వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీజేపీకి రూ.2.5 వేల కోట్ల విరాళాలు.. ఎలక్టోరల్ బాండ్లపై మళ్లీ తలెత్తుతున్న ప్రశ్నలు

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
getty images

రాజకీయ పార్టీలకు ఎన్నికల బాండ్ల ద్వారా వచ్చే విరాళాల్లో బీజేపీ అగ్రస్థానంలో ఉన్నట్లు తెలుస్తోంది.

2019-20 ఆర్థిక సంవత్సరంలో ఎన్నికల బాండ్ల ద్వారా బీజేపీకి దాదాపు రూ.2,555 కోట్ల రూపాయలు సమకూరినట్లు ఆ పార్టీ తెలిపింది.

2018-19 ఆర్థిక సంవత్సరంలో లభించిన రూ.1,450 కోట్ల కంటే ఇది దాదాపు 76 శాతం అధికమని ఇటీవల ఎన్నికల సంఘానికి సమర్పించిన వార్షిక ఆడిట్ నివేదికలో బీజేపీ వెల్లడించింది.

కాగా, కాంగ్రెస్‌కు 2019-20లో రూ.318 కోట్లు మాత్రమే విరాళాలుగా లభించాయి. ఇవి, 2018-19లో ఆ పార్టీకి లభించిన రూ.383 కోట్ల కన్నా 17 శాతం తక్కువ.

అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, 2019-20 ఆర్థిక సంవత్సరంలో గుర్తింపు పొందిన 18 రాజకీయ పార్టీలు ఎన్నికల బాండ్ల ద్వారా మొత్తం రూ.3,441 కోట్లను విరాళాలుగా అందుకున్నాయి.

ఇందులో 75 శాతం బీజేపీకే దక్కినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌కు కేవలం 9 శాతం దక్కింది.

ఇతర ప్రతిపక్ష పార్టీలకు దక్కిన విరాళాలను పరిశీలిస్తే, తృణమూల్ కాంగ్రెస్‌కు రూ.100 కోట్లు, డీఎంకేకు రూ.45 కోట్లు, శివసేనకు రూ.41 కోట్లు, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి రూ.20 కోట్లు, ఆమ్ ఆద్మీ పార్టీకి రూ.17 కోట్లు, రాష్ట్రీయ జనతాదళ్‌కు రూ.2.5 కోట్లు ఎన్నికల బాండ్ల ద్వారా సమకూరాయి.

ఎన్నికలు, రాజకీయ సంస్కరణల రంగంలో పనిచేసే ప్రభుత్వేతర సంస్థ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) ప్రకారం, 2017-18, 2019-20 ఆర్థిక సంవత్సరాల మధ్య రాజకీయ పార్టీలు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రూ.6200 కోట్ల కంటే ఎక్కువ మొత్తాన్ని అందుకున్నాయి.

అందులో సుమారు 68 శాతం అంటే రూ.4.5 వేల కోట్ల రూపాయలకు పైగా మొత్తం బీజేపీకి దక్కింది.

ఈ లెక్కలు చూస్తుంటే, బీజేపీకి ప్రయోజనం చేకూర్చేందుకే ఎన్నికల బాండ్ల పథకాన్ని ప్రవేశపెట్టారా అనే సందేహం కలుగక మానదు.

ఎలక్టోరల్ బాండ్లు అంటే ఏమిటి?

భారతదేశంలో వివిధ రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వాలనుకునేవారు ఆ పార్టీలు విక్రయించే ఎన్నికల బాండ్లను కొనుగోలు చేయవచ్చు. సంవత్సరంలో నాలుగుసార్లు ఈ ఎలక్టోరల్ బాండ్లను పార్టీలు విక్రయిస్తాయి. విరాళాలు అందించేవారి సమాచారాన్ని గోప్యంగా ఉంచుతారు.

దేశ పౌరులు లేదా కంపెనీలు ఈ బాండ్లను నిర్ణీత స్టేట్ బ్యాంక్ శాఖల నుంచి కొనుగోలు చేయవచ్చు.

ఈ ఎన్నికల బాండ్ పథకాన్ని భారత ప్రభుత్వం 2017లో ప్రకటించింది. కానీ, 2018, జనవరి 29 నుంచి వీటిని చట్టబద్ధంగా అమలు చేశారు.

