దివాలా దిశగా అనిల్ అంబానీ సంస్థ రిలయన్స్ కమ్యూనికేషన్స్..అమ్మకానికి ఆస్తులు
న్యూఢిల్లీ: అనిల్ అంబానీ సంస్థ రిలయన్స్ కమ్యునికేషన్ (ఆర్‌కాం) దివాలా తీసిందా... దివాలా తీసిన కేసులను వాదించే కోర్టుకు త్వరలో వెళ్లనున్నారా అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది. అనిల్ అంబానీ నడుపుతున్న రిలయన్స్ కామ్ సంస్థ కోసం తీసుకున్న అప్పులు తీర్చలేక తమ ఆస్తులను అమ్మి తద్వారా వచ్చే రూ.42వేల కోట్లు చెల్లించాలని భావిస్తున్నారు. అదికూడా 270 రోజుల్లో చెల్లిస్తానని అనిల్ అంబానీ చెబుతున్నారు. గత ఏడాదినర్రగా చెల్లిస్తానని చెప్పి చెల్లించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

చిల్లిగవ్వ కూడా చెల్లించని అనిల్ అంబానీ
గత ఏడాదినర్రకాలంగా రుణాలు ఇచ్చిన వారికి చిల్లి గవ్వ కూడా చెల్లించలేకపోయినట్లు బోర్డు తెలిపింది. దీంతో ఇక అప్పులు తీర్చలేమనే నిర్ణయానికి వచ్చేశామని ఇందుకోసమే ఆస్తులను అమ్మకాలకు పెట్టినట్లు ఆర్‌కాం బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది. అంతేకాదు పలు న్యాయపరమైన చిక్కులు తలెత్తడంతో ఆర్‌కాంకు సంబంధించి రూ.18వేల కోట్లు ఆస్తులను అమ్మలేకపోతోందని ప్రకటనలో తెలిపింది. దీనిపై భారతదేశం విదేశాలకు చెందిన 40కి పైగా రుణదాతల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఈ ఆస్తులు అమ్మేందుకు వీలుపడలేదని స్పష్టం చేసింది.ఇక రుణాలు ఇచ్చిన బ్యాంకుల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, చైనా డెవలప్మెంట్ బ్యాంక్‌లున్నాయి. యూనియన్ బ్యాంక్, కెనారా బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్, స్టాండర్డ్ ఛాటర్డ్ బ్యాంక్ మరియు హెచ్ఎస్బీసీ బ్యాంకులు రుణాలు ఇచ్చిన వాటిలో ఉన్నాయి.

నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌ను ఆశ్రయించనున్న అనిల్ అంబానీ
ఆర్‌కామ్ కింద పనిచేసే రెండు సంస్థలు అయిన రిలయన్స్ టెలికాం లిమిటెడ్ మరియు రిలయన్స్ ఇన్ఫ్రాటెల్ లిమిటెడ్ సంస్థలు త్వరలోనే ఓ వేగవంతమైన పరిష్కారం కోసం ముంబైలోని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌ను ఆశ్రయించనుంది. కోర్టును ఆశ్రయించడం అందరికీ ఆమోదయోగ్యంగా ఉందని... ఇలా వెళితే కోర్టు ఆదేశాల మేరకు రుణాలు ఇచ్చిన బ్యాంకులకు న్యాయం జరగడమే కాదు పారదర్శకత కూడా ఉంటుందని భావిస్తోంది సంస్థ. అంతేకాదు 270 రోజుల గడువులో చెల్లించేందుకు కూడా తాము సిద్దంగా ఉన్నట్లు వెల్లడించారు.

270 రోజుల్లో ఆస్తులు అమ్మి అప్పులు కడతాం
ఇలా ఉంటే అప్పు చెల్లించేందుకు గాను ఆర్‌కాం సంస్థ ముందుగా 122.4 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రం, మరియు 43వేల టెలికాం టవర్స్‌ను రిలయన్స్ సంస్థ జియోకు , కొంత రియల్ ఎస్టేట్ కెనడాకు చెందిన బ్రుక్‌ఫీల్డ్ సంస్థకు అమ్మాలని భావించింది. అయితే కోర్టుకు వెళ్లాలన్న నిర్ణయం కంపెనీ తీసుకోవడంతో ఇప్పుడు ఆ యోచన విరమించుకుంది. అయితే ఇప్పటికే నోడ్స్, మరియు ఫైబర్ రూ. 5వేల కోట్లకు అమ్మివేసింది.
ఇక కోర్టు కంపెనీ సమస్యను పరిష్కరించి అది కొద్ది రోజుల పాటు పనిచేసేలా కొందరి నిపుణులను అపాయింట్ చేస్తుంది. అంతేకాదు ఆస్తులు అమ్మేందుకు జరిగే బిడ్డింగ్‌ను వీరు పరిశీలించి మిగతా ఆస్తులు 270 రోజుల్లో అమ్ముడుపోయేలా చర్యలు తీసుకుంటారు. ఆ తర్వాత జియో సంస్థ ఆస్తులను కొనేందుకు ముందుకొచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!