• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కాంగ్రెస్-జేడీఎస్ మధ్య లోక్ సభ సీట్ల చిచ్చు: మేమేమైనా బిచ్చగాళ్లమా? కుమారస్వామి

|

బెంగళూరు: కర్ణాటకలో అధికారాన్ని పంచుకుంటున్న కాంగ్రెస్-జనతాదళ్ (ఎస్) కూటమి మధ్య విభేదాలు తలెత్తుతున్నాయి. పొరపచ్చాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు కుదరట్లేదు. ఇప్పుడిప్పుడే కుదిరేలా కూడా కనిపించట్లేదు. లోక్ సభ ఎన్నికల్లో ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి? ఏఏ స్థానాల్లో పార్టీ అభ్యర్థలను నిలబెట్టాలనే విషయం తేలేలా లేదు. 28 లోక్ సభ స్థానాలు ఉన్న కర్ణాటకలో 2014 నాటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తొమ్మిది చోట్ల, జనతాదళ్ (ఎస్) రెండు చోట్ల విజయం సాధించాయి. మిగిలిన 17 స్థానాలు బీజేపీ ఖాతాలో ఉన్నాయి. ఈ ట్రాక్ రికార్డును దగ్గర ఉంచుకుని, జేడీఎస్ కు అతి తక్కువ సీట్లను కేటాయించడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. జేడీఎస్ దీన్ని తోసిపుచ్చుతోంది.

లోక్ సభ స్థానాల కోసం కాంగ్రెస్ పార్టీని అడుక్కోవడానికి తామేమీ బిచ్చగాళ్లం కాదని జేడీఎస్ చీఫ్, ముఖ్యమంత్రి కుమారస్వామి స్వయంగా ప్రకటించడం పