Sabarimala: కేరళ వెళ్లకూడదని డిసైడ్ అయిన అయ్యప్ప భక్తులు, భవనం సన్నిధానంకు శ్రీకారం, తిరుమల!
శబరిమల/ కొచ్చి/ బెంగళూరు/ ఉడిపి: పవిత్రమైన శబరిమల అయ్యప్పస్వామిని దర్శించుకోవడం ఈ ఏడాది కష్టంగా మారడంతో అయ్యప్పస్వామి భక్తులు వేరే మార్గాలు అన్వేషిస్తున్నారు. కేరళ ప్రభుత్వం వింతపొకడ, కఠినమైన నిర్ణయాలతో విసిగిపోయిన అయ్యప్పభక్తులు ఈ ఏడాది మకరవిలక్కు ఉత్సవాల సందర్బంగా కేరళ వెళ్లకుండా వారివారి సొంత ప్రాంతాల్లో భవనం సన్నిధానం యాత్ర పేరుతో ప్రత్యేక పూజలు చెయ్యాలని నిర్ణయించారు. ఎంతో పవిత్ర దీక్ష కొనసాగిస్తున్న అయ్యప్పస్వామి భక్తులు 2021 జనవరి 14వ తేదీన మకర సంక్రాంతి సందర్బంగా (మకరవిలక్కు) వారి ఇళ్లల్లోనే కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేసి అయ్యప్ప దీక్షను విరమించాలని నిర్ణయించారు. ప్రపంచ ప్రసిద్ది చెందిన తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారిని (శ్రీవారిని) దర్శించుకోవడానికి ఎక్కువ మందికి అవకాశం ఇస్తున్నా శబరిమలకు భక్తులు వెళ్లకుండా కేరళ ప్రభుత్వం ఆంక్షలు విధించడంతో అయ్యప్ప భక్తులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

కేరళ ప్రభుత్వం తీరుతో విసుగు
ప్రతి సంవత్సరం శబరిమలకు కొన్ని లక్షల మంది అయ్యప్పస్వామి భక్తులు వెళ్లి వస్తుంటారు. కరోనా వైరస్ (COVID-19) పుణ్యమా అంటూ ఈ ఏడాది అయ్యప్పస్వామి భక్తులు ఎక్కువ మంది శబరిమలకు రాకుండా కేరళ ప్రభుత్వం అనేక నియమనిబంధనలు విధించింది. ఈ ఏడాది అయ్యప్పస్వామిని దర్శించుకోవడానికి ఇప్పటి వరకు రెండు లక్షల మంది కూడా వెళ్లలేకపోతున్నారు.

సాధ్యం అవుతున్నా సమస్యలు
శబరిమలలోని అయ్యప్పస్వామిని దర్శించుకోవాలని అయ్యప్ప భక్తులు ఆన్ లైన్ లో టిక్కెట్లు బుక్ చేసుకుని వైద్యుల దగ్గర కచ్చితంగా కోవిడ్ నెగటివ్ సర్టిఫికెట్ తీసుకుని వెళ్లాల్సి ఉంది. కోవిడ్ పరీక్షలు చేయించుకుని శబరిమలకు వెలుతున్న అయ్యప్ప భక్తులకు కేరళ ప్రభుత్వం విధించిన నియమాల కారణంగా అనేక సమస్యలు ఎదురౌతున్నాయని ఆరోపణలు ఉన్నాయి.

అయ్యప్ప భక్తులు డిసైడ్ అయ్యారు
అందరూ ఆన్ లైన్ లో టిక్కెట్లు బుక్ చేసుకుని కోవిడ్ నెగటివ్ సర్టిఫిక్ తీసుకుని శబరిమలకు వెళ్లడం సాధ్యం కాదని కొందరు భక్తులు డిసైడ్ అయ్యారు.
కర్ణాటకలోని ఉడిపి, దక్షిణ కన్నడ, ఉత్తర కన్నడ జిల్లాల్లోని అయ్యప్పస్వామి భక్తులు ప్రతి సంవత్సరం అయ్యప్పస్వామి ధీక్ష చేపట్టి అందరూ కలిసి శబరిమల యాత్ర చేపట్టి కేరళలోని శబరిమలకు వెళ్లి అయ్యప్పస్వామిని దర్శించుకుని వారివారి ప్రాంతాలకు తిరిగి వెలుతుంటారు. అయితే ఈ ఏడాది మకర సంక్రాంతి సందర్బంగా శబరిమలకు వెళ్లకూడదని ఉడిపి, ఉత్తర కన్నడ, దక్షిణ కన్నడ జిల్లాలోని అయ్యప్పస్వామి భక్తులు డిసైడ్ అయ్యారు.

భవనం సన్నిధానంకు శ్రీకారం
పవిత్రమైన అయ్యప్పస్వామి మాల వేసుకుని మకర సంక్రాంతి పండుగ సందర్బంగా శబరిమలకు వెళ్లలేని అయ్యప్పస్వామి భక్తులు అందరూ కలిసి భవనం సన్నిధానం యాత్రకు శ్రీకారం చుడుతున్ననారు. మకర సంక్రాంతి పండుగ సందర్బంగా ఉడిపి. దక్షిణ కన్నడ, ఉత్తర కన్నడ జిల్లాల్లోని అన్ని అయ్యప్పస్వామి ఆలయాల్లో భవనం సన్నిధానం యాత్ర పేరుతో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు చేసి అన్నధానం చెయ్యాలని అయ్యప్ప భక్తులు నిర్ణయించారు.

ఇంట్లో దీక్ష విరమణ
సంక్రాంతి పండుగ సందర్బంగా ప్రతి అయ్యప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి అన్నధానం చేసిన తరువాత అయ్యప్పమాల వేసిన భక్తులు వారివారి ఇళ్లలో కుటుంబ సభ్యులతో కలిసి నిష్టగా అయ్యప్పస్వామికి ప్రత్యేక పూజలు చెయ్యాలని అయ్యప్పస్వాముల భక్త మండలి నిర్ణయించింది. ఈ సంవత్సరం అయ్యప్పస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి భవన సన్నిధానం అంటూ వారి ఇంటినే అయ్యప్పస్వామి సన్నిధానంగా భావించి అయ్యప్ప దీక్ష విరమించాలని ఉడిపి, దక్షిణ, ఉత్తర కన్నడ జిల్లాలోని అయ్యప్పస్వాముల భక్త మండలి నిర్ణయం తీసుకుంది.