రాజకీయ పార్టీలకు చందాలు ఇవ్వాలనుకునే వారి వివరాలను గోప్యంగా ఉంచుతూ, ఆ విరాళాలను మాత్రమే బ్యాలెన్స్‌షీట్‌లో నమోదు చేయడానికి వీలుగా ఎన్నికల బాండ్లను ప్రవేశపెట్టినట్లు కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.

విరాళాల కింద నల్లధనాన్ని ఖర్చు పెట్టకుండా నిరోధించేందుకు ఎన్నికల బాండ్లు సహకరిస్తాయని కూడా ప్రభుత్వం వెల్లడించింది.

ఇలా వచ్చిన రాజకీయ విరాళాలను సక్రమంగా వినియోగించే దిశలో ప్రోత్సహించేందుకే దాతల వివరాలను గోప్యంగా ఉంచాలని నిర్ణయించినట్లు తెలిపింది.

ఈ పథకంపై వస్తున్న విమర్శలు ఏమిటి?

దాతల పేర్లు గోప్యంగా ఉంచడం వల్ల, నల్లధనాన్ని విరాళంగా ఇచ్చే అవకాశం ఉంటుందని ఈ పథకాన్ని వ్యతిరేకిస్తున్నవారు అంటున్నారు.

అంతే కాకుండా, పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు తమ గుర్తింపును వెల్లడించకుండా భారీ విరాళాలు ఇచ్చేందుకు వీలుగా ఈ పథకాన్ని రూపొందించారనే విమర్శ కూడా ఉంది.

అందుకే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎలక్షన్ కమిషన్, న్యాయ మంత్రిత్వ శాఖ, పలువురు ఎంపీలు ఈ స్కీమ్‌పై ఎప్పటికప్పుడు ఆందోళనలు, అభ్యంతరాలు లేవనెత్తుతున్నారని, దీనికి వ్యతిరేకంగా హెచ్చరికలు కూడా జారీ చేశారని విమర్శకులు అంటున్నారు.

ఎన్నికల్ బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలకు ఇస్తున్న చందాలు ఒక రకమైన "మనీ లాండరింగ్' అని కూడా వీరు అభిప్రాయపడుతున్నారు.

ఎలక్టోరల్ బాండ్లు

ప్రభుత్వం ఏమంటోంది?

కార్పొరేట్ సంస్థల నుంచి అందే అపరిమిత విరాళాలను, ప్రజాస్వామ్యానికి ముప్పు కలిగించే విధంగా దేశీయ, విదేశీయ అజ్ఞాత ఆర్థిక సహాయాలను ఎన్నికల బాండ్ల పథకం ఆహ్వానించిందా అంటూ 2019లో అప్పటి కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ బీకే హరిప్రసాద్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందిస్తూ, కేవైసీ పత్రాలు బ్యాంకులకు సమర్పించినవారు మాత్రమే ఎన్నికల బాండ్లు కొనుగోలు చేసేలా ఈ పథకాన్ని నియంత్రించామని చెప్పారు.

అయితే, ఏదైనా వివాదం వచ్చినప్పుడు లేదా క్రిమినల్ కేసు వేసినప్పుడు న్యాయస్థానంలో దాతల వివరాలు బహిర్గతం చేయవచ్చు. కానీ, అలాంటి పరిస్థితులేవీ తారసిల్లకుండా కట్టుదిట్టమైన రక్షణ చర్యలు తీసుకున్నట్లు ఆమె తెలిపారు.

కాంగ్రెస్ జెండా

'ఇది పారదర్శకతకు, ప్రజాస్వామ్యానికి విరుద్ధం'

పార్లమెంటులో ఎలక్టోరల్ బాండ్ పథకాన్ని ఆమోదించిన విధానం రాజ్యాంగబద్ధం కాదని ఏడీఆర్ వ్యవస్థాపకుడు, ట్రస్టీ ప్రొఫెసర్ జగదీప్ ఛోకర్ అన్నారు.

"ఎన్నికల్ బాండ్లను బడ్జెట్‌లో భాగంగా ప్రవేశపెట్టారు. బడ్జెట్‌లో మార్పులు సూచించేందుకు రాజ్యసభకు అధికారం లేదు. బడ్జెట్ లోక్‌సభలో ఆమోదం పొందుతుంది. రాజ్యసభలో కేవలం దానిపై చర్చిస్తారు. బిల్లును ఆపే లేదా మార్పు చేసే అధికారం రాజ్యసభకు ఉండదు. రాజ్యసభలో ప్రభుత్వానికి మెజారిటీ లేదు. కాబట్టి, దీన్ని మనీ బిల్ రూపంలో బడ్జెట్‌లో భాగంగా ప్రవేశపెట్టారు. రాజ్యాంగం ప్రకారం, భారత కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి చేసే ఖర్చులు మనీ బిల్‌లో భాగం అవుతాయి. కానీ, ఎన్నికల బాండ్‌కు, కన్సాలిడేటెడ్ ఫండ్‌కు సంబంధమే లేదు" అని చెప్పారు..

రిజర్వ్ బ్యాంకు, ఎన్నికల సంఘం ఈ ప్రతిపాదనను వ్యతిరేకించాయి. కానీ, ప్రభుత్వం దాన్ని పూర్తిగా విస్మరించింది. ఎన్నికల బాండ్ల ద్వారా నల్లధనం పార్టీలకు చేరుతుందని ఈ రెండు సంస్థలూ విమర్శించాయి. అలాగే విదేశీ డబ్బు, సందేహాస్పద మూలాల నుంచి వచ్చిన సొమ్ము కూడా వీటి ద్వారా పార్టీలకు చేరే అవకాశం ఉంది.

అంతే కాకుండా, ప్రతిపక్ష పార్టీలకు విరాళాలు అందకుండా నిరోధించే అవకాశం ఉంది. పైగా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ బాండ్లను విక్రయిస్తుంది అంటున్నారు. దాతల సమాచారాన్ని బ్యాంకు గోప్యంగా ఉంచుతుంది అని చెప్పడం కన్నా హాస్యాస్పదం ఇంకేమీ ఉండదు. అదొక ప్రభుత్వ బ్యాంకు. ఆర్థిక మంత్రి చాలా సులువుగా ఈ సమాచారాన్ని బ్యాంకు నుంచి సేకరించగలరు. ఆర్థిక మంత్రికి చేరితే, సమాచారం మొత్తం ఆ పార్టీకి చేరినట్లే" అని ప్రొఫెసర్ ఛోకర్ అభిప్రాయపడ్డారు.

సమాచారం మొత్తం ప్రభుత్వానికి చేరుతుంది కాబట్టి ప్రతిపక్ష పార్టీలకు విరాళాలు ఇవ్వకుండా ప్రజలపై ఒత్తిడి తేగలరని, ప్రతీ ఏడాది లెక్కల్లో ఇది రుజువు అవుతోందని కూడా ప్రొఫెసర్ ఛోకర్ భావిస్తున్నారు. 2018 నుంచి బీజేపీకే అధిక శాతం విరాళాలు అందుతున్నాయని డేటా చెబుతోంది.

"ఎవరు విరాళాలిచ్చారో ఆ పార్టీకి తెలియకుండా ఉంటుందా? ఇది హాస్యాస్పదమైన విషయం. ప్రభుత్వం చెబుతున్నట్లు ఇది పారదర్శకమా? గోప్యత, పారదర్శకత ఒకదానికొకటి వ్యతిరేకం అని మనం గుర్తుంచుకోవాలి" అని ఆయన అన్నారు.

సుప్రీం కోర్టులో పిటిషన్

ఎన్నికల బాండ్ల విషయంలో ఏడీఆర్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే, అది ఇంకా పెండింగ్‌లోనే ఉంది.

ఈ ఏడాది మార్చిలో పలు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగడానికి ముందు ఈ బాండ్ల విక్రయాన్ని నిలిపివేయాలంటూ సుప్రీం కోర్టులో వేసిన దావాను కోర్టు తిరస్కరించింది.

2018లో ఈ పథకం ప్రారంభమైందని, 2019, 2020లలో ఎలాంటి అడ్డంకులు లేకుండా కొనసాగిందని, 2021లో దీన్ని నిలిపివేయడానికి ఎలాంటి కారణాలు లేవని అప్పటి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి శరద్ అరవింద్ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది.

ఎన్నికల బాండ్లపై మధ్యంతర స్టే కోరుతూ గత ఏడాది ఏప్రిల్‌లో దాఖలైన పిటిషన్‌ను కూడా సుప్రీం కోర్టు తోసిపుచ్చింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

English summary
Rs 2.5 lakh crore donations to BJP, Questions arising again on electoral bonds
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X