Sabarimala: అయ్యప్ప భక్తుల తుపాన్ ఎఫెక్ట్, శబరిమల, పంపా, ఎరిమేళి ఉన్న జిల్లాలో హై అలర్ట్ !
శబరిమల/ కొచ్చి/ తిరువనంతపురం: బురేవి తుపాను దెబ్బతో శబరిమల అయ్యప్పస్వామి భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బురేవి తుపాను కారణంగా తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోని అనేక జిల్లాల్లో ప్రభుత్వ సెలవులు ప్రకటించారు. రెండు రాష్ట్రాల్లోని ప్రజలు దాదాపు ఇళ్లకే పరిమితం అయ్యారు. కేరళలోని శబరిమలకు వెళ్లే జిల్లాల్లో చిక్కుకున్న అయ్యప్ప భక్తులకు స్థానికులు సహకరించి ఆశ్రయం కల్పిస్తున్నారు. శబరిమల ప్రాంతంలో ఉన్న పతనంతిట్ట జిల్లాలో కేరళ ప్రభుత్వం ప్రభుత్వ సెలవు ప్రకటించింది. శబరిమల అయ్యప్ప భక్తులకు ఎలాంటి సమస్యలు ఎదురు కాకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పలు జిల్లాల్లో అయ్యప్పస్వామి భక్తులు కల్యాణ మండపాల్లో బస చెయ్యడానికి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు.
Sabarimala: నిన్న రోజుకు రూ. 3. 5 కోట్లు ఆధాయం, నేడు రూ. 10 లక్షలు, ప్రభుత్వం వింతనియమాలు!

అయ్యప్ప భక్తులకు బురేవి తుపాను దెబ్బ
నివర్ తుపాను కారణంగా ఇప్పటికే అయ్యప్పస్వామి భక్తులు అనేక సమస్యలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు బురేవి తుపాను కారణంగా కేరళ, తమిళనాడుతో పొరుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఇప్పటికే బురేవి తుపానుతో జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నివర్ తుపాను వెళ్లిపోయింది అనుకుంటున్న సమయంలో మరోసారి బురేవి తుపాను రూపంలో భారీ వర్షాలు పడటంతో అయ్యప్పస్వామి భక్తులు ఆందోళనకు గురైనారు.

రెడ్, ఆరంజ్, ఎల్లో అలర్ట్
కేరళలోని తిరువనంతపురం, కోల్లాం, పతనంతిట్ట, అళప్పళ జిల్లాల్లో ఆ రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల పాటు రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఈ జిల్లాల్లోని ప్రజలు జాగ్రతగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే హెచ్చరించారు. కేరళలోని ఎర్నాకుళం, కొట్టాయం, ఇడుక్కి జిల్లాలో భారీ వర్షాలు పడుతున్న సందర్బంగా కేరళ ప్రభుత్వం ఆ జిల్లాల్లో ఎల్లో అలర్ట్, ఆరంజ్ అలర్ట్ ప్రకటించింది.

శబరిమల ఉన్న జిల్లాలో హైఅలర్ట్
శబరిమల ఉన్న పతనంతిట్ట జిల్లాలో కేరళ ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. శబరిమల సన్నిధానంతో పాటు పంపా, ఎరిమేళి తదితర చోట్ల భారీ వర్షాల కారణంగా అయ్యప్ప భక్తులు ఇబ్బందులు ఎదుర్కోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పంపా నుంచి శబరిమలకు వెలుతున్న అయ్యప్ప భక్తులు భారీ వర్షాల కారణంగా ఇబ్బందులు ఎదుర్కోకుండా శబరిమల అయ్యప్పస్వామి ఆలయ కమిటి బోర్డు అనేక చర్యలు తీసుకుంది.

చాన్స్ మిస్ అయితే కష్టం
కేరళలో భారీ వర్షాలు పడటంతో శబరిమలకు వచ్చి వెలుతున్న అయ్యప్పస్వామి భక్తులు అనేక జాగ్రత్తలు తీసుకోవాలని శబరిమల దేవస్వం బోర్డు, కేరళ ప్రభుత్వం అయ్యప్ప భక్తులకు మనవి చేసింది. ఆన్ లైన్ లో ముందుగానే డిసెంబర్ 4, 5వ తేదీల్లో అయ్యప్ప దర్శనం కోసం డేట్ ఫిక్స్ చేసుకున్న అయ్యప్ప భక్తులు అనుకున్న సమయానికి అయ్యప్పస్వామిని దర్శించుకోవాలని నిర్ణయించారు.

ప్రత్యేక టీమ్ లు
అయ్యప్పస్వామి భక్తులు భారీ వర్షాల్లో చిక్కుకుని ఇబ్బందులు ఎదుర్కోకుండా చూడటానికి పలు రహదారల్లో ప్రత్యేక వాహనాలతో పెట్రోలింగ్ టీమ్ లు సంచరించాలని కేరళ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. భారీ వర్షాల కారణంగా ఇప్పటికే శబరిమల అయ్యప్ప స్వామి భక్తులు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.