Mood of Migrant Workers : వలస కూలీలు మళ్లీ తిరిగొస్తారా.. లేటెస్ట్ సర్వే ఏం చెబుతోంది...
కరోనా లాక్ డౌన్ ఎగ్జిట్ స్టేజీకి వచ్చినా వలస కూలీల కష్టాలకు తెరపడట్లేదు. నేషనల్ హైవేలపై ముల్లె మూటలతో స్వస్థలాలకు తరలిపోతున్న వలస జీవులు ఇప్పటికీ కనిపిస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా వీరి జీవితాలు స్తంభించిపోవడంతో స్వస్థలాల బాట పట్టారు. కానీ ఈ కూలీలే లేకపోతే దేశం ముందుకు సాగుతుందా.. సమస్త రంగాలు స్తంభించిపోవా.. అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. స్వస్థలాలకు వెళ్తున్న ఈ కూలీలు తిరిగి పట్టణాలు,నగరాలకు రాకపోతే అనేక రంగాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ మాతృ సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(RSS) 'మూడ్ ఆఫ్ మైగ్రెంట్ వర్కర్స్(వలస కూలీల ఆలోచనా ధోరణి)పై ఒక సర్వేని చేపట్టింది.
తెలంగాణలో కొత్తగా 38 కరోనా కేసులు నమోదు, 45కు చేరిన మరణాలు

మళ్లీ తిరిగొస్తారా..?
లాక్ డౌన్ కారణంగా నగరాల్లో చిక్కుకుపోయి.. స్వస్థలాలకు సాగిపోతున్న వలస కూలీల మూడ్‌ను తెలుసుకునేందుకు ఈ సర్వేని చేపట్టినట్టు ఆర్ఎస్ఎస్ వెల్లడించింది. మొదట కర్ణాటక నుంచి ఈ సర్వేని మొదలుపెట్టినట్టు తెలిపిన ఆర్ఎస్ఎస్.. ఇందుకోసం మొత్తం 25వేల మంది అభిప్రాయాలు సేకరించినట్టు తెలిపింది. సర్వేలో 60శాతం మంది వలస కూలీలు తిరిగి తమ పని ప్రదేశాలకు వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసినట్టు పేర్కొంది. 25శాతం మంది కూలీలు తమ గ్రామాలకు సమీపంలోని పట్టణాల్లోనే ఏదో ఒక బతుకు దెరువు చూసుకుంటామని చెప్పినట్టు పేర్కొంది. ఇక 15శాతం మంది కూలీలు తిరిగి నగరాల ముఖం చూసేది లేదని.. స్వస్థలాల్లోనే ఉండిపోతామని స్పష్టం చేసినట్టు తెలిపింది.

ఆర్ఎస్ఎస్ ఏమంటోంది..
ఉత్తరప్రదేశ్,బీహార్,మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోనూ ఈ సర్వేని నిర్వహించినట్టు ఆర్ఎస్ఎస్ వెల్లడించింది. ఆర్ఎస్ఎస్ జాయింట్ సెక్రటరీ మన్మోహన్ వైద్య దీనిపై జాతీయ మీడియాతో మాట్లాడుతూ..'వలస కూలీల సమస్యలు,వారి దుస్థితి గురించి మేము తీవ్రంగా ఆందోళన చెందుతున్నాం. మాకు సాధ్యమైన రీతిలో వారికి ఉత్తమ సేవలు, సాయం అందిస్తున్నాం. చాలామంది స్వయం సేవక్ కార్యకర్తలు వలస కూలీలకు పలు రకాలుగా సాయం అందిస్తున్నారు. వలస కూలీల ప్రస్తుత మనస్తత్వం(మూడ్) గురించి తెలుసుకునేందుకు ఈ సర్వే చేపట్టాం. వారు ఎదుర్కొంటున్న సమస్యలు,ఒకవేళ పరిస్థితులు సాధారణ స్థితికి వస్తే తిరిగి నగరాలకు వెళ్తారా లేదా.. వంటి వివరాలను అడిగి తెలుసుకుంటున్నాం.' అని చెప్పారు.

ఈ సర్వేతో యాక్షన్ ప్లాన్...
ఆర్ఎస్ఎస్కు గ్రామీణ స్థాయిలో మంచి పట్టు ఉందని.. వేలాది గ్రామాల్లో అద్భుతమైన పనులు వారు నిర్వహించారని మన్మోహన్ వైద్య తెలిపారు. లాక్ డౌన్ వేళ దేశవ్యాప్తంగా పేద ప్రజలకు సాయం చేసేందుకు 3,42,000 ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను మోహరించినట్టు చెప్పారు. దాదాపు 67వేల చోట్ల వారు ఆహారం పంపిణీ చేస్తున్నారని పేర్కొన్నారు.తాజా సర్వే ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టాల్సిన చర్యల గురించి ఒక అవగాహన ఏర్పడుతుందన్నారు. గ్రామాలలో తమ కార్యాచరణకు ఒక ప్లాన్ రూపొందించడానికి, గ్రామాలను స్థిరమైన యూనిట్లుగా అభివృద్ధి చేయడానికి, గ్రామోదయ్ కాన్సెప్ట్‌ను అమలుచేసేందుకు సర్వే ఉపయోగపడుతుందన్నారు.

ఆ రెండు రాష్ట్రాలు తమ ప్రధాన ఫోకస్ అన్న ఆర్ఎస్ఎస్..
వలస సంక్షోభం ఎక్కువగా ఉన్నది బీహార్,మధ్యప్రదేశ్,ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో అని చెప్పారు. తమ ప్రధాన దృష్టి బీహార్,ఉత్తరప్రదేశ్‌పై ఉందన్నారు. మొదట స్వస్థలాలకు వస్తున్న వలస కూలీలు అక్కడ నిలదొక్కుకునేందుకు ఆసరాగా ఉద్యోగాలు కల్పించడం వంటి అంశాలపై ఫోకస్ చేసినట్టు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీ ద్వారా గ్రామీణ ప్రాంతాల ఆర్థిక స్థితి గతులు ఏమైనా మెరుగవుతాయా అన్న అంశాన్ని కూడా సర్వే ద్వారా అంచనా వేస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వానికి సొంత సర్వేలు ఉన్నప్పటికీ.. తమ సర్వేలను కూడా అందిస్తామని,వాటిని ప్రభుత్వం ఉపయోగించుకోవచ్చునని చెప్పారు.