షాక్: జియో యూ టర్న్, వినియోగదారుల డేటా లీక్, ఫిర్యాదు
న్యూఢిల్లీ:వినియోగదారుల వ్యక్తిగత సమాచారం , డేటా లీక్ కాలేదంటూ ప్రకటించిన రిలయన్స్ జియో మాటమార్చింది. తమ వినియోగదారుల సమాచారం లీకైందని పోలీసులకు ఫిర్యాదుచేసింది. ఈ మేరకు డేటా లీక్ అయిందని జియో నుండి ఫిర్యాదు అందిందని పోలీసులు ప్రకటించారు.
తమ కంప్యూటర్ వ్యవస్థలోకి అక్రమ చొరబాట్లు జరిగాయంటూ ముంబై పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో రిలయన్స్ జియో ఆరోపించింది. దీంతో కస్టమర్ల సమాచారం భారీగా లీకైందనే వార్తలను నమ్మొదంటూ కొట్టిపారేసిన జియో డేటాలీక్‌ను ఒప్పుకొంది.

ఈ వ్యవహరంపై బెంగుళూరుకు చెందిన వెబ్ భద్రతా సలహదారు ఆకాష్ మహజన్ స్పందిస్తూ డేటాలీక్ అనేది కంపెనీ భద్రతా డొల్లతనాన్ని ప్రదర్శిస్తుందన్నారు. అందుకే ఇండియాలో చాలా కంపెనీలు డేటా ఉల్లంఘనలను తరచూ అంగీకరించడం లేదన్నారు.
అయితే మాజిక్ ఏపీకే వెబ్‌సైట్‌లో జియో కస్టమర్ల వ్యక్తిగత సమాచారం బహిర్గతం కావడం ఆందోళనరేపింది. వినియోగదారుల ఈ మెయిల్, ఆధార్ నెంబర్, మొబైల్ నంబర్లను ఈ వెబ్‌సైట్‌లో దర్శనమిచ్చాయి. మరోవైపు లీకేజీకి సంబంధించి రాజస్థాన్‌కు చెందిన ఇమ్రాన్ చింపా అనే యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
నిందితుడు చింపాను ముంబైకు తరలించి ఇన్పర్మేషన్ టెక్నాలజీ చట్టం ప్రకారం కేసు నమోదుచేశారు పోలీసులు. దాదాపు 12 కోట్ల జియో వినియోగదారులు తన ఆధార్‌కార్డు నమోదు ద్వారా జియో సిమ్ ను తీసుకొన్నారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!