అంతా 24గంటల్లోనే: ప్రధాని మోడీతో బేర్‌గ్రిల్స్ "షో" వెనక అసలు కథ
న్యూఢిల్లీ: ప్రముఖ సాహసికుడు బేర్ గ్రిల్స్.. పరిచయం అక్కర్లేని పేరు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాహసయాత్రికుల్లో ఈయనే ప్రథమస్థానంలో ఉన్నారు. అత్యంత భయంకరమైన ప్రాంతాల్లో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఆప్రాంతం యొక్క విశిష్టతన ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేస్తారు. ఈ సాహస యాత్రలో భాగంగానే ప్రధాని నరేంద్ర మోడీతో కలిసి ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్‌లో సాహసయాత్ర నిర్వహించారు.
వివాదాలకు కేరాఫ్ : జింబాబ్వే మాజీ అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే కన్నుమూత

బేర్ గ్రిల్స్‌కు ఒక్కరోజులోనే అన్ని అనుమతులు
బేర్ గ్రిల్స్ ప్రధాని మోడీతో కబుర్లు చెప్పుకుంటూ ఆయన్ను అడవి మొత్తం తిప్పాడు. అయితే ఒక దేశ ప్రధాని అలా వెళ్లాలంటే ఎన్నో అనుమతులు కావాలి. ప్రోటోకాల్ వీడి రావాలంటే కూడా కష్టమే. కానీ ప్రధాని మోడీతో తాను ఓ సాహసయాత్రకు శ్రీకారం చుడుతున్నట్లు సంబంధిత భారత శాఖలకు చెప్పగానే అన్ని డిపార్ట్మెంట్లు ఒక్కరోజులోనే అనుమతులు ఇచ్చేశాయి. ఇక తన ప్రోగ్రాం మ్యాన్ వర్సెస్ వైల్డ్ కోసం అనుమతి ఇవ్వాల్సిందిగా బేర్ గ్రిల్స్ శాన్ఫ్రాన్సిస్కోలోని భారత రాయబారి కార్యాలయంలో ఫిబ్రవరి4న దరఖాస్తు చేసుకున్నారు. అంతేకాదు ఫిబ్రవరి 14 మరియు 15న ప్రధాని మోడీతో కలిసి జిమ్ కార్బెట్ నేషనల్ పార్కులో షూటింగ్ చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. బేర్ గ్రిల్స్ దరఖాస్తులో తన టీమ్‌కు సంబంధించిన 16 మంది పేర్లను పొందుపర్చాడు. ఇందులో ఎలాంటి ఎక్విప్మెంట్ వినియోగిస్తున్నారో కూడా తెలిపారు.

అనుమతులకు చొరవ తీసుకున్న భారత కాన్సులేట్
ఇక దరఖాస్తు అందుకున్న భారత కాన్సులేట్ అధికారిణి సుమతి వెంటనే అంటే ఫిబ్రవరి 7న భారత విదేశాంగ శాఖ కార్యాలయానికి ఈమెయిల్ చేశారు. జిమ్ కార్బెట్ అడవుల్లో బేర్ గ్రిల్స్ ఓ ప్రముఖ వ్యక్తి అతిథిగా ఒక ప్రోగ్రాం చేయాలని దరఖాస్తు చేసుకున్నారని, ఈ కార్యక్రమం ద్వారా భారతదేశ ప్రభుత్వం అడవులను సంరక్షించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటుందో ప్రపంచానికి తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నారని ఇందుకు కావాల్సిన అన్ని అనుమతులు ఇవ్వాల్సిందిగా అభ్యర్థన పెట్టుకున్నారంటూ మెయిల్ చేశారు సుమతి. అంతేకాదు ఫిబ్రవరి 9వ తేదీ నుంచే షూటింగ్ మొదలవుతుందని లేఖ ద్వారా తెలియజేశారు.

బేర్ గ్రిల్స్ దరఖాస్తులో ప్రస్తావించని ప్రధాని మోడీ పేరు
విదేశాంగ శాఖ పబ్లిసిటీ ఆఫీసర్ ఖైలాష్ భట్ అదే రోజున పర్యావరణ మంత్రిత్వశాఖకు మెయిల్‌ను ఫార్వర్డ్ చేస్తూ అర్జెంటుగా దీనికి అనుమతులు ఇవ్వాల్సిందిగా కోరారు. ఇక అటవీశాఖ జాతీయ పులుల సంరక్షణ అథారిటీ డీఐజీ నిషాంత్ వర్మ కూడా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కొన్ని షరతులపై ఇచ్చారు. ఫిబ్రవరి 9 నుంచి 16 వరకు షూటింగ్ నిర్వహించుకోవచ్చని అనుమతించారు. ఈ విషయాలన్నీ ఆర్టీఐ వెల్లడించింది. అయితే ఈ మొత్తం ఎపిసోడ్‌కు సంబంధించి వివరాలు ఇవ్వాల్సిందిగా లక్నో నివాసి సామాజిక కార్యకర్త డాక్టర్ నూతన్ ఠాకూర్ ఆర్టీఐలో దరఖాస్తు చేశారు. మ్యాన్ వర్సెస్ వైల్డ్‌కు సంబంధించి అనుమతుల కోసం దాఖలైన అప్లికేషన్లో ఒక ప్రత్యేకమైన అతిథితో షూటింగ్ చేస్తామని తన దరఖాస్తులో బేర్ గ్రిల్స్ పేర్కొన్నట్లు సామాజిక కార్యకర్త డాక్టర్ నూతన్ ఠాకూర్ తెలిపారు. అందులో ఎక్కడా ప్రధాని నరేంద్ర మోడీ పేరును బహిరంగపర్చినట్లు లేదని నూతన్ ఠాకూర్ వెల్లడించారు.