ఆ హక్కు మీడియాకుంది: ‘సునంద కేసు’పై కోర్టు, అర్నబ్‌కు ఊరట
న్యూఢిల్లీ: ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పుతో ప్రముఖ జర్నలిస్టు అర్నబ్ గోస్వామి, ఆయన ఆధ్వర్యంలో నడుస్తున్న రిపబ్లిక్ టీవీకి ఊరట లభించింది. ఏదైనా కేసులో పరిశోధనాత్మక జర్నలిజంను నిరోధించజాలమని స్పష్టం చేసింది.
కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ భార్య సునంద పుష్కర్ అనుమానాస్పద మరణానికి సంబంధించి చర్చలు, వార్తలు ప్రసారం చేయకుండా నిరోధించజాలమని తెలిపింది. రిపబ్లిక్ టీవీ, అర్నబ్ గోస్వామిలపై శశి థరూర్ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు ఈ మేరకు తీర్పునిచ్చింది. అయితే ఈ అంశంపై కథనాలను ప్రసారం చేయడానికి ముందు శశి థరూర్ వివరణను తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది.

థరూర్ వివరణ కోరాల్సింది..
జస్టిస్ మన్మోహన్ ఇచ్చిన ఈ తీర్పులో శశి థరూర్‌కు సంబంధించిన ఏదైనా కథనాన్ని ప్రసారం చేయడానికి ముందు రిపబ్లిక్ టీవీ, అర్నబ్ గోస్వామి లిఖితపూర్వకంగా, ఎలక్ట్రానిక్ విధానంలో ఆయన వాదనను కోరాలని తెలిపారు. ఒకవేళ శశి థరూర్ సమంజసమైన సమయంలోగా సమాధానం చెప్పేందుకు తిరస్కరించినా, సమాధానం ఇవ్వకపోయినా, ఆయనను బలవంతం చేయకూడదని స్పష్టం చేశారు.

పరువు తీశారంటూ థరూర్
ఆ తర్వాత శశి థరూర్ తమతో మాట్లాడేందుకు తిరస్కరించారని పేర్కొంటూ ఆ కథనాన్ని ప్రసారం చేసుకోవచ్చునని స్పష్టం చేశారు. శశి థరూర్ తన పిటిషన్‌లో రిపబ్లిక్ టీవీ, అర్నబ్ గోస్వామిపై తీవ్ర ఆరోపణలు చేశారు. తన పరువు, ప్రతిష్ఠలకు భంగం కలిగిస్తున్నారని ఆరోపించారు. తన భార్య సునంద పుష్కర్ మరణంపై పోలీసు దర్యాప్తు పూర్తయ్యే వరకు ఎటువంటి వార్తలను లేదా చర్చలను ప్రసారం చేయరాదని ఆదేశించాలని కోరారు.

తిరస్కరించిన హైకోర్టు..
ఇప్పటి వరకు తన పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించినందుకు రిపబ్లిక్ టీవీ, అర్నబ్ గోస్వామిల నుంచి తనకు నష్ట పరిహారం ఇప్పించాలని కోరారు. దీనిపై స్పందించిన హైకోర్టు రిపబ్లిక్ టీవీపై ఆంక్షలు విధించేందుకు తిరస్కరించింది. తమ కథనాలను ప్రసారం చేసుకునే హక్కు రిపబ్లిక్ టీవీ, అర్నబ్ గోస్వామిలకు ఉందని స్పష్టం చేసింది. అదే సమయంలో సమతుల్యత, సంయమనంతో వ్యవహరించాలని కోర్టు స్పష్టం చేసింది.

జాగ్రత్తలు తీసుకోవాల్సిందే..
అంతేగాక, మీడియా రంగం ఎవరినీ నేరస్థుడిగా నిర్థారించజాలదని, అటువంటి సంకేతాలు ఇవ్వజాలదని హైకోర్టు తేల్చి చెప్పింది. దర్యాప్తు లేదా విచారణలో ఉన్న వివాదాలపై రిపోర్టింగ్ చేసేటపుడు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రెస్‌కి కోర్టు సూచించింది.
కాగా, సునంద పుష్కర్ జనవరి 17, 2014లో దక్షిణ ఢిల్లీలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో అనుమానాస్పద స్థితిలో మరణించిన విషయం తెలిసిందే.