• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

తెలంగాణలో స్కూల్స్ రీఓపెనింగ్... బెంచీకి ఒక్కరే, హాజరు కాకున్నా పరీక్షలు రాయొచ్చు : ప్రెస్ రివ్యూ

By BBC News తెలుగు
|

పాఠశాల విద్యార్థులు

విద్యార్థులు ఇష్టమైతేనే బడికి రావొచ్చు..హాజరులేకపోయినా పరీక్షలు రాయొచ్చు. బెంచీకి ఒక్కరినే కూర్చోబెట్టాలి. ప్రతి విద్యాసంస్థ కచ్చితంగా రెండు ఐసొలేషన్‌ గదులను అందుబాటులో ఉంచుకోవాలి. ఇవీ విద్యాసంస్థల పునఃప్రారంభానికి తెలంగాణ ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాలు అంటూ నమస్తే తెలంగాణ ఒక కథనంలో తెలిపింది.

ఫిబ్రవరి నెల 1నుంచి బడులు, కళాశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యాశాఖ కార్యాచరణను ఖరారు చేసింది. ఈ మేరకు విద్యాశాఖ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి చిత్రా రామచంద్రన్‌ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. 8వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఎలాంటి ప్రత్యక్ష తరగతులు ఉండవని పేర్కొన్నారు. 9 10, ఇంటర్మీడియట్‌, డిగ్రీ, పీజీ, అన్ని సాంకేతిక విద్యాసంస్థలకు మాత్రమే తరగతులు జరుగుతాయని తెలిపారు. 9 ఆపై తరగతులకు బోధించే ఉపాధ్యాయులంతా విధులకు హాజరుకావాల్సిందే. తల్లిదండ్రుల నుంచి లిఖితపూర్వక సమ్మతి పత్రాలు తెచ్చిన వారినే తరగతులకు అనుమతిస్తారు. తరగతులకు హాజరు కాలేని వారికి డిజిటల్‌ విధానంలో పాఠాలు అందుబాటులో ఉంచుతారు.

విద్యాసంస్థలన్నీ కేంద్ర ప్రభుత్వం జారీచేసిన స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌ను పాటించి తరగతులు నిర్వహించుకోవాలని పేర్కొన్నారు. తరగతులకు హాజరయ్యే విద్యార్థులకు మధ్యాహ్నభోజనాన్ని అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ప్రభుత్వ మార్గదర్శకాల అమలు పర్యవేక్షణకు జిల్లాస్థాయిలో ఎడ్యుకేషన్‌ మానిటరింగ్‌ కమిటీ(డీఎల్‌ఈఎంసీ)ని ఏర్పాటు చేస్తారు. కలెక్టర్‌ చైర్మన్‌గా ఉండే ఈ కమిటీలో డీఈవో, ఐటీడీఏ పీవో, డీఎంహెచ్‌వో, డీపీవో,జిల్లా ఇంటర్మీడియట్‌ విద్యాధికారి, డిగ్రీ కాలేజీల ప్రిన్సిపాళ్లు, కలెక్టర్‌ నామినేట్‌ చేసిన ఒకరు సభ్యులుగా ఉంటారు. ఈ నెల 18లోగా యాక్షన్‌ప్లాన్‌ను జిల్లాల్లోని సంబంధిత శాఖాధికారులకు అందజేయాలని పేర్కొన్నారు. సాంఘిక సంక్షేమ, గిరిజన, బీసీ, మైనార్టీ సంక్షేమం, ప్రభుత్వ వసతి గృహాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని పేర్కొన్నట్లు ఈ కథనంలో తెలిపారు.

గ్యాస్ సిలిండర్

బుకింగ్‌ చేసుకున్న రోజే వంటగ్యాస్‌ డెలివరీ

వినియోగదారులు బుకింగ్‌ చేసుకున్న రోజే వంటగ్యాస్‌ డెలివరీ చేసే విధంగా తత్కాల్‌ సేవ ప్రారంభించడానికి ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీ) సన్నాహాలు చేస్తోందని ఈనాడు ఒక వార్త రచురించింది.

