వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణలో పెరుగుతున్న 'మిస్సింగ్' కేసులు, నాలుగు రోజుల్లో 266 మంది మాయం: ప్రెస్ రివ్యూ

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

తెలంగాణలో మిస్సింగ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నట్లు ఈనాడు ఒక కథనం ప్రచురించింది.

అలా ఆచూకీ దొరకనివారి సంఖ్య ఏటా కనీసం రెండు, మూడు వేలు ఉంటోంది.

గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది లాక్‌డౌన్‌ కారణంగా మొదటి ఆరునెలల్లో ఇలాంటి ఉదంతాలు తక్కువగానే నమోదయ్యాయి. కానీ ఇటీవల గణనీయంగా పెరుగుతున్నాయి.

గత నాలుగు రోజుల్లోనే ఏకంగా 266 మంది కనిపించకుండాపోయారు. గత ఏడాది సగటున రోజుకు 47 అదృశ్యం కేసులు నమోదుకాగా.. ఈ నాలుగు రోజుల సగటు 67గా ఉందని ఈనాడు చెప్పింది.

పోలీసుల దర్యాప్తు, కుటుంబసభ్యుల ప్రయత్నాలు ఫలించి ఏటా సగటున 85 శాతంమంది తిరిగి వస్తుండటం ఊరట కలిగిస్తోంది. మిగిలిన 15 శాతం మంది జాడ మాత్రం తెలియడంలేదు.

అదృశ్యం కేసుల్లో 16-35 ఏళ్ల వయస్కులవే ఎక్కువ ఉంటున్నాయి. వీరిలోనూ బాలికలు, మహిళలు ఎక్కువ. కుటుంబ విభేదాలు లేదా పెద్దల భయంతోనే చాలామంది మాయమవువుతున్నారు.

యుక్త, మధ్య వయస్కుల అదృశ్యం ఘటనలకు ఎక్కువగా ప్రేమ, వివాహేతర సంబంధాలు కారణమవుతున్నాయి. సామాజిక మాధ్యమాల్లో పరిచయమైనవారి పట్ల ఆకర్షితులై కొందరు గడప దాటుతున్నారు.

పరీక్షల్లో మార్కులు సరిగా రాలేదనే కారణంతో చిన్నారులు మాయమవుతుంటే.. ఆర్థిక ఇబ్బందులతో పలువురు మధ్య వయస్కులు ఇళ్ల నుంచి వెళ్లిపోతున్నారు.

వృద్ధుల అదృశ్యానికి పిల్లలు తమను సరిగా చూడటం లేదనేదే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. మతిస్థిమితం సరిగా లేకపోవడమూ మరో కారణంగా ఉంది.

అదృశ్యమైన చిన్నారుల ఆచూకీని కనిపెట్టడం కోసం పోలీసులు ముఖాలను గుర్తించే సాంకేతికతను వినియోగిస్తున్నారు. 'దర్పణ్‌’ పేరుతో ఒక యాప్‌ను ప్రవేశపెట్టారు.

చాలా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో ఈ కేసుల్లో పరిష్కారమవుతున్నవాటి శాతం (71.5) ఎక్కువగానే ఉందని ఒక పోలీసు అధికారి తెలిపారని ఈనాడు వివరించింది.

'ప్రధానిగారూ పోలవరంలో మీ చొరవ కావాలి’ - జగన్

పోలవరంలో ప్రాజెక్టు విషయంలో జోక్యం చేసుకోవాలంటూ ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేఖ రాశారని ఆంధ్రజ్యోతి దినపత్రిక వార్తా కథనం ప్రచురించింది.

జాతీయ ప్రాజెక్టు పోలవరం అంచనాలపై నెలకొన్న తాజా పరిస్థితి తలెత్తుకోలేనివిధంగా, ఇబ్బందికరంగా మారిందని ప్రధాని నరేంద్రమోదీకి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి తెలిపారు.

కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ పరిధిలోని సాంకేతిక సలహా కమిటీ సిఫారసు చేసిన రెండో సవరించిన అంచనాలు రూ.55,548.87 కోట్లను ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ మేరకు అక్టోబరు 28వ తేదీన ప్రధాని మోదీకి జగన్‌ లేఖ రాశారు. ఈ లేఖను శనివారం ఇరిగేషన్‌ క్యాంపు కార్యాలయంలో జలవనరుల శాఖ మంత్రి పి.అనిల్‌కుమార్‌ మీడియాకు విడుదలచేశారు.

''పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జాప్యమైతే.. విస్తృత ప్రయోజనాలకు విఘాతం కలుగుతుంది. ప్రాజెక్టు అంచనాల అంశంలో మీరే చొరవ తీసుకోవాలి. కేంద్ర ఆర్థిక శాఖ, జలశక్తి శాఖ మంత్రులతో సమావేశమై పరిస్థితిని చక్కదిద్దండి’’ అని ఆ లేఖలో సీఎం విజ్ఞప్తి చేశారని పత్రిక చెప్పింది.

సమాచార లోపం వల్లే ఈ సమస్య తలెత్తిందని ఆ లేఖలో జగన్‌ అభిప్రాయపడ్డారు.

విభజనచట్టంలో పోలవరాన్ని జాతీయ ప్రా జెక్టుగా ప్రకటించారు, నిర్మాణ వ్యయం.. సహాయ పునరావాసాలను చట్టం పరిధిలో భరిస్తామని చట్టంలో పొందుపరిచారు. ఈ చట్టం ప్రకారం రాష్ట్రం కేవలం కార్యనిర్వాహక బాధ్యతలు చేపడుతోంద’’న్నారని ఏపీ ముఖ్యమంత్రి లేఖలో తెలిపారని ఆంధ్రజ్యోతి వివరించింది.

పునరావాసానికే రూ.28,191 కోట్లు వ్యయం చేయాల్సి ఉండగా.. రూ.20.398.61 కోట్లతో పోలవరం ఎలా పూర్తి చేస్తాం?’’అని ప్రధాని మోదీని సీఎం జగన్‌ ప్రశ్నించారని పత్రిక రాసింది.

కాగా, పోలవరం అంచనాలపై ప్రధాని మోదీతో భేటీ అయ్యేందుకు సీఎం జగన్‌ సిద్ధమవుతున్నారని, సీఎంవో కార్యాలయం ప్రధాని అపాయింట్‌మెంట్‌ను కోరిందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయని ఆంధ్రజ్యోతి వివరించింది.

రైళ్లు

రైళ్లు ఢీకొనకుండా చేసే టీకాస్ పరికరం

ఎదురెదురుగా వచ్చే రైళ్లు ఢీకొనకుండా రైల్వే శాఖ 'టీకాస్; పరికరాన్ని తీసుకొచ్చిందని సాక్షి దినపత్రిక ఒక కథనం ప్రచురించింది.

దాదాపు దశాబ్దం నిరీక్షణ తర్వాత రైల్వే శాఖ.. రైళ్లు ఎదురెదురుగా వచ్చి ఢీకొనకుండా ఉపయోగపడే యాంటీ కొల్యూజన్‌ పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెస్తోంది.

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో తొలిసారి ముథ్కేడ్‌–సికింద్రాబాద్‌ సెక్షన్‌ పరిధిలోకి వచ్చే ఉమ్రి–సివన్‌గావ్‌ స్టేషన్ల మధ్య 21.5 కి.మీ. నిడివిలో దీన్ని ఏర్పాటు చేశారు.

రైల్వే శాఖ అధీనంలోని పరిశోధన సంస్థ ఆర్‌డీఎస్‌ఓ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో దీన్ని అభివృద్ధి చేసింది. ట్రైన్‌ కొల్యూజన్‌ అవాయిడెన్స్‌ సిస్టం (టీకాస్‌)గా పేర్కొనే ఈ పరిజ్ఞానాన్ని దేశంలో తొలుత దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని లింగంపల్లి–వికారాబాద్‌–వాడి, వికారాబాద్‌–బీదర్‌ సెక్షన్ల మధ్య పరీక్షించారు.

దాదాపు పదేళ్లుగా ఈ పరీక్షలు జరుగుతున్నాయని సాక్షి తెలిపింది.

ఇంతకాలం నిరీక్షణ తర్వాత దీన్ని వినియోగంలోకి తెచ్చేందుకు ఎట్టకేలకు రైల్వే బోర్డు పచ్చజెండా ఊపింది. ప్రయోగాత్మకంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఉమ్రి–సివన్‌గావ్‌ స్టేషన్ల మధ్య దీన్ని ఏర్పాటు చేశారు.

