మీ ట్యాప్‌లో నీళ్లు రాని పరిస్థితి దగ్గర్లోనే!: ఉపగ్రహ చిత్రాల హెచ్చరిక
న్యూఢిల్లీ: అటు మీడియా, ఇటు సోషల్ మీడియాలో నీటి ప్రాధాన్యత తెలియజేస్తూ అనేక సందేశాలు వస్తున్నప్పటికీ ప్రజలు మాత్రం తమ వైఖరిని మార్చుకోవడం లేదు. దీంతో రానున్న కొద్ది కాలంలో ప్రజలు తమ ఇంట్లోని నల్లాల్లో నీరు రాని పరిస్థితిని ఎదుర్కొక తప్పదని తాజాగా విడుదలైన ఓ ఉపగ్రహ ఛాయచిత్రాలు స్పష్టం చేస్తున్నాయి.
భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని, భూమిన నీటి శాతం కూడా తగ్గిపోతోందని
ఈ చిత్రాలు చెబతున్నాయి. భారతదేశంలో నీటి కొరత ఆందోళనకర పరిస్థితికి చేరుకుందని వెల్లడిస్తున్నాయి. అతి త్వరలోనే దేశంలోని కుళాయిలు పూర్తిగా ఎండిపోనుండటం ఖాయమని చెబుతున్నాయి.

భారీగా తగ్గిపోతున్న నీటి నిల్వలు
మొరాకో, ఇరాక్, స్పెయిన్ లాంటి దేశాల్లో నీటి కొరత మొదలైంది. ప్రపంచ వ్యాప్తంగా నీటి నిలువల తగ్గిపోతున్నాయని తాజా ఉపగ్రహ ఛాయ చిత్రాలు వెల్లడిస్తున్నాయి. ప్రపంచంలోని 5లక్షల డ్యాంలలో నీరు భారీగా తగ్గిపోయిందని ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా తెలిసిందని ది గార్డియన్ పత్రిక తన కథనంలో పేర్కొంది.

భారతదేశంలో పరిస్థితి దారుణమే
భారతదేశంలోని డ్యాంలు, రిజర్వాయర్లలో నీటి నిలువలు భారీగా తగ్గిపోతున్నాయని పేర్కొంది. నీటిని అధికంగా వినియోగించడంతోపాటు దుర్వినియోగం చేయడం కూడా ఇందుకు కారణంగా తెలిపింది. వాతావరణంలో వచ్చే మార్పులు కూడా ఇందుకు కారణంగా నిలుస్తున్నాయని స్పష్టం చేసింది.

భారీగా పడిపోతున్న నిల్వలు
భారతదేశంలోని చాలా రాష్ట్రాలు ఇప్పటికే నీటికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని వెల్లడించింది. నర్మదా నదితో అనుబంధం కలిగిన రిజర్వాయర్లలో నీటి నిల్వలు తగ్గాయని వెల్లడించింది. వర్షాలు లేని కారణంగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇందిరాసాగర్ డ్యాంలో నీరు రికార్డు స్థాయిలో తగ్గిపోయిందని పేర్కొంది.
30మిలియన్ల ప్రజలకు తాగు నీరందించే సర్దార్ సరోవర్ రిజర్వాయర్ పరిస్థితి కూడా ఇలాగే మారిందని వెల్లడించింది. నీరు ఎక్కువగా తీసుకునే పంటలను కొద్ది కాలంపాటు నిలిపేయాలని రైతులకు సూచించడంతోపాటు నీటి పారుదలను తాత్కాలికంగా నిలిపేసిందని గత నెలలో పీటీఐ తన కథనంలో పేర్కొంది.

ఆందోళనకర పరిస్థితే
ఇక ప్రపంచ వ్యాప్తంగా కూడా పలు దేశాలు తీవ్రమైన నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. ఈ జాబితాలో దక్షిణాఫ్రికా మొదటి వరుసలో నిలుస్తోంది. నీటి ఎద్దడి కారణంగా కేప్ టౌన్ ప్రపంచ వ్యాప్తంగా మీడియాల్లో ప్రధాన శీర్షికగా నిలిచిన విషయం తెలిసిందే. మొరాకో, ఇరాన్, స్పెయిన్ దేశాలు కూడా తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. నీటి వనరులను సద్వినియోగం చేసుకోవడంతోపాటు భారీ ఎత్తున మొక్కలను పెంచడం వల్ల ఈ సమస్యకు కొంతమేర పరిష్కారం చూపవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.