ఉలిక్కిపడిన ఢిల్లీ; రోహిణి కోర్టులో పేలుడు ఘటన; రంగంలోకి ఎన్ఎస్జి బృందం
దేశ రాజధాని ఢిల్లీ ఒక్కసారిగా ఉలిక్కి పడింది . ఢిల్లీలో పేలుడు సంభవించడంతో ఒక్కసారిగా ఆందోళన చెలరేగింది. ఢిల్లీలోని రోహిణి కోర్టులో గురువారం ఉదయం జరిగిన పేలుడులో ఒక పోలీసు సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి. అతన్ని ఆసుపత్రికి తరలించారు. లాప్ టాప్ బ్యాటరీ పేలడం వల్ల ఘటన జరిగిందని ప్రాథమిక అంచనా వేసినప్పటికీ పేలుడు ఘటనకు కారణం టిఫిన్ బాంబు అని కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రోహిణీ కోర్టులో పేలుడు ఘటన.. పేలుడుపై ఢిల్లీ పోలీసుల ధృవీకరణ
ఒక్కసారిగా రోహిణి కోర్టులో పేలుడు ఘటన చోటు చేసుకోవడంతో కోర్టు ప్రాంగణంలోని వారంతా వణికిపోయారు. కోర్టులో కార్యకలాపాలు నిలిపివేయబడ్డాయి. అన్ని గేట్లను మూసివేసినట్లు అధికారులు తెలిపారు. కోర్ట్‌రూమ్ 102లోని ల్యాప్‌టాప్ పేలిపోయిందని ప్రాథమికంగా భావించినప్పటికీ, పేలుడు తక్కువ తీవ్రత కలిగిన బాంబు పేలుడు అని ఢిల్లీ పోలీసు ఉన్నత వర్గాలు ధృవీకరించాయి. సైట్ నుండి ఇంప్రూవైజ్డ్ పేలుడు పరికరం (IED) మరియు టిఫిన్ బాక్స్ లాంటి వస్తువును స్వాధీనం చేసుకున్నారు.
దర్యాప్తు చేస్తున్న ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం,ఎన్ఎస్జి బృందం
ఢిల్లీ పోలీసులు ఒక అధికారిక ప్రకటనలో, రోహిణి కోర్టు కాంప్లెక్స్‌లో ఉదయం 10.30 గంటల ప్రాంతంలో ల్యాప్‌టాప్ బ్యాగ్‌లో చిన్నపాటి పేలుడు సంభవించిందని వెల్లడించారు. ఘటనా స్థలాన్ని ఫోరెన్సిక్ మరియు ఎన్ఎస్జి బృందాలు పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. ఈ ఘటనపై ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం దర్యాప్తు చేస్తోంది. పోలీస్ - లా అండ్ ఆర్డర్ స్పెషల్ కమీషనర్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (NSG) బృందాన్ని కూడా పిలిచి మరీ దర్యాప్తు కొనసాగిస్తున్నారు

బ్యాగ్ లో పెట్టిన టిఫిన్ బాంబు వల్ల పేలుడు జరిగిందని అనుమానం, ఒకరికి గాయాలు
ఉదయం 10.40 గంటలకు పేలుడు సంభవించినట్లు తమకు సమాచారం అందిందని, ఏడు ఫైరింజన్లు ఘటనా స్థలానికి చేరుకున్నాయని అగ్నిమాపక అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే ఈ ఘటనలో ఒకరు గాయపడినట్లు రోహిణి బార్ అసోసియేషన్ ధ్రువీకరించింది బ్యాగ్ లో ఉంచిన ల్యాప్‌టాప్ బ్యాటరీ పని చేయకపోవడం వల్ల పేలుడు జరిగి ఉంటుందని కొందరు అనుమానిస్తుంటే ,బ్యాగ్ లో పెట్టిన టిఫిన్ బాంబు వల్లే పేలుడు జరిగిందని అయితే బీడీఎస్, ఎఫ్ఎస్ఎల్ నిపుణులు దానిని నిర్ధారించే వరకు ఏం జరిగిందనేది వెల్లడించలేమని అధికారులు చెబుతున్నారు.

రోహిణీ కోర్టులో వరుసగా చోటు చేసుకుంటున్న ఘటనలు , గతంలో కాల్పుల కలకలం
ఇదిలా ఉంటే గతంలో రోహిణి కోర్టు ఆవరణలో కాల్పులు చోటు చేసుకొని నలుగురు మరణించిన విషయం తెలిసిందే. గ్యాంగ్ స్టర్ అఖిల్ గోగి అలియాస్ జితేంద్ర లక్ష్యంగా జరిగిన కాల్పులలో గోగితో సహా నలుగురు మరణించారు. దుండగులు కాల్పులు జరిపిన వెంటనే అక్కడ ఉన్న ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ సిబ్బంది వారిపై కాల్పులు జరిపారు. ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ జరిపిన కాల్పుల్లో దుండగులు ఇద్దరు మరణించారు. 35 నుండి 40 రౌండ్లు కాల్పులు జరగడంతో కోర్టు ఆవరణలో ఒక్కసారిగా భయానక వాతావరణం నెలకొంది. ఇక ఈ కాల్పులలో ఒక మహిళా న్యాయవాదితో పాటు ముగ్గురు గాయపడ్డారు. దేశ రాజధాని ఢిల్లీలో రోహిణి కోర్టులో కాల్పుల ఘటన సెప్టెంబర్ నెలలో చోటు చేసుకోగా, తాజాగా డిసెంబర్ 9 గురువారం నాడు పేలుడు ఘటన చోటు చేసుకోవడం కలకలం రేపింది.