భారత్‌పై ఇదీ పాక్ దుష్ట మంత్రాంగం : హిజ్బుల్‌కు రసాయన ఆయుధాల సప్లయి
న్యూఢిల్లీ: ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్‌కు పాకిస్థాన్ రసాయనిక ఆయుధాలను సమకూర్చుతోందన్న సంచలన సమాచారం తాజాగా వెలుగులోకి వచ్చింది. నిఘా సంస్థలు అందుకున్న ఉగ్రవాదుల సంభాషణల ఆడియోటేపులను సంపాదించిన ఒక ఆంగ్ల టీవీ చానల్ ఈ సంగతి బయటపెట్టింది. జమ్ముకశ్మీర్‌లో అల్లకల్లోలం సృష్టించడమే లక్ష్యంగా.. భారీగా ప్రజల ప్రాణాలు బలిగొనడమే లక్ష్యంగా పాకిస్థాన్ కుట్రకు పాల్పడుతున్నదని ఈ చానెల్ తెలిపింది.
ఇందుకోసం ఇంతకాలం గ్రెనేడ్లు, బాంబులు, తుపాకుల వంటి ఆయుధాల్ని వాడిన ఉగ్రవాదులు ఈసారి భారత ఆర్మీ ఊహించని రీతిలో రసాయనిక దాడి చేయాలని భావిస్తున్నారన్నది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్.. హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాదులకు రసాయన ఆయుధాలను అందజేసిందని భద్రతాదళాలు అనుమానిస్తున్నాయి. భద్రతాదళాలకు లభించిన పలు ఆడియోలు దీనిని బలపరుస్తున్నాయి. ఉగ్రవాదులకు పాకిస్థాన్ ఎలా సహకరిస్తున్నదనే దానికి ఈ ఆడియోలే నిదర్శనమని భద్రతాదళాలు పేర్కొంటున్నాయి.

ఎన్కౌంటర్లలో గత కొద్ది నెలలుగా 90 మంది సభ్యులను కోల్పోయిన హిజ్బుల్ ఉగ్రసంస్థ భారత సైన్యంపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఈ భయంకరమైన మార్గాన్ని ఎంచుకున్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రసాయనిక ఆయుధాలు ఇప్పటికే ఉగ్రవాదులకు చేరినట్లుగా కూడా ఆడియో సంభాషణల్లో తెలిసింది. ఇప్పటివరకు సంప్రదాయ ఆయుధాలు వాడిన ఉగ్రవాదులు తమను కోలుకోలేని దెబ్బ కొట్టిన భద్రతా బలగాలపై రసాయన ఆయుధాలతో మెరుపుదాడులు చేసేందుకు సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తున్నది. ఇందుకు తనవంతు సాయంగా పాకిస్తాన్ వారికి ఆయుధాలను సమకూర్చుతోంది.
ఏ క్షణమైనా దాడికి హిజ్బుల్ సిద్ధమా?

'పీర్ సాహెబ్ (లష్కరే తోయిబా చీఫ్ మహ్మద్ సయీద్)కు నేను కావాలి. నా వాళ్లు కూడా నన్ను కోరుకుంటున్నారు. మన తర్వాతి కార్యక్రమం ఈద్ తర్వాత ఉంటుంది' అని ఓ హిజ్బుల్ ఉగ్రవాది మాట్లాడాడు. 'అల్లా దయతో మనకు పాకిస్తాన్ నుంచి భారీ మద్దతు లభిస్తోంది. సరిహద్దులో పనులు జరుగుతున్నాయి' అని మరో ఉగ్రవాది అన్నాడు. మరో సందర్భంలో అదే ఉగ్రవాది మాట్లాడుతూ 'ఇప్పటివరకు మనం బారత ఆర్మీపై గ్రెనేడ్లను విసిరాం. ముగ్గురు, నలుగురు మాత్రమే చనిపోయేవారు. మన వ్యూహాలను మార్చాల్సిన సమయం ఇది. మనం రసాయనిక ఆయుధాలను వాడి ఒకే దాడిలో వీలైనంత ఎక్కువ మందిని చంపుదాం' అని అన్నాడు. కశ్మీర్లో ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ ప్రోత్సహిస్తోందనడానికి, ప్రేరేపిస్తోందనడానికి ఈ ఆడియో సంభాషణలే బలమైన సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి.

అమర్నాథ్ యాత్రికులపై దాడి హిజ్బుల్ పనేనా?
ఈ వార్తా కథనంపై బీజేపీ నేత ఆర్కే సింగ్ స్పందిస్తూ 'పాక్ రసాయనిక ఆయుధాలను సమకూరుస్తున్నట్లయితే, అది యుద్ధానికి దారితీస్తుంది. హిజ్బుల్ చీఫ్ దీనిపై జాగ్రత్తగా ఆలోచించాలి' అని అన్నారు. హిజ్బుల్ ముజాహిదీన్ కశ్మీర్లో అతిపెద్ద ఉగ్రవాద సంస్థ. ప్రస్తుతం దాదాపు 200 మంది సభ్యులు క్రియాశీలకంగా ఉన్నారు. అమర్నాథ్ యాత్రి కులపై సోమవారం రాత్రి జరిగిన దాడిలోనూ హిజ్బుల్ ఉగ్రవాదుల హస్తం ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. యాత్రికులపై దాడి లష్కరే తోయిబా పనేనని పోలీసులు చెబుతున్నారు. ఈ ఆరోపణలను లష్కరే ఖండించింది. తమపై నిందలు వేస్తున్నారనీ, అది ఇస్లాం సిద్ధాంతాలకు విరుద్ధంగా జరిగిన దాడి అని లష్కరే తెలిపింది.