మంత్రి సెక్స్ టేప్ వివాదం... దాని వెనుక రూ.5 కోట్లు డీల్... బాంబు పేల్చిన మాజీ సీఎం కుమారస్వామి...
ఇటీవల వెలుగుచూసిన కర్ణాటక జలవననరుల శాఖ మంత్రి రమేష్ జర్కిహోళి సెక్స్ టేప్ ఉదంతం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. తాజాగా కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి ఈ వ్యవహారంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాసలీలలకు సంబంధించిన సీడీలతో బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్నవారిని మొదట అరెస్ట్ చేయాలన్నారు. అంతేకాదు,ఈ సెక్స్ టేప్ వ్యవహారం తెరపైకి రావడం వెనుక రూ.5కోట్ల డీల్ జరిగిందని పేర్కొన్నారు. ఎవరి పేర్లను ప్రస్తావించకుండానే బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్నారని... డీల్ జరిగిందని కుమారస్వామి వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది.

'రమేష్ అన్నా జిందాబాద్...'
రమేష్ జర్కిహోళి ప్రాతినిధ్యం వహిస్తున్న గోకక్ నియోజకవర్గంలో ఆయన మద్దతుదారుల నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. వరుసగా రెండో రోజు అక్కడ అప్రకటికత బంద్ వాతావరణం కనిపించింది. బస్సుల,ఆటోలు,ట్యాక్సీలు,టూ వీలర్లు,ప్రైవేట్ వాహనాలేవీ రోడ్ల పైకి రాలేదు. గోకక్ పట్టణంలోకి వచ్చే పలు రహదారులను నిరసనకారులు దిగ్బంధించారు. 'రమేష్ అన్నా మీరు ముందుకు సాగండి... మేమంతా మీ వెనకాలే ఉన్నాం.. రమేష్ సహుకార్ జిందాబాద్...' అంటూ నినదించారు. పట్టణంలోని స్కూళ్లు,కాలేజీలు కూడా తెరుచుకోలేదు.

రాజకీయ కక్ష సాధింపు అంటున్న రమేష్ సన్నిహితులు
సెక్స్ టేపు ఉదంతంలో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడంతో రమేష్ జర్కిహోళి తన మంత్రి పదవికి రాజీనామా చేయక తప్పలేదు. తనపై అసత్య ప్రచారం జరుగుతోందని... తనకేమీ తెలియదని రమేష్ జర్కిహోళి పేర్కొన్నారు. అయినప్పటికీ నైతిక కారణాలపై తాను రాజీనామా చేస్తున్నానన్నారు. దీనిపై సమగ్ర దర్యాప్తు అవసరమని రమేష్ అన్నారు. కర్ణాటక ట్రాన్స్ మిషన్ కార్యాలయంలో ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపి ఆ యువతిని రమేష్ లొంగదీసుకున్నారన్న ఆరోపణలున్నాయి. అయితే రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే రహస్యంగా వీడియోలు చిత్రీకరించి రమేష్‌ను టార్గెట్ చేశారని ఆయన సన్నిహిత వర్గాలు అంటున్నాయి.

సీబీఐ దర్యాప్తుకు డిమాండ్...
తన సోదరుడిపై కుట్ర పన్ని ఇరికించారని... దీనిపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని బీజేపీ ఎమ్మెల్యే,రమేష్ జర్కిహోళి సోదరుడు బాలచంద్ర జర్కిహోళి డిమాండ్ చేస్తున్నారు. అది ఫేక్ వీడియో అని... దాన్ని విడుదల చేసినవారిపై రూ.100 కోట్లు పురువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. మరోవైపు ఈ వ్యవహారం వెలుగుచూసినప్పటి నుంచి ఆ యువతి కనిపించకుండా పోయింది. దీంతో ఆమె ఆచూకీ కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేశారు. సామాజిక కార్యకర్త, నాగరిక హక్కు పోరాట సమితి దినేష్ కలహళ్లి ఈ వ్యవహారాన్ని బయటపెట్టిన సంగతి తెలిసిందే. రమేష్ జర్కిహోళి రాసలీలలపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆయన ఆ సీడీలను మీడియాకు విడుదల చేశారు. దీంతో అటు మీడియాలో,ఇటు సోషల్ మీడియాలో ఆ వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి.