India
  • search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

RRR సినిమా రివ్యూ: రామ్‌చరణ్, ఎన్‌టీఆర్‌ల ఎలివేషన్లు, ఎమోషన్లతో వెండి తెరపై రాజమౌళి మరో దృశ్యకావ్యం లిఖించాడా?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

రాజ‌మౌళి క‌ల‌లెప్పుడూ ఖ‌రీదైనవిగానే ఉంటాయి. వెండితెర‌పై త‌మ‌దైన ఓ లోకాన్ని ఆవిష్క‌రిస్తాయి. సాంకేతికత ఒడిసిప‌ట్టుకోవ‌డం, హీరోయిజాన్ని ఆకాశ‌మంత స్థాయిలో నిల‌బెట్ట‌డం, ఎమోష‌న్స్‌ని ప‌క్కాగా క‌థ‌లో ఇమ‌డ్చ‌డం, ఎప్పుడు ఏ పాత్ర‌ని ప్ర‌వేశపెట్టాలో, ఎలాంటి భావోద్వేగాన్ని ప‌లికించాలో స‌రిగ్గా తూకం వేసుకోవ‌డం ఇవ‌న్నీ రాజ‌మౌళికి వెన్న‌తో పెట్టిన విష‌యాలు. అవే ఆయనకు విజ‌యాల్ని అందించాయి.

rrr

ముఖ్యంగా త‌న హీరోల్ని అమితంగా ప్రేమిస్తాడు రాజమౌళి. ఆ హీరో 'ఈగ‌' అయినా - ఎవ‌రెస్ట్ అంత ఇమేజ్ వ‌చ్చేస్తుంది. అలాంట‌ప్పుడు ఒకే ఫ్రేమ్‌లో ఇద్ద‌రు హీరోల్ని చూపించే అవ‌కాశం వ‌స్తే - ఆ ఇద్ద‌రూ ఫ్రీడ‌మ్ ఫైట‌ర్లయితే, ఆ ఇద్ద‌రూ స్నేహితులైతే, ఆ ఇద్ద‌రే శ‌త్రువులుగా కూడా మారి క‌ల‌హిస్తే - రాజ‌మౌళి ఊరుకుంటాడా? త‌న‌దైన విశ్వ‌రూపాన్ని చూపించేస్తాడు. ఆర్‌.ఆర్‌.ఆర్‌లో అది జ‌రిగింది. మరి రామ్‌చ‌ర‌ణ్‌, రామారావు, రాజ‌మౌళి క‌ల‌గ‌లిసిన ఈ ఆర్‌.ఆర్‌.ఆర్‌ వెండి తెర‌పై మ‌రో దృశ్య‌కావ్యం లిఖించ‌గ‌లిగిందా?

క‌థ‌లోకి వెళ్దాం. అల్లూరి సీతారామ‌రాజు, కొమ‌రం భీమ్‌.. త‌మ జీవిత‌కాలంలో రెండేళ్ల పాటు ఎవ‌రికీ క‌నిపించ‌కుండా మాయ‌మైపోయారు. ఈ విష‌యం చ‌రిత్ర‌లోనూ ఉంది. అలా దేశాట‌న‌లో వెళ్లిపోయిన వారిద్ద‌రూ క‌లిస్తే, స్నేహం చేస్తే, వాళ్ల ఆశ‌యాలు వేరై.. ఒక‌రితో ఒక‌రు క‌ల‌బ‌డితే - ఎలా ఉంటుంద‌న్న ఆలోచ‌న నుంచి ఆర్‌.ఆర్‌.ఆర్‌ పుట్టింది. పాత్ర‌లు చరిత్రలోనివే అయినా, క‌థ‌, అందులోంచి పుట్టిన‌ ఘ‌ర్ష‌ణ పూర్తిగా క‌ల్పితం.

నిప్పుకీ.. నీటికీ దోస్తీ!

రామ్ (రామ్‌చ‌ర‌ణ్‌) బ్రిటిష్ ప్రభుత్వంలో పోలీస్ అధికారి. ప్ర‌భుత్వానికి విధేయుడు. ఎంత నిజాయ‌తీగా ఉన్నా, ప్రాణాలొడ్డి ఎంత క‌ష్ట‌ప‌డినా ప్ర‌మోష‌న్ ఉండ‌దు. ఎలాగైనా స‌రే.. ప్ర‌మోష‌న్ సంపాదించాల‌ని, ఆయుధ భాండాగారానికి అధిప‌తి అవ్వాల‌న్న‌ది త‌న కోరిక‌. మ‌రోవైపు భీమ్ (ఎన్టీఆర్‌) గోండు జాతి కాప‌రి. పులినైనా ఎదిరించి, దానిపై స‌వారీ చేయ‌గ‌ల స‌మ‌ర్థుడు. ఓరోజు బ్రిటిష్ దొర గూడెంకి వ‌చ్చి, ఓ పాప‌ని బ‌ల‌వంతంగా తీసుకెళ్లిపోతారు. ఆ గోండు జాతి కాప‌రి భీమ్ ఆ పాప‌ను వెతుక్కుంటూ దిల్లీ బ‌య‌ల్దేర‌తాడు. బ్రిటిష్ అధికారిని చంపైనా స‌రే, ఆ పాప‌ని తీసుకొస్తాన‌న్న‌ది భీమ్ ప్ర‌తిజ్ఞ‌.

ఈ విష‌యం బ్రిటిష్ సైన్యానికి తెలుస్తుంది. కానీ, త‌మ‌ను వెతుక్కుంటూ వ‌చ్చిన భీమ్ ఎవ‌రో, ఎలా ఉంటాడో తెలీదు. భీమ్‌ని వెదికి ప‌ట్టుకొనే బాధ్య‌త రామ్‌పై ప‌డుతుంది. భీమ్‌ను ప్రాణాల‌తో అప్ప‌గిస్తే త‌న‌కు ప్ర‌మోష‌న్ కూడా వ‌స్తుంది. అందుకే భీమ్ కోసం అన్వేష‌ణ ప్రారంభిస్తాడు. అయితే, భీమ్ అని తెలియ‌కుండానే త‌న‌తో ప‌రిచ‌యం అవుతుంది. ఓ బాబుని కాపాడే క్ర‌మంలో రామ్, భీమ్ ఇద్ద‌రూ ప్రాణ స్నేహితులైపోతారు.

ఓ ద‌శ‌లో తాను వెతుకుతున్న భీమ్ త‌న ప్రాణ స్నేహితుడేనన్న సంగ‌తి రామ్‌కు తెలుస్తుంది. అప్పుడు రామ్ ఏం చేశాడు? ఉద్యోగ ధ‌ర్మం పాటించి భీమ్‌ని అరెస్ట్ చేశాడా? ఓ స్నేహితుడిగా ఆలోచించి.. త‌న‌కు చేయూత అందించాడా అనేదే క‌థ‌.

నిజానికి ఇది అల్లూరి సీతారామ‌రాజు, కొమ‌రం భీమ్‌ల క‌థ కాదు. వాళ్ల జీవితానికీ, ఈ క‌థ‌కూ సంబంధమే లేదు. పాత్ర‌లు క‌ల్పితం. ఈ క‌థా క‌ల్పిత‌మే. కాక‌పోతే, వేర్వేరు ప్రాంతాల‌కు చెందిన ఇద్ద‌రు వీరులు క‌లిస్తే ఎలా ఉంటుంద‌న్న ఊహ‌, ఆలోచ‌న బాగున్నాయి. ఓ సినిమా క‌థ‌కు కావ‌ల్సిన క‌మ‌ర్షియ‌ల్ హంగుల్ని ఆ ఆలోచ‌న అందించింది.

