చరిత్రకెక్కిన సల్మాన్.. శ్రీలంక ఎన్నికల్లో రాజపక్సే తరుపున ప్రచారం, నటి జాక్వెలిన్ కూడా...!
న్యూఢిల్లీ: శ్రీలంకలో అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్ల గెలిచేందుకు అధ్యక్షుడు మహేంద్ర రాజపక్సే... బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌లను రంగంలోకి దించారు.
దీంతో శ్రీలంకలోని కొలంబోలో అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మొట్టమొదటి భారతీయ నటుడిగా సల్మాన్ ఖాన్ చరిత్రకెక్కనున్నారు. ఈ సారి ఎన్నికల్లో అధ్యక్షుడు మహేంద్ర రాజపక్సేకు మద్దతుగా సల్మాన్, జాక్వెలిన్‌తో పాటు మరో ఐదుగురు బాలీవుడ్ నటులు ప్రచారం చేయనున్నారు.
పాఠకుల కోసం ఫేస్బుక్ ద్వారా ఎప్పటికప్పుడు తాజా వార్తలు... లైక్ చేయండి
రాజపక్స కుమారుడు, ఎంపీ నమల్ ప్రచారం కోసం సల్మాన్ ను ఆహ్వానించినట్టు స్థానిక వెబ్ సైట్ 'ఏషియన్ మిర్రర్' పేర్కొంది. ఈ మేరకు సల్మాన్ ఆదివారం శ్రీలంక చేరుకున్నట్టు తెలుస్తోంది. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ స్వదేశం శ్రీలంకే. ఈ మాజీ 'మిస్ శ్రీలంక' రాజపక్స తనయుడు నమల్‌కు మంచి స్నేహితురాలు.

శ్రీలంకలో అధ్యక్ష ఎన్నికలు జనవరి 8న జరగనున్నాయి. షెడ్యూలు కంటే రెండేళ్ల ముందే ఎన్నికలు నిర్వహించాలని రాజపక్స నిర్ణయించారు. సెప్టెంబరులో జరిగిన స్థానిక ఎన్నికల్లో మహేంద్ర రాజపక్సే పార్టీకి ప్రజాదరణ 21 శాతానికి పైగా తగ్గిపోవడంతో ఆయన ముందస్తు ఎన్నికలకు వెళుతున్నట్లు తెలుస్తోంది.
తన ప్రత్యర్ధి నాయకుడైన మైత్రిపాల శిరిసేనను ధీటుగా ఎదుర్కొవడం, తనకు ప్రజల్లో తగ్గిన ప్రజాదరణను తిరిగి సంపాదించుకునే భాగంలో ఎన్నికల ప్రచారంలో బాలీవుడ్ హీరోలను రంగంలోకి దింపినట్లు సమచారం. సల్మాన్ ఖాన్‌తో పాటు బీజేపీ సోషల్ మీడియా గురు అరవింద్ గుప్తా కూడా రాజపక్సే ఎన్నికల ప్రచారంలో కీలక పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది.
భారత్‌లో జరిగిన ఎన్నికల్లో నరేంద్రమోడీ గెలుపొందేందుకు సోషల్ మీడియా ముఖ్య భూమిక పోషించడంతో, రాజపక్సే సోషల్ మీడియాను విరివిగా లంక ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తున్నట్లు తెలస్తోంది. అందుకే అరవింద్ గుప్తాను ఈ అధ్యక్ష ఎన్నికల్లో ప్రచారానికి ఆహ్వానించారు.