Sabarimala : అయ్యప్ప మాలధారులపై కరోనా ఎఫెక్ట్ ... శబరిమలకు వెళ్ళే భక్తుల సంఖ్య ఈ సారి తక్కువే !!
స్వామియే శరణం అయ్యప్ప... హరి హర సుతనే శరణం అయ్యప్ప అంటూ ప్రతి సంవత్సరం అయ్యప్ప మాలధారులు , అయ్యప్ప స్వామి మాల ధరించి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజాధికాలు నిర్వహించేవారు . ముఖ్యంగా దక్షినాది రాష్ట్రాల్లో లక్షల సంఖ్యలో అయ్యప్ప మాల ధరించేవారు . అయితే ఈ ఏడాది కరోనా కారణంగా చాలామంది అయ్యప్ప మాల ధరించడానికి వెనకడుగు వేశారు. అయ్యప్ప స్వామి మాల ధరించిన వారు ఆచరించాల్సిన కఠిన నియమాల నేపధ్యంలో కరోనా ఎక్కడ ఎటాక్ అవుతుందో అన్న భయంతో అయ్యప్ప దీక్షలకు దూరంగా ఉన్నారు.
శబరిమలకు వెళ్ళే భక్తుల కోసం హెల్ప్ లైన్ ప్రారంభం ... కరోనా సమయంలో భక్తుల భద్రతకు ప్రాధాన్యం

ఒకపక్క కరోనా, మరోపక్క కఠిన నియమాలు .. తగ్గిన అయ్యప్ప దీక్షలు
అయ్యప్ప మాలధారులు ఉదయం నాలుగు గంటలకే నిద్ర లేవడం, చన్నీళ్ల స్నానం చేయడం, నేలపైనే పడుకోవడం, ఒక పూట భోజనం చేయడం, అత్యంత కఠినమైన నియమాలను పాటించడం వంటి కారణాలతో చాలామంది కరోనా వ్యాప్తి నేపథ్యంలో మాల ధారణకు వెనకడుగు వేశారు.
అయ్యప్ప స్వామి మాల ధరించి ఇంట్లో ఉండలేనివారు గ్రూపులుగా బయట రూమ్ తీసుకుని ఉండేవారు. కఠినమైన నియమాలు పాటించి ఇరు ముళ్ళు సమర్పించడానికి శబరిమలకు వెళ్లేవారు. చాలామంది కాలినడకన శబరి ప్రయాణం చేసేవారు.

కరోనా నేపధ్యంలో శబరిమలకు వెళ్ళటం సేఫ్ కాదని స్థానిక ఆలయాల్లోనే
ఈసారి శబరిమలకు ప్రయాణించడం కరోనా వ్యాప్తి నేపథ్యంలో శ్రేయస్కరం కాదని భావించిన చాలా మంది మాలధారణకు దూరంగా ఉన్నారు. బయట గ్రూపులుగా ఉండే అవకాశం కూడా లేకపోవడంతో ఈ సంవత్సరానికి మాలధారణ విరమించుకున్న వారు కూడా లేకపోలేదు .
ఒకవేళ మాలధారులు ఎవరైనా ఉంటే వారు వారికి సమీపంలో ఉన్న ఆలయాల వద్దనే ఇరుముడి సమర్పించే అవకాశం కూడా లేకపోలేదు. మండల దీక్ష, మకరజ్యోతి దీక్ష తీసుకున్న మాలధారులు ఈసారి శబరిమల దాకా వెళ్తారా అన్నది అనుమానమే . కరోనా నెగిటివ్ సర్టిఫికెట్లు తీసుకు వెళ్ళాల్సిన , రిస్క్ తో కూడిన ప్రయాణం చెయ్యాల్సిన కారణంగా భారీ సంఖ్యలో వెళ్ళే అవకాశం లేదు .

కేరళలో కరోనా తీవ్రత ... ఈసారి మాల ధారణ చేసిన వారు కూడా తక్కువే
ఇండియాలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో, అందులోనూ కేరళ రాష్ట్రంలో కరోనా తీవ్రత అధికంగా ఉన్న కారణంగాఈసారి గతంతో పోల్చుకుంటే శబరిమలై వెళ్లే భక్తుల సంఖ్య తక్కువగా ఉంటుందని ఒక అంచనా. అయ్యప్ప ఆలయం ఎప్పుడు తెరుస్తారు అన్నది మొదట్లో భక్తులకు క్లారిటీ లేకపోవడం, ఆలయం తెరిచినప్పటికీ కరోనా వ్యాప్తి నేపథ్యంలో విధించిన కఠిన నియమాలు, మాలధారులు అంతా కలిసికట్టుగా ఉండలేని పరిస్థితులు, చలికాలంలో కరోనా తీవ్రత పెరుగుతుందన్న వైద్యనిపుణుల హెచ్చరికల నేపథ్యంలో బ్రతికుంటే వచ్చే సంవత్సరం మాల ధారణ చేయవచ్చని చాలామంది అయ్యప్ప దీక్ష తీసుకోలేదు.

కరోనా నుండి బయటపడితే వచ్చే ఏడాది భారీగానే అయ్యప్ప భక్తులు
ప్రభుత్వాలు కూడా కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రతి రాష్ట్రంలో నిబంధనలు విధించడంతో ఎక్కడ ఇబ్బంది పెడతామో అని భావించిన చాలా మంది భక్తులు ఈ ఏడాది స్వామికి మనసులోనే నమస్కరించి స్వామియే శరణం అయ్యప్ప అనేశారు. కరోనా తగ్గి అంతా క్షేమంగా ఉంటే వచ్చే సంవత్సరం భారీ సంఖ్యలో అయ్యప్ప స్వామి భక్తులు మాలధారణ చేసే అవకాశం ఉంటుంది.
అప్పుడు శబరిగిరికి భక్తులు పోటెత్తే అవకాశం ఉంది .