దినుసులు బాగా కుదిరిన వంట‌కం

చేయి తిరిగిన వంట‌గాడైతే, అర‌కొర స‌రుకుల‌తోనే అద్భుతం సృష్టిస్తాడు. అలాంటిది, అన్ని దినుసులూ ఉంటే ఊరుకుంటాడా? రాజ‌మౌళి చేయి తిరిగిన వంట‌గాడు. త‌న‌కు కావ‌ల్సిన అన్ని హంగులూ దొరికాయి. అలాంట‌ప్పుడు విశ్వ‌రూపం చూపించ‌కుండా ఎలా ఉంటాడు? ఆర్‌.ఆర్‌.ఆర్ విష‌యంలో అదే జ‌రిగింది. త‌న‌కు కావ‌ల్సిన ముడి స‌రకు క‌థ‌లో ఉంది. ఎలివేష‌న్ల‌కు, ఎమోష‌న్ల‌కు చాన్స్ వుంది. వాటిని పండించే స్టార్ హీరోలు దొరికేశారు. పైగా ఒక‌రు కాదు. ఇద్ద‌రు.

బ్రిటిష్ కాలం నాటి క‌థ‌. కాబ‌ట్టి దేశ‌భ‌క్తిని రంగ‌రించే అవ‌కాశం ఉంది. అప్ప‌టి ఫ్రీడ‌మ్ స్ట్ర‌గుల్‌ను చూపించొచ్చు. కానీ, రాజ‌మౌళి దాని జోలికి వెళ్ల‌లేదు. ఏది ఎంత కావాలో అంతే తీసుకున్నాడు. పాప కోసం పోరాటంతో క‌థ మొద‌లైనా, రామ్, భీమ్‌ల దోస్తీ - వారి వైరం - మ‌ళ్లీ క‌లుసుకోవ‌డం.. ఈ పాయింట్ల‌పైనే దృష్టి పెట్టాడు. మిగిలిన‌వ‌న్నీ కేవ‌లం దారాలుగా వాడుకున్నాడు.

భీమ్ ల‌క్ష్యం పాప‌ను కాపాడ‌డం.

రామ్ ఆశ‌యం భీమ్‌ను ప‌ట్టుకోవ‌డం.

కానీ, ఇద్ద‌రూ అది తెలియ‌కుండానే స్నేహం చేస్తారు. ఆ ఎలిమెంట్ ఈ క‌థ‌లో బాగా మిక్స్ అయ్యింది.

రాజ‌మౌళి ఎలివేష‌న్ల మాస్ట‌ర్‌. హీరోల్ని ఆకాశానికి ఎత్తేయ‌డంలో దిట్ట‌. ఈ విష‌యం ఈ సినిమాతో మ‌రోసారి నిరూపిత‌మైంది.

ముందు రామ్‌గా చ‌రణ్ ఎంట్రీ చూపించారు. కంచె అవ‌త‌ల వేలాది మంది జ‌నం. కంచెకు ఇవ‌త‌ల ప‌ది మంది పోలీస్ ఆఫీస‌ర్లు. అంతా గ‌డ‌గ‌డ వ‌ణికేస్తుంటే, ఒక్క‌డు ఒకే ఒక్క‌డు లాఠీ ప‌ట్టుకుని కంచె దాటాడు. మామూలుగా అయితే ఈ సీన్ చాలా హాస్యాస్ప‌దంగా, మ‌రీ సినిమాటిక్‌గా ఉండాలి. కానీ ఇది రాజ‌మౌళి సినిమా. ఆయ‌న ఈసీన్‌ని త‌న‌దైన శైలిలో ఆవిష్కరించారు. చ‌ర‌ణ్ ఒక్క‌డే వేలాదిమందిని ఎదిరిస్తున్నా ఎక్క‌డా సినిమాటిక్‌గా అనిపించ‌దు. త‌న‌ని చూసి వంద‌ల‌మంది వెన‌క‌డుగు వేస్తుంటే ఓవ‌ర్ అనిపించ‌దు. ఆ ఎమోష‌న్ ఆ పాత్ర‌లో క‌నిపిస్తుంది. కాబ‌ట్టే.. బాగా వ‌ర్క‌వుట్ అయ్యింది.

ఆ వెంట‌నే భీమ్‌గా ఎన్టీఆర్ ఎంట్రీ ఇచ్చాడు. పులితో పోరాడే సీన్ అది. ఎన్టీఆర్‌లోని స్టామినాకు నిలువెత్తు అద్దంగా నిలిచిన సీన్ ఇది. ఈమ‌ధ్య కాలంలో ఇలాంటి ఎంట్రీ సీన్ మ‌రోటి రాలేదంటే అందులో ఏమాత్రం అతిశ‌యోక్తి లేదు. పులి మొహంలో ఎన్టీఆర్ మొహం పెట్టి.. పులిలా గాండ్రించ‌డం క‌చ్చితంగా అభిమానుల‌కు గుర్తుండిపోయే మూమొంటే. ఇలా ఒక‌టా రెండా? ప్ర‌తీ ప‌ది నిమిషాల‌కూ ఇలాంటి ఎలివేష‌న్ ఒక‌టి ఇచ్చుకుంటూ వెళ్లాడు.

నాటు... వీర నాటు

సినిమాని ఓ స్కేలు పెట్టి కొలిచిన‌ట్టు తీస్తాడేమో రాజ‌మౌళి. ఎక్క‌డ ఏ ఎమోష‌న్ కావాలో, అది వ‌చ్చి ప‌డిపోతుంటుంది. 'నాటు నాటు' పాట అలాంటిదే. నిజానికి ఇది కేవలం డాన్సింగ్ నెంబ‌రే. కానీ.. రాజ‌మౌళి ఈ పాట‌ని చాలా ర‌కాలుగా వాడుకున్నాడు. భీమ్‌ను బ్రిటిష‌ర్లు డాన్స్ రాద‌ని అవ‌హేళ‌న చేయ‌డం, ఆ స‌మ‌యంలో.. రామ్ వ‌చ్చి, డ‌ప్పు కొట్ట‌డం.. ఇద్ద‌రూ క‌లిసి నాటు స్టెప్పు వేయ‌డం.. ఇదంతా ఓ స్క్రీన్ ప్లే ప్ర‌కారం జ‌రిగిపోతాయి.

ఈ పాట‌లో ఎమోష‌న్ చూపించాడు, స్నేహం చూపించాడు, త‌న స్నేహితుడి కోసం రామ్ ఓడిపోయిన త్యాగం చూపించాడు.. ఇలా ర‌కరకాలైన ఎమోష‌న్ల‌ని ఒకే పాట‌లో చూపించ‌గ‌లిగాడు రాజ‌మౌళి. ఈ పాట‌లో చ‌ర‌ణ్ - ఎన్టీఆర్‌ల కో-ఆర్డినేష‌న్‌, వాళ్ల మ‌ధ్య కుదిరిన కెమిస్ట్రీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తాయి.

రెండు కొద‌మ సింహాలు కొట్టుకొంటే..

ఈ సినిమాకి ప్ర‌ధాన బ‌లం ఇంట్ర‌వెల్ సీన్‌. భీమ్‌ని రామ్ అరెస్ట్ చేయ‌డం.. చాలా ఇంట్ర‌స్టింగ్ ఎలిమెంట్. అప్ప‌టి వ‌ర‌కూ ఇద్ద‌రి బ‌లాల్నీ, ఇద్ద‌రి స్నేహాన్ని చూపించిన రాజ‌మౌళి.. తొలిసారి వారి వైరాన్ని, ఒక‌రిపై మ‌రొక‌రి ఆధిప‌త్యాన్ని చూపించాల్సిన త‌రుణ‌మిది. దాన్ని చాలా బాలెన్సింగ్‌గా చూపించాడు.

