Sabarimala: శబరిమలలో నకిలీ కోవిడ్ పరీక్షల సర్టిఫికెట్లు, ఒకే రోజు అధికారులకు షాక్, దేవస్వం వార్నింగ్ !
శబరిమల/ కొచ్చి/ పంపా: శబరిమలలో మకరవిలక్కు ప్రత్యేక పూజలు ప్రారంభం అయిన తరువాత కొందరు అయ్యప్ప భక్తులు దేవస్వం బోర్డు అధికారులకు చుక్కలు చూపించారు. శబరిమలకు వెలుతున్న అయ్యప్పస్వామి భక్తులకు కచ్చితంగా COVID-19, RT PCR పరీక్షలు తప్పనిసరి చెయ్యడంతో కొందరు నకిలీ పరీక్షల పర్టిఫికెట్లు చేతుల్లో పెట్టుకుని శబరిమలకు వెలుతున్నారని వెలుగు చూసింది. మకరవిలక్కు యాత్ర సందర్బంగా శబరిమలకు ప్రతిరోజూ 5, 000 మంది భక్తులకు వెళ్లడానికి అనుమతి ఇచ్చిన వెంటనే ఈ నకిలీ కోవిడ్ పరీక్షల భాగోతం బయటపడటంతో అధికారులు హడలిపోయారు. నకిలి సర్టిఫికెట్లు తీసుకు వచ్చే అయ్యప్ప భక్తులకు దేవస్వం బోర్డు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది.
Sabarimala: కంటోన్మెంట్ జోన్ లోకి శబరిమల ?, ఆరు మంది అర్చకులు, సన్నిధానంలో 37 మందికి కరోనా !

5 వేల మందికి అవకాశం
శబరిమలకు ప్రతిరోజు 5 వేల మంది వెళ్లడానికి ఇటీవల కేరళ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులు కచ్చితంగా 48 గంటల ముందు ఆర్ టీపీఆర్ సీ పరీక్షలు చేయించుకోవాలని కేరళ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆర్ టీపీఆర్ సీ పరీక్షలు చేయించుకుని కచ్చితంగా కోవిడ్ నెగటివ్ సర్టిఫికెట్ ఉంటేనే శబరిమల సన్నిధానంలోకి అనుమతి ఇస్తామని ఇప్పటికే దేవస్వం బోర్డు అధికారులు స్పష్టం చేశారు.

చేతులు ఎత్తేసిన అధికారులు
ప్రతిరోజు 5 వేల మంది అయ్యప్ప భక్తులకు కోవిడ్ పరీక్షలు చేసే బాధ్యత, వారు తీసుకు వస్తున్న ఆర్ టీపీఆర్ సీ పరీక్షల సర్టిఫికెట్లు పరీశీలించే బాధ్యతను నీలక్కల్ లోని పోలీసు కంట్రోల్ రూమ్ లో విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులు, దేవస్వం బోర్డు అధికారులకు అప్పగించారు. అయితే అయ్యప్ప భక్తులకు కోవిడ్ పరీక్షలు నిర్వహించడంలో, వారు తీసుకువస్తున్న సర్టిఫికెట్లు పరిశీలించడంలో విఫలం అయ్యారని ఆరోపణలు ఉన్నాయి.

ఒకే రోజు 40 నకిలీ పరీక్షల సర్టిఫికెట్లు
శబరిమలకు వెళ్లే భక్తులు ఆర్ టీపీసీఆర్ పరీక్షలు చేయించుకుని వెలుతున్న వారి సర్టిఫికెట్లను నీలక్కల్ పోలీసులు పరిశీలించారు. నీలక్కల్ పోలీసు కంట్రోల్ రూమ్ లో మొత్తం 3, 225 అయ్యప్ప భక్తుల ఆర్ టీపీసీఆర్ పరీక్షల పత్రాలు పరిశీలించగా అందులో 40కు పైగా నకిలీ ఆర్ టీపీసీఆర్ సర్టిఫికెట్లు ఉండటంతో అధికారులు షాక్ అయ్యారు.

ఇలాంటి పనులు చెయ్యకూడదు
కొందరు అయ్యప్ప భక్తులు ఇలాంటి నకిలీ ఆర్ టీపీసీఆర్ సర్టిఫికెట్లు తీసుకువచ్చి సాటి అయ్యప్ప భక్తుల ఆరోగ్యంతో చెలగాటం ఆడటం మంచిదికాదని దేవస్వం బోర్డు అధికారులు అన్నారు. ప్రభుత్వం అనుమతి పొందిన కోవిడ్ పరీక్షా కేంద్రాల్లో ఆర్ టీపీసీఆర్ పరీక్షలు చేయించకుని శబరిమలకు రావాలని, ఇలాంటి నకిలీ పరీక్షల సర్టిఫికెట్లు తీసుకువస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని దేవస్వం బోర్డు అధికారులు హెచ్చరించారు.