
IPL 2021 Suspended: కీలక వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా కొడుకు
ముంబై: దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలను తోడేస్తోన్న ప్రాణాంతక కరోనా వైరస్ సెగ.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 (IPL 2021)కు కూడా తగిలింది. ఏ ముహూర్తంలో 14వ ఎడిషన్‌ను మొదలు పెట్టారో గానీ.. ఈ మెగా టోర్నమెంట్ కథ అర్ధాంతరంగా ముగిసింది. క్రికెటర్లు, సపోర్టింగ్ స్టాఫ్ కరోనా వైరస్ బారిన పడుతోన్న ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) ఈ టోర్నమెంట్‌ను నిరవధికంగా వాయిదా వేసింది. మళ్లీ ఎప్పుడు పునఃప్రారంభిస్తారనే విషయాన్ని వెల్లడించలేదు. కరోనా సృష్టించిన కల్లోలం ముగిసేంత వరకూ ఇక దాని ఊసు ఎత్తకపోవచ్చు.
IPl 2021 ఫ్రాంఛైజీల్లో కరోనా పుట్ట: వృద్ధిమాన్ సాహా, అమిత్ మిశ్రా: ఇప్పటికే ఆ నలుగురు
ఇదిలావుండగా- ఐపీఎల్ 2021 టోర్నమెంట్ వాయిదా వేయడంపై బీసీసీఐ కార్యదర్శి జయ్ షా స్పందించారు. కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కుమారుడాయన. ఈ మెగా క్రికెట్ ఈవెంట్‌తో ముడిపడి ఉన్న ప్రతి ఒక్కరికి సంపూర్ణ భద్రతను కల్పించాల్సిన బాధ్యత తమపై ఉందని చెప్పారు. క్రికెటర్లు, సపోర్టింగ్ స్టాఫ్, ఫ్రాంఛైజీలు, మేనేజ్మెంట్, టెక్నీషియన్స్, గ్రౌండ్ మెన్, స్టేడియం సిబ్బంది, ఉద్యోగులు, మ్యాచ్‌లను నిర్వహించే అఫీషియల్స్.. ఇలా ప్రతి ఒక్కరి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకున్నామని జయ్ షా అన్నారు.

బయో సెక్యూర్ బబుల్‌ను కల్పించినప్పటికీ.. దాన్ని ఛేదించుకుని కరోనా వైరస్ ఐపీఎల్ 2021ను తాకడం ఆశ్చర్యానికి గురి చేస్తోందని అన్నారు. మ్యాచ్‌ల నిర్వహణ, క్రికెటర్లతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరినీ బయో సెక్యూర్ బబుల్ కింద కట్టుదిట్టమైన ఏర్పాట్లను కల్పించామని, అయినప్పటికీ కొందరు ఆటగాళ్లకు వైరస్ సోకడం ఆందోళనకు గురి చేస్తోందని జయ్ షా వ్యాఖ్యానించారు. దీన్ని పునఃసమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. త్వరలోనే బయో బబుల్ నిబంధనలపై మార్పుపై చర్చిస్తామని అన్నారు. గవర్నింగ్ బాడీలో అన్ని అంశాలపై చర్చించిన తరువాతే ఐపీఎల్ 2021 సీజన్‌ను వాయిదా వేసినట్లు వివరణ ఇచ్చారాయన.
కరోనా సృష్టిస్తోన్న కల్లోల పరిస్థితుల మధ్య మ్యాచ్‌లను నిర్వహించడం ఏ మాత్రం మంచిది కాదంటూ దేశవ్యాప్తంగా డిమాండ్ ఊపందుకోవడం, బోంబే హైకోర్టులో పిల్ దాఖలు కావడం, కొందరు క్రికెటర్లు వైరస్ బారిన పడటం వంటి పరిణామాల మధ్య ఐపీఎల్ 2021 సీజన్‌ను సస్పెండ్ చేసినట్లు బీసీసీఐ ప్రకటించింది. ఈ మేరకు బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ఓ ప్రకటన విడుదల చేశారు. క్రికెటర్ల సంక్షేమానికి తాము ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ఈ సీజన్ టోర్నమెంట్‌ను మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తారనే విషయాన్ని నిర్ధారించట్లేదు.