జీఎస్టీ కౌన్సిల్ పై సుప్రీంకోర్టు కీలక తీర్పు-కేంద్ర, రాష్ట్రాలు కట్టుబడాల్సిన అవసరం లేదని క్లారిటీ
జీఎస్టీ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ఎదురవుతున్న పలు సమస్యలు, జీఎస్టీ కౌన్సిల్ సిఫార్సుల అమలుకు సంబంధించి నెలకొన్న వివాదాలకు చెక్ పెడుతూ సుప్రీంకోర్టు ఇవాళ కీలక తీర్పు ఇచ్చింది. జీఎస్టీ కౌన్సిల్ చేసే సిఫార్సులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది.జీఎస్టీ కౌన్సిల్ చేసే సిఫార్సులు కేంద్రం, రాష్ట్రాలకు ఆమోదయోగ్యంగా ఉంటేనే అమలు చేయాలని తెలిపింది.
జీఎస్టీ కౌన్సిల్ చేసేసిఫార్సులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలా వద్దా అనే విషయంలో దాఖలైన ఓ పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 246ఏ ప్రకారం సమాన అధికారాలు ఉన్నాయని తెలిపింది. కేంద్రం ఆధ్వర్యంలో ఉంటే జీఎస్టీ కౌన్సిల్ చేసే సిఫార్సుల్ని రాష్ట్రాలు కచ్చితంగా అమలు చేయాల్సిన అవసరం లేదని, అలాగ కేంద్రం కూడా అమలు చేయాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు ధర్మాసనం తేల్చిచెప్పింది. అలాగే కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు సొంత చట్టాలు చేసుకోవచ్చని కూడా సూచించింది.

కేంద్రం, రాష్ట్రాల మధ్య ఆచరణీయ పరిష్కారాన్ని సాధించడానికి జిఎస్టి కౌన్సిల్ సామరస్యపూర్వకంగా పని చేయాలని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. జీఎస్టీ కౌన్సిల్ సిఫార్సులు సహకార చర్చ యొక్క ఫలితం మాత్రమేనని, సమాఖ్య వ్యవస్ధల్లో ఒకటి ఎల్లప్పుడూ అత్యధిక అధికారాలు కలిగి ఉండటం అత్యవసరం కాదని కేంద్ర ప్రభుత్వ పైచేయిని ఉద్దేశించి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ చెప్పారు.