ఈ మార్గం సింగిల్‌ లైన్‌తో ఉండటంతో పాటు ఇక్కడ రైళ్ల రాకపోకలు కూడా తక్కువ. అందుకే పరీక్షలకోసం అనువుగా ఉంటుందని ఈ ప్రాంతంలో ఏర్పాటు చేశారు. శుక్రవారం నుంచి ఇది వినియోగంలోకి వచ్చిందని పత్రిక రాసింది..

రైలు లోకోపైలట్‌ (డ్రైవర్‌) సిగ్నల్‌ను విస్మరించి నా, బ్రేకులు వేయకపోయినా, నిర్ధారిత వేగాన్ని మించి రైలు దూసుకుపోతున్నా ఈ వ్యవస్థ వెంటనే హెచ్చరిస్తుంది.

అదే సమయంలో ఎదురెదురుగా రెండు రైళ్లు వస్తే రెండు రైళ్ల లోకోపైలట్లకు సంకేతాలు అంది అప్రమత్తం అయ్యేందుకు అవకాశం కలుగుతుంది.

అప్పటికీ బ్రేకులు వేయని పక్షంలో ఆటోమేటిక్‌గా రైళ్లు నిలిచిపోతాయి. ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన ఈ రెండు స్టేషన్ల మధ్య విద్యుత్తు సరఫరా సౌకర్యంతో కూడిన టీకాస్‌ యూనిట్లు సిద్ధం చేశారు.

ఇక్కడ వచ్చే ఫలితాలను పరిశీలించాక క్రమంగా ఈ పరిజ్ఞానాన్ని ఇతర ప్రాంతాలకు విస్తరించనున్నారని సాక్షి వివరించింది.

హైదరాబాద్ ప్లేఆఫ్స్ ఆశలు సజీవం

బెంగళూరుపై విజయంతో హైదరాబాద్ సన్ రైజర్స్ ప్లేఆఫ్స్ కు మరింత చేరువయ్యిందని నమస్తే తెలంగాణ దిన పత్రిక వార్తా కథనం రాసింది.

అనూహ్య మలుపులు తిరుగుతున్న ఐపీఎల్‌ 13వ సీజన్‌లో మ్యాచ్‌ మ్యాచ్‌కు సమీకరణాలు మారిపోతున్నాయి. వరుస విజయాలతో ప్లే ఆఫ్స్‌కు చేరడం పక్కా అనిపించిన బెంగళూరు కట్టుతప్పి హ్యాట్రిక్‌ పరాజయాలను మూటగట్టుకుంటే.. ఇక ముందుకెళ్లడం కష్టమే అనుకున్న హైదరాబాద్‌ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి దూసుకెళ్లింది.

సన్‌రైజర్స్‌ పటిష్ట బౌలింగ్‌ ముందు నిలువలేకపోయిన కోహ్లీ సేన.. బౌలింగ్‌లోనూ పెద్దగా ప్రభావం చూపలేక వరుసగా మూడో ఓటమిని ఆహ్వానించింది.

ఈ గెలుపుతో ఫుల్‌ జోష్‌లో ఉన్న 'డేవిడ్‌ భాయ్‌' గ్యాంగ్‌.. ఇక చివరి మ్యాచ్‌లో ముంబైని ఓడిస్తే.. ప్లే ఆఫ్స్‌కు చేరడం దాదాపు ఖాయమేనని పత్రిక రాసింది.

లీగ్‌లోనే పటిష్ట బౌలింగ్‌ లైనప్‌ ఉన్న హైదరాబాద్‌ అదే బలంతో మరో విజయాన్ని మూటగట్టుకుంది.

శనివారం రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ)తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది.

మొద ట బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 120 పరుగులు చేసింది. జోష్‌ ఫిలిప్‌ (32), డివిలియర్స్‌ (24) ఫర్వాలేదనిపించారు.

హైదరాబాద్‌ బౌలర్లలో 'మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌' సందీప్‌ శర్మ, హోల్డర్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

అనంతరం లక్ష్యఛేదనలో హైదరాబాద్‌ 14.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 121 పరుగులు చేసింది. వృద్ధిమాన్‌ సాహా (39), జాసన్‌ హోల్డర్‌ (10 బంతుల్లో 26 నాటౌట్‌; ఒక ఫోర్‌, 3 సిక్సర్లు) రాణించారని పత్రిక వివరించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
266 people in 4days go missing in Telangana
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X