లాటరీ బొనాంజా : రాత్రికి రాత్రే కోటీశ్వరులైన సేల్స్‌మెన్..ఎంత గెలిచారంటే..?
వచ్చే అరకొర జీతంతో నెలంతా గడిపేవారికి ఒక్కసారిగా కోట్లల్లో డబ్బులు వస్తే... ఎగిరి గంతేస్తారు. ఆ డబ్బే దొరికితే ఇంకేముంది లైఫ్ అంతా జింగాలాలా అనేలా ఫీలవుతారు. అప్పటి వరకు నానా ఇబ్బందులు పడుతూ ఒక్కసారిగా వచ్చిన భారీ మొత్తంతో ఏక్ ధమ్ సెటిల్ అయిపోతారు. ఇక్కడ కూడా ఆరుగురు సేల్స్మెన్లు ఓవర్‌నైట్‌లో కోటీశ్వరులుగా మారారు. ఎలా అంటారా... తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

కేరళలో లాటరీ పాపులర్
దక్షిణ భారత దేశంలో ముఖ్య రాష్ట్రం కేరళ. ఈ రాష్ట్రం పర్యాటక రంగానికి పెట్టింది పేరు. అదే సమయంలో లాటరీ టికెట్ అమ్మకాలకు కూడా తెగ ఫేమస్. ఇక్కడ లాటరీ టికెట్లు అమ్మకాలు, కొనుగోలు చట్టపరంగానే జరుగుతాయి. కేరళ లాటరీ టికెట్లు కొని చాలామంది రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిన ఘటనలు చాలా చూశాం. కొన్నేళ్ల క్రితం అనంతపురం నుంచి కేరళకు వలస వెళ్లి భిక్షాటన చేసుకుంటున్న వ్యక్తి లాటరీ టికెట్ కొని కోటీశ్వరుడయ్యాడు. ఈ సారి నెలంతా కష్టపడి వచ్చే జీతంతో కుటుంబాన్ని పోషించుకునే ఆరుగురు సేల్స్మెన్లు సింగిల్ లాటరీ టికెట్‌తో కోటీశ్వరులయ్యారు.

తొలి బహుమతి రూ.12 కోట్లు
గురువారం రోజున కేరళ లాటరీశాఖ తిరువోనం బంపర్‌కు చెందిన లాటరీని తీసింది. ఈ లాటరీ బహుమానం కేరళ రాష్ట్ర లాటరీ చరిత్రలోనే అతి పెద్దది కావడంతో అందరి చూపూ ఈ ఫలితాలపైనే పడింది. తిరువోనం బంపర్ లాటరీ ప్రైజ్‌లో భాగంగా తొలి బహుమానం రూ.12 కోట్లు. ఇది టికెట్ నెంబర్ TM 160869కు దక్కింది. ఇక లాటరీ ఫలితాలు ప్రకటించగానే ఎవరికీ దక్కిందా అని చాలామంది తమ టికెట్లను చూసుకోసాగారు. ఇదే సమయంలో రాజీవన్, రామ్‌జిమ్, రోనీ, వివేక్, సుబిన్ , రతీష్ అనే ఆరుగురు ఫలితాల ప్రకటన సమయానికి వారి సేల్స్ మెన్ ఉద్యోగంలో బిజీగా ఉన్నారు.

రూ.12 కోట్లు గెలిచిన సామాన్య సేల్స్మ్యాన్లు
ఇక లాటరీ నెంబర్ ప్రకటన దావనంలా పాకింది. వెంటనే తాము కూడా రెండు టికెట్లు కొన్నట్లు ఈ ఆరుగురు సేల్స్మెన్లు గుర్తుచేసుకున్నారు. ఇక తమకు ఏమైనా ఆ లాటరీ తగలిందేమో అని చూసుకున్నారు. ఇంకేముంది సంస్థ ప్రకటించిన లాటరీ నెంబరు వారు కొన్న లాటరీ నెంబర్‌తో సరిపోలడంతో ఒక్కసారిగా సంతోషంతో ఎగిరి గంతేశారు. ఇదే నెంబరుపై రూ. 12 కోట్లు గెలిచారు. అయితే కొన్ని గంటల పాటు వీరు షాక్ నుంచి తేరుకోలేకపోయారు. ఆరుగురు కలిసి సమానంగా డబ్బులు చెల్లించి ఈ లాటరీ టికెట్‌ను కొన్నట్లు చెప్పారు. టికెట్‌ను ఎస్బీఐ బ్యాంకులో డిపాజిట్ చేసినట్లు చెప్పారు.

అన్ని కోతలు పోను ఒక్కొక్కరికి వచ్చేది...
ఇక వచ్చిన డబ్బులు సమానంగా పంచుకుంటామని చెప్పారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అన్నీ కోతలు పోను ఒక్కొక్కరికీ రూ.కోటికి పైగా వస్తుందని చెప్పారు.వచ్చిన మొత్తంలో కొంత సమాజసేవకు వినియోగిస్తామని చెప్పారు. ఇక తొలి బహుమానం రూ.12 కోట్లు కాగా అన్ని పన్నులు పోగా రూ.7.5 కోట్లు వస్తాయి.ఇక లాటరీ ఏజెన్సీకి కమిషన్ కింద రూ.కోటి వెళుతుంది. మెగా లాటరీలు ఓనమ్, క్రిస్మస్, వర్షాకాలంలలో జరుగుతాయి.