి. వీటి కోసం అవి తమ సొంత బ్యాంకుల నుంచే డబ్బులను తీసుకొనే పరిస్థితి వస్తుంది. దీని వల్ల నిరర్ధక ఆస్తులు పెరుగుతాయి.

''చరిత్రలో చూసుకుంటే, కార్పొరేట్ సంస్థలతో సంబంధాలున్న బ్యాంకులు దివాళా తీసిన దాఖలాలు చాలా ఉన్నాయి. అప్పు తీసుకునే వారే బ్యాంకుకూ యజమాని అయితే, అన్ని జాగ్రత్తలూ తీసుకొని రుణాలు ఇస్తారని ఎలా చెప్పగలం?’’ అని రఘురామ్, రాజన్, విరాల్ ఆచార్యలు వ్యాఖ్యానించారు.

''ఎంత స్వతంత్రంగా వ్యవహరించినప్పటికీ, అన్ని రకాల రుణాలపైనా దృష్టి సారించడం కష్టం. మరోవైపు రుణాలకు సంబంధించిన సమాచారం కూడా సకాలంలో బయటపడదు. యస్ బ్యంకు ఇలానే తమ క్రెడిట్ సమాచారాన్ని దాచిపెట్టగలిగింది. మరోవైపు బ్యాంకుల నియంత్రణ సంస్థపై కూడా రాజకీయ ఒత్తిళ్లు ఎక్కువ అవుతాయి’’ అని వారిద్దరూ తమ పోస్టులో రాసుకొచ్చారు.

మరిన్ని ప్రమాదాలు

''అప్పుల ఊబిలో కూరుకుపోవడమే కాకుండా, రాజకీయాలతో సంబంధమున్న కార్పొరేట్ సంస్థలు లైసెన్సుల కోసం ఒత్తిడి కూడా చేయగలవు. వీటి వల్ల రాజకీయాల్లో ఆర్థిక అంశాల పాత్ర మరింత పెరిగే అవకాశముంది’’ అని వారు చెప్పారు.

భారత్‌కు మరిన్ని బ్యాంకులు అవసరమనే వాదనను వారిద్దరూ అంగీకరిస్తున్నారు. జీడీపీకి సరిపడా నగదు బ్యాంకుల్లో జమ కావడంలేదని, అందుకే బ్యాంకుల పాత్ర పెరగాలనీ వారు ఒప్పుకొంటున్నారు.

ఇదివరకు కూడా కార్పొరేట్ సంస్థలు పేమెంట్ బ్యాంకులు ఏర్పాటు చేసుకునేందుకు ఆర్‌బీఐ అనుమతించింది. ఈ చెల్లింపు బ్యాంకులు.. ఇతర బ్యాంకులతో అనుసంధానమై పర్సనల్ లోన్స్, క్రెడిట్ కార్డులు తదితర సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావొచ్చు.

ఇలాంటి సదుపాయాలు మనకు అందుబాటులో ఉన్నప్పుడు.. పూర్తిస్థాయి బ్యాంకుల ఏర్పాటుకు అనుమతి ఇవ్వడం ఎందుకు? యస్ బ్యాంక్, ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ల దివాళా నుంచి మనం పాఠాలు నేర్చుకోలేదా?

ఈ మార్గదర్శకాల వెనుకున్న ఆలోచన, వీటిని విడుదల చేసిన సమయం పక్కనపెడితే.. సరిగ్గా పనిచేయని ప్రభుత్వ రంగ బ్యాంకులను కార్పొరేట్‌ల చేతులకు అప్పగించడం హాస్యాస్పదమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ప్రభుత్వ బ్యాంకులను కార్పొరేట్‌ల చేతుల్లో పెట్టడమంటే.. చెడ్డ యాజమాన్యం నుంచి ఈ బ్యాంకులను వివాదాస్పద యాజమాన్యం చేతికి అప్పగించడమే.

అంతర్జాతీయ రేటింగ్ సంస్థ ఎస్‌అండ్‌పీ రేటింగ్స్ కూడా ఈ మార్గదర్శకాలపై చాలా సందేహాలను వ్యక్తంచేసింది. ''కార్పొరేట్‌లను బ్యాంకుల ఏర్పాటుకు అనుమతించడం, ఆర్థిక శక్తి కేంద్రీకరణ, ఆర్థిక ఒడిదొడుకులు.. ఇవన్నీ రిస్క్‌లను పెంచేవే’’ అని సంస్థ పేర్కొంది.

భారత్‌లో బ్యాంకింగ్ కార్యకలాపాలు పెరగాలని చెప్పడంలో ఎలాంటి సందేహమూ లేదు. అయితే, ప్రభుత్వ రంగ బ్యాంకులు తమ పాత్రను పూర్తిగా నిర్వర్తించలేకపోతున్నాయి.

కరోనావైరస్ వ్యాప్తి నడుమ ప్రభుత్వం చాలా సవాళ్లను ఎదుర్కొంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో పెద్దపెద్ద కార్పొరేట్ సంస్థలకు బ్యాంకులు ఏర్పాటుచేసుకునే అనుమతి ఇవ్వడమనేది కొంతవరకు ఉపయోగమే. కానీ, బ్యాంకులను పూర్తిగా కార్పొరేట్‌లే నిర్వహించడం ఎంతవరకు మంచిదో ఆర్‌బీఐనే చెప్పాలి.

ఈ కమిటీ రిపోర్టుపై 2021 జనవరి 15 లోపల స్పందించాలని ప్రజలకు ఆర్‌బీఐ సూచించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
What happens if Ambani and Adani set up their own banks?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X