భారత్‌లో పాకిస్తాన్ విలీనం తథ్యం -హిందూ ధర్మంతోనే అది సాధ్యం: ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్
''ఆ భగవంతుడు భారతదేశాన్ని ఒక్కటిగానే సృష్టించాడు. అది ఎప్పటికీ ఒక్కటిగానే ఉంటుందని, దీన్నెవరూ విభజించలేరని లార్డ్ వేవెల్ నాటి బ్రిటిష్ పార్లమెంట్ లో ఎలుగెత్తాడు. కానీ కాలక్రమంలో ఊహాతీతమైనదే జరిగింది. దేశ విభజనకు ఆరు నెలల ముందు కూడా ఏ ఒక్కరూ దీనిని ఊహించలేదు. పాకిస్తాన్ ఏర్పాటపై జనం అప్పట్లో జవహర్ లాల్ నెహ్రూని అడిగితే.. 'దేశ విభజనా? అది మూర్ఖులు కనే కల'అని బదులిచ్చారు. అసాధ్యం అనుకున్నది(విభజన) ఏరకంగా సాధ్యమైందో.. ప్రస్తుతానికి అసాధ్యం అనిపిస్తోన్న 'అఖండ భారత్' ఏర్పడబోదని తోసిపుచ్చలేము. నిజానికి ఇవాళ్టి పరిస్థితుల్లో అఖండ భారత్ అవసరం కూడా..'' అంటూ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మొదలుపెట్టారు..
ys sharmila పార్టీలోకి ఇద్దరు మాజీ మంత్రులు -ఒకరు ఫైర్ బ్రాండ్ -ఉద్యమాల పురిటిగడ్డ నుంచి.

హైదరాబాద్‌లో కీలక ప్రసంగం
బీజేపీ ఒక శాఖగా ఉండే సంఘ్ పరివారానికి పెద్ద తలలా వ్యవహరించే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) సర్ సంఘ్ చాలక్ మోహన్ భగవత్ ప్రస్తుతం తెలంగాణ పర్యటనలో ఉన్నారు. గురువారం హైదరాబాద్ హైటెక్స్‌లో ద్విసహస్రావధాని మాడుగుల నాగఫణిశర్మ రచించిన విశ్వభారతం గ్రంథ ఆవిష్కరణ సభలో మోహన్ భాగవత్ మాట్లాడారు. సహజంగానే హిందూ ధర్మ పరిరక్షణపై మాట్లడిన ఆయన.. ఇవాళ్టి ప్రసంగంలో మాత్రం అధిక భాగం అఖండ భారత్ కు సంబంధించిన అంశాలనే చెప్పుకొచ్చారు.

హిందూ సమాజం ఒక్కటే అలా..
ప్రపంచంలో ధర్మబద్ధంగా జీవించేది హిందూ సమాజమని, సనాతన మార్గంలో ప్రపంచం మొత్తానికి దారి చూపగలిగినది కూడా ఒక్క భారతదేమేనని ఆర్ఎస్ఎస్ చీఫ్ భాగవత్ అన్నారు. కాలకూట విషాన్ని కూడా గరళంలో ఉంచుకుని శివుడు ప్రపంచాలను కాపాడాడని, అదేవిధంగా ప్రపంచంలో కలిగే అనేక వికృతులు, విపత్తుల నుంచి ప్రపంచాన్ని కాపాడగలిగేది భారతదేశమనే విషయాన్ని అన్నీ దేశాలు గుర్తిస్తున్నాయని చెప్పారు. అయితే, అఖండ భారత్ గా అత్యంత శక్తిమంతంగా వెలుగొందిన ప్రాంతాలిప్పుడు మనతో కలిసి లేకుండా ఆగమైపోయే పరిస్థితికి చేరాయన్నారు. అవి మళ్లీ బాగుపడాలంటే..

పాకిస్తాన్ పునరేకీకరణ
‘‘ధర్మానికి కేంద్ర బిందువైన భారత్ నుంచి విడిపోయి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ప్రత్యేక దేశాలుగా ఏర్పడిన నాటి నుంచి ఇవాళ్టి దాకా అక్కడ అశాంతి, అలజడి రాజ్యమేలుతోంది. వాళ్లు ఎన్నోరకాల ప్రయత్నాలు చేశారు. అన్నింటిలోనూ విఫలమయ్యారు. దేశం నుంచి విడిపోయిన ఆ ప్రాంతాల్లో ఇప్పుడు అసంతృప్తి నెలకొని ఉంది. అవి తిరిగి భారత్ లో కలవడం చాలా అవసరం. ఎందుకంటే అఖండ భారత్ లో పనరేకీకరణ కావడంతోనే, భారత్ లో కలవడంతోనే వారి సమస్యలన్నీ తీరిపోతాయి. అందుకుగల ఏకైక మార్గం..

యుద్ధంతోకాదు.. ధర్మంతోనే
అఖండ భారత్ నుంచి విడిపోయిన ప్రాంతాలను మళ్లీ ఏకం చేయాలని మనం కోరేది, ఆశించేది.. ఎవరిపైనో అణిచివేత కోసమో, ఆధిపత్యం కోసమో కాదు సుమా! అఖండ భారత్ గురించి మనం మాట్లాడుతున్నామంటే అది ధర్మం గురించే అని గుర్తెరగాలి. శాశ్వతమైన సనాతన ధర్మమే అఖండ భారత్ కు, సర్వమానవాళికి అక్కరకొచ్చే బాట. మిగతా ప్రపంచమంతా ఆ ధర్మాన్ని హిందూ ధర్మం అనే పేరుతో వ్యవహరిస్తుంది'' అని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. చివరిగా..

హిందూ అహంకారం వద్దు..
సనాతన హిందూ ధర్మానికి తానే పరిరక్షకుడిని అనే అహంకారం ఏ ఒక్కరిలోనూ ఉండరాదని ఆర్ఎస్ఎస్ చీఫ్ చెప్పారు. నిస్వార్థ సేవ, క్షమాగుణం భారత్ కు మాత్రమే ఉందని, ప్రపంచాన్ని కరోనా మహమ్మారి నుంచి కాపాడగల శక్తి భారత్ కు ఉందని, అందుకే ప్రపంచ దేశాలు మనవైపు చూస్తున్నాయని, విశ్వగురువుగా భారత్ అందరి విశ్వాసం పొందుతుందని, ప్రపంచానికి మంచి జరగాలంటే అఖండ భారత్ తప్పనిసరి అని, ఆ దిశగా భారత పౌరులు సాగాలని మోహన్ భగవత్ సెలవిచ్చారు. గత వారం బీజేపీ కీలక నేత, త్రిపుర సీఎం బిప్లబ్ కుమార్ దేబ్ మాట్లాడుతూ.. పొరుగుదేశాలైన నేపాల్, శ్రీలంకలోనూ బీజేపీ ప్రభుత్వాలు ఏర్పాటయ్యేలా అమిత్ షా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారన్న వ్యాఖ్యలను పార్టీ సమర్థించిన నేపథ్యంలో ఇప్పుడు ఆర్ఎస్ఎస్ చీఫ్ సైతం అఖండ భారత్ ఆవశ్యకతను చాటిచెప్పడం ప్రాధాన్యతన సంతరించుకుంది. కాగా,

ఆదిలాబాద్ జిల్లాకు ఆర్ఎస్ఎస్ చీఫ్
తెలంగాణ పర్యటనలో భాగంగా గురువారం హైదరాబాద్ లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్.. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లాకు వెళ్లనున్నారు. జిల్లాలోని గుడిహత్నూర్ మండలం లింగపూర్‌లో మోహన్ పర్యటించున్నారు. ఈ సంరద్భంగా సేంద్రీయ సాగు చేస్తున్న రైతులతో ఆర్ఎస్ఎస్ చీఫ్ ముఖాముఖి నిర్వహించనున్నారు. ఏకలవ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరిగాయి. మహారాష్ట్రతో సరిహద్దులు పంచుకునే ఆదిలాబాద్ ఎంపీ సీటును బీజేపీ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.
అజిత్ దోవల్ రహస్య మంతనాలు -భారత్, పాకిస్తాన్ సైన్యాల కీలక నిర్ణయం -ఇకపై సరిహద్దులో..