ఆ సీన్‌కి ముందు.. రామ్‌ను భీమ్ కాపాడే సీన్ వేసి, రామ్ నిస్స‌హాయ ప‌రిస్థితులో ఉన్న‌ప్పుడు తాను వెదుకుతోంది మ‌రెవ‌ర్నో కాదు, భీమ్‌నే అనే నిజాన్ని తెలుసుకోవ‌డం మంచి స్క్రీన్ ప్లే.

https://twitter.com/ssrajamouli/status/931924659586547712

సెకండాఫ్ సిండ్రోమ్

చాలా క‌థ‌ల‌కు ఉన్న స‌మ‌స్యే. ఫ‌స్టాఫ్ అద్వితీయంగా చెప్తారు. సెకండాఫ్ ఓపెన్ చేయ‌గానే.. క‌థ చ‌ల్లారిపోతుంది. ఆర్‌.ఆర్‌.ఆర్‌లోనూ ఈ స‌మ‌స్య ఉంది. ఇంట్ర‌వెల్ త‌ర‌వాత ఓ హైలో థియేట‌ర్ నుంచి బ‌య‌ట‌కు వెళ్లి కాస్త రిలాక్స్ అయిన ప్రేక్ష‌కుడు, ఇంకాస్త ఎక్కువ ఊహించుకుంటూ థియేట‌ర్లోకి అడ‌గుపెడ‌తాడు.

అయితే, కీల‌క‌మైన‌ ఫ్లాష్ బ్యాక్ చాలా నిదానంగా సాగిపోతుంది. అక్క‌డ ఎలాంటి థ్రిల్లింగ్ మూమెంట్స్ క‌నిపించ‌వు. కేవ‌లం.. రామ్ ఆశ‌యం చెప్ప‌డానికి మాత్ర‌మే ఉప‌యోప‌గ‌డే సీన్ అది. అందులో ఓ కీల‌క‌మైన భాగాన్ని దాచి పెట్టి, ప్రీ క్లైమాక్స్‌లో వాడుకోవ‌డం, రామ్ గొప్ప‌దనాన్ని భీమ్‌కి తెలియ‌డానికి ఆ సీన్‌ను ట్రంప్ కార్డుగా దాచుకోవ‌డం.. రాజ‌మౌళి తెలివితేట‌ల‌కు నిద‌ర్శ‌నం.

భీమ్‌ను త‌ప్పించేందుకు రామ్ ప్ర‌య‌త్నించిన సీన్ కాస్త చ‌ప్ప‌గానే ఉన్నా - రామ్‌ను కాపాడేందుకు భీమ్ రావ‌డంతో మ‌ళ్లీ హై వ‌స్తుంది. అల్లూరి సీతారామ‌రాజుగా రామ్ విశ్వ‌రూపం చూపించ‌డం, రామ్ ఆశ‌యాన్ని భీమ్ నెర‌వేర్చ‌డం.. ఇవ‌న్నీ క‌థ‌ని వ‌డివ‌డిగా ముందుకు తీసుకెళ్లిపోయాయి.

పాప కోసం జ‌రిగే క‌థ ఇది. కేవ‌లం సింగిల్ థ్రెడ్ ప‌ట్టుకుని, అందుకోసం ఇద్ద‌రు హీరోల్ని తీసుకురావ‌డం నిజంగా సాహ‌సమే. రాజ‌మౌళి కాబ‌ట్టి, ఈ క‌థ తెర‌పైకి రాగ‌లిగింది. భీమ్, సీతారామ‌రాజు పాత్ర‌ల్ని డిజైన్ చేసిన విధానం, ఆ పాత్ర‌ల్లోని సంఘ‌ర్ష‌ణ‌, యాక్ష‌న్ సీన్లు డిజైన్ చేసిన విధానం.. ఇవన్నీ ఓ మామూలు క‌థ‌ని అసాధార‌ణ‌మైన సినిమాగా తీర్చిదిద్దాయి. సెకండాఫ్‌లో కాస్త డ‌ల్‌నెస్ ఉన్నా.. క్లైమాక్స్ చూశాక‌.. ప్రేక్ష‌కులు సంతృప్తిక‌రంగానే థియేట‌ర్ల నుంచి బ‌య‌ట‌కు వ‌స్తారు.

ఇద్ద‌రూ ఇద్ద‌రే!

'ఇద్ద‌రు హీరోలున్నార‌ని చెప్పి ఇద్ద‌రికీ సీన్లు, ఎలివేష‌న్లు, ఫైట్లు స‌మానంగా పంచేయ‌డం జ‌ర‌గ‌లేదు. క‌థ‌కు ఏం కావాలో అదే చేశా' అని ఇది వ‌ర‌కే చెప్పాడు రాజ‌మౌళి. కానీ, ఈ సినిమా చూస్తే.. రాజ‌మౌళి ఎన్టీఆర్‌, చ‌రణ్‌ల‌కు తూకం వేసి మ‌రీ పాత్ర‌లు పంచిన‌ట్టు అనిపిస్తుంది. ఏ పాత్రా ఎక్కువ కాదు. ఏదీ త‌క్కువ కాదు. ఆ పాత్ర‌ల్లో ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌లు ఇమిడిపోయిన విధానం ప్ర‌తి ఒక్క‌రికీ న‌చ్చుతుంది. ముఖ్యంగా ఎమోష‌న్ సీన్స్‌లో నువ్వా? నేనా? అన్న‌ట్టు పోటీప‌డి న‌టించారు. డాన్సులు, ఫైట్లు.. అన్ని చోట్లా స‌మాన‌మైన మార్కులే. ఇద్ద‌రు హీరోలున్న‌ప్పుడు, ఇద్ద‌రూ స్టార్లు అయిన‌ప్పుడు పాత్ర‌ల పంప‌కం చాలా క‌ష్టం. కానీ, దాన్ని కూడా రాజ‌మౌళి సునాయాసంగా దాటేశారు. అయితే మిగిలిన పాత్ర‌ల్లో అంత డెప్త్ లేదు. ఉదాహ‌ర‌ణ‌కు ఈ సినిమాలో విల‌న్ ఎవ‌రని అంటే చెప్ప‌లేం. ఆ పాత్ర స్ట్రాంగ్‌గా లేదు. అలియా భ‌ట్ నిడివి చాలా త‌క్కువ‌. అజ‌య్‌దేవ‌గ‌ణ్‌దీ అంతే. శ్రియ స్థానంలో ఎవ‌రున్నా ఓకే. స‌ముద్ర‌ఖ‌ని స్థాయికి త‌గిన పాత్ర కాదిది.

సాంకేతికంగా అత్యున్న‌త స్థాయిలో ఉంది ఈ సినిమా. సెంథిల్ కెమెరా ప‌నితం, కీర‌వాణి సంగీతం.. ఇవ‌న్నీ హైక్లాస్‌. కొన్ని చోట్ల గ్రాఫిక్స్ తేలిపోయాయి. మ‌రికొన్ని చోట్ల అంత‌ర్జాతీయ స్థాయిలో ఉన్నాయి. సెట్లూ అంతే. బుర్రా సాయిమాధ‌వ్ మాట‌లు స‌న్నివేశాల‌కు త‌గిన‌ట్టుగా సాగాయి. పాట‌లెక్క‌డా క‌థ‌కు అడ్డు ప‌డ‌లేదు. 'కొమ‌రం భీముడా' పాట‌ని క‌థ‌లో ప‌ర్‌ఫెక్ట్ ప్లేస్‌మెంట్‌లో వాడుకున్నారు. ఆ పాత్ర తాలూకు ఎమోష‌న్ పెంచిన పాట అది.

రాజ‌మౌళి మ‌రోసారి మ్యాజిక్ చేశాడు. త‌న విజ‌న్ ఎలాంటిదో ఈసినిమాతో మ‌రోసారి నిరూపిత‌మైంది. విజువల్ గ్రాండియ‌ర్‌కీ, ఎమోష‌న్స్‌కీ.. ఆర్‌.ఆర్‌.ఆర్‌. ఓ ప‌ర్‌ఫెక్ట్ ఎగ్జాంపుల్‌. ఈ సినిమాతో మ‌ల్టీస్టార‌ర్ల ట్రెండ్ మ‌రోసారి ప్రారంభమవడం ఖాయం. బాలీవుడ్ మ‌రోసారి తెలుగు సినిమా వైపు చూడ‌డం కూడా ఖాయ‌మే.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
RRR Movie Review: Did Rajamouli write another visual feast elevating the emotions of Ramcharan and NTR
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X