
Pegasus: సుప్రీం మాజీ చీఫ్ జస్టిస్‌పై వేధింపుల ఆరోపణలు: చేసిన వారి ఫోన్లూ హ్యాక్
న్యూఢిల్లీ: దేశంలో రాజకీయంగా ప్రకంపనలను సృష్టిస్తోన్న పెగాసస్ స్పైవేర్ (Pegasus spyware) ఉదంతంలో అనూహ్యమైన పేర్లు బయటకి వస్తోన్నాయి. భారతీయ జనతా పార్టీకి చెందిన కొందరు సీనియర్ నేతల ఫోన్లను కూడా ఈ స్పైవేర్ ద్వారా హ్యక్ చేసినట్లు తెలుస్తోంది. కొందరు బీజేపీలో ప్రారంభం నుంచీ ఉన్న సీనియర్ నేతల ఫోన్లను సైతం 2019 నాటి ఎన్నికల సమయంలో హ్యాక్ చేసినట్లు సమాచారం ఉన్నప్పటికీ.. దాన్ని ఎవరూ ఇంకా ధృవీకరించలేదు. కొందరి పేర్లను రహస్యంగా ఉంచారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
అదే సమయంలో- సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ పేరు కూడా ఈ స్కాండల్‌లో పరోక్షంగా ముడిపడి ఉన్నట్లు ది వైర్ వెబ్సైట్ తెలిపింది. రంజన్ గొగొయ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన సుప్రీంకోర్టు ఉద్యోగినికి సంబంధించిన ఫోన్ నంబర్ కూడా పెగాసస్ స్పైవేర్ ద్వారా హ్యాకింగ్ చేసినట్లు పేర్కొంది. ఆ మహిళా ఉద్యోగినికి చెందిన కుటుంబ సభ్యుల ఫోన్ నంబర్లు కూడా పెగాసస్ స్పైవేర్ టార్గెట్లోకి వెళ్లినట్లు తెలిపింది.

ఆమె కుటుంబానికి చెందిన మూడు నుంచి 11 ఫోన్ నంబర్లు హ్యాక్‌కు గురైనట్లు ది వైర్ పేర్కొంది. రామజన్మభూమి-బాబ్ర మసీదు భూవివాదంపై చారిత్రాత్మక తీర్పునిచ్చిన రంజన్ గొగొయ్ 2019లో పదవీ విరమణ చేశారు. అనంతరం ఆయనను బీజేపీ రాజ్యసభకు నామినేట్ చేసింది. ప్రస్తుతం ఆయన రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతోన్నారు. రంజన్ గొగొయ్ తనపై వేధింపులకు పాల్పడినట్లు ఇదివరకు సుప్రీంకోర్టు ఉద్యోగిని ఒకరు ఆరోపణలు చేశారు.
2018లో జూనియర్ కోర్టు అసిస్టెంట్‌గా ఉన్న సమయంలో వేధింపులకు గురయ్యాయని ఆరోపించారు. ఆ తరువాత కొద్దిరోజులకే ఆమె ఫోన్ నంబర్ పెగాసస్ సర్వైలెన్స్లోకి వెళ్లినట్లు తాజాగా వెల్లడైంది. ఆమె భర్త, మరిది నంబర్లతో పాటు 11 మంది కుటుంబ సభ్యుల ఫోన్లను పెగాసస్ టార్గెట్ చేసినట్లు ది వైర్ తెలిపింది. మొత్తం 300 మందికి పైగా ఫోన్లు హ్యాక్‌కు గురయ్యాయని, ఇప్పటికే పలువురి పేర్లను తాము బయటపెట్టామని పేర్కొంది. మరిన్ని పేర్లపై పరిశీలన సాగుతోందని స్పష్టం చేసింది.
ఇదిలా ఉంటే ఈ మొత్తం వ్యవహారంపై సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ స్పందించేందుకు నిరాకరించారు. స్పైవేర్‌పై తాను ఎలాంటి కామెంట్స్ చేయనని చెప్పారు.