'ప్రతి రాష్ట్రం/కేంద్ర పాలిత ప్రాంతంలో ఒక నగరం లేదా జిల్లాను తత్కాల్‌ ఎల్‌పీజీ సేవల ప్రారంభానికి గుర్తించాల్సి ఉంటుంది. ఈ పథకం కింద బుక్‌ చేసుకున్న 30-45 నిమిషాల్లోనే వినియోగదారుడికి గ్యాస్‌ డెలివరీ అందించనున్నాం’ అని ఒక ఐఓసీ అధికారి పేర్కొన్నారు.

కేంద్రం నినాదమైన 'సులభతర జీవనం’ మెరుగుపరచడంలో భాగంగా అందించనున్న ఈ సేవలను ఇంకా ఖరారు చేయాల్సి ఉంది. ఫిబ్రవరి 1 కల్లా తత్కాల్‌ వంటగ్యాస్‌ సేవలను ప్రారంభించాలని చూస్తున్నట్లు ఆ అధికారి తెలిపారు.

ఇండేన్‌ బ్రాండ్‌ ద్వారా ఐఓసీ వంటగ్యాస్‌ సిలిండర్‌లను పంపిణీ చేస్తోంది. దేశవ్యాప్తంగా 14 కోట్ల మంది ఇండేన్‌ వినియోగదారులు ఉన్నారని ఈ వార్తలో రాశారు.

ధూమపానం

తెలంగాణలో వృద్ధులే అధికంగా పొగ తాగుతున్నారు...లాసీ నివేదిక

తెలంగాణ రాష్ట్రంలోని వృద్ధులలో ధూమపాన వ్యసనం ఎక్కువగా ఉంది. వారిలో అధికులు ధూమపానం చేస్తూ... మద్యం సేవిస్తున్నారు. తెలంగాణ జనాభాలో 13.4 శాతం మంది వృద్ధులుండగా, అందులో 35 శాతం మందికి పొగ తాగే అలవాటు ఉందంటూ ఆంధ్రజ్యోతి ఒక కథనాన్ని ప్రచురించింది.

25 శాతం వృద్ధులు రోజూ మద్యపానం సేవిస్తున్నారు. 8.6 శాతం మంది ఎక్కువగా తాగుతున్నారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఇటీవల విడుదల చేసిన 'లాంగిట్యూడినల్‌ ఏజింగ్‌ స్టడీ ఇన్‌ ఇండియా (లాసీ) 2017-18’లో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

లాసీ నివేదికలోని వివరాలు ఇవీ...

రాష్ట్రంలోని వృద్ధుల్లో 66 శాతం నిరాక్షరాస్యులే. 9.7 శాతం మందే పదో తరగతి వరకు విద్యను అభ్యసించారు. రాష్ట్రంలో 82 శాతం కుటుంబాలకు సొంత గృహాలున్నాయి. అందులో 7 శాతం కుటుంబాలు ఇళ్లను కొనుగోలు చేయగా.. 68 శాతం సొంతంగా నిర్మించుకున్నాయి. భారతదేశంలో 46 శాతం కుటుంబాలకు సొంత భూమిలేదు. తెలంగాణలో మాత్రం 52.7 శాతానికి లేదు. 37.9 శాతానికే వ్యవసాయభూమి ఉండగా.. 42 శాతానికి వ్యవసాయ, వ్యవసాయేతర భూములున్నాయి.

తెలంగాణలోని 39 శాతం కుటుంబాలు రుణాలు తీసుకుని అప్పుల్లో చిక్కుకున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో 48 శాతం కుటుంబాలకు అప్పులుండగా.. పట్టణ ప్రాంతాల్లో 22.8 శాతం కుటుంబాలకు ఉన్నాయి. అప్పుల్లో తెలంగాణ దేశంలోనే ఐదో స్థానంలో ఉండటం గమనార్హం. 52.5 శాతంతో పొరుగురాష్ట్రం కర్ణాటక మొదటిస్థానంలో ఉండగా.. ఆ తర్వాతి స్థానాల్లో ఆంధ్రప్రదేశ్‌(44%), బిహార్‌(41.1%), ఒడిశా(40.7%) రాష్ట్రాలున్నాయి. వ్యవసాయ పనిముట్లు, పెళ్లి ఖర్చులు, వైద్యం కోసం ఎక్కువగా అప్పులు చేస్తున్నట్లు లాసీ నివేదిక స్పష్టం చేసింది. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో 32 శాతం కుటుంబాలు ఇప్పటికీ బహిరంగ మలవిసర్జన చేస్తున్నాయని పేర్కొంది. 17.3 శాతం కుటుంబాలకు మహిళలే ప్రధాన ఆధారమని వివరించింది.

తెలంగాణలో 83.3% హిందువులుండగా.. ముస్లింలు 12%, క్రైస్తవులు 3.8%, సిక్కులు 0.4%, బౌద్దులు, జైనులు, పార్శీలు 0.5% మంది ఉన్నారు. ఓబీసీలు 58.5%, ఎస్సీలు 19.9%, ఎస్టీలు 6.4% ఉన్నారు. 10% వృద్ధులు ఒంటరిగా జీవనం కొనసాగిస్తున్నారు. భార్య, భర్తలతో 31%, పిల్లలతో 53%, ఇతరులతో 4.87%మంది ఉంటున్నారు. తమకు కల్పిస్తున్న సౌకర్యాలతో 65% సంతృప్తిగా ఉన్నారు. రాష్ట్రంలో 85% కుటుంబాలకు రేషన్‌ కార్డులున్నాయి. అందులో 80% కుటుంబాలే వాటిని ఉపయోగిస్తున్నాయి.

పురుషులే పొంగళ్లు పెడతారు..ఆ ఆలయంలోకి మహిళలపై నిషేధం

దేశవ్యాప్తంగా ఏ ఆలయంలోనైనా ఆడవారు పొంగళ్లు పెట్టడం ఆనవాయితీ. అటుంటిది ఈ ఆలయంలో పురుషులే పొంగళ్లు పెట్టడం వింత గొలిపే ఆచారం. సంక్రాంతి పండుగ సందర్భంగా కడప జిల్లా పుల్లంపేట మండలం తిప్పాయపల్లె సంజీవరాయ ఆలయంలో పురుషులే పొంగళ్ళు పెట్టడం ప్రత్యేక ఆచారంగా తరతరాలుగా కొనసాగుతోందని ప్రజాశక్తి ఒక కథనాన్ని ప్రచురించింది.

సంక్రాంతి పండుగకు వచ్చే ముందు ఆదివారం ఆ గ్రామంలో పురుషులు మాత్రమే ఆలయంలో పొంగళ్లు పెట్టి, మహిళలకు పెట్టకుండా.. వారు చేసిన ప్రసాదాన్ని వారే తినేస్తారట. ఈ ఆలయంలోకి మహిళలు రావడం పూర్తిగా నిషేధం.

అయితే ఆలయ ప్రాంగణానికి వెలుపల నుంచే సంజీవరాయునికి మొక్కుకొని మహిళలు తిరుగు పయనమవుతుంటారు. అసలు సంజీవరాయునికి ప్రత్యేకించి ఆలయమంటూ లేదు. ఒక రాతిశిలపై ఉన్న లిపినే ఇక్కడ సంజీవరాయునిగా ప్రజలు కొలుస్తున్నారు. గ్రామంలో పంటలు బాగా పండకపోవడంతో ఓ బ్రాహ్మణుడు లిపితో ఇచ్చిన రాయిని ప్రతిష్టించి, సంజీవరాయునిగా కొలిచి పొంగళ్ల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

ఆ గ్రామానికి చెందిన ఉద్యోగస్తులు ఇతర రాష్ట్రాల్లో, ఇతర ప్రాంతాల్లో ఉన్నవారంతా అక్కడికి చేరుకుని తమ పూర్వీకుల నుంచి వస్తోన్న సంప్రదాయానికి అనుగుణంగా పొంగళ్లు పెట్టుకుంటున్నారు. ఆ ఊరి ప్రజలు సంక్రాంతి పండుగకన్నా.. ఈ సంజీవరాయుని పొంగళ్లు పెట్టుకోవడమే పెద్ద పండుగగా జరుపుకుంటారు. ఇక ఆ మండలం నుంచే కాకుండా.. చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా పురుషులు స్వామి వారిని దర్శించుకుని కొబ్బరి, బెల్లాన్ని కానుకలుగా సమర్పిస్తుంటారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Schools to reopen in Telangana,one student per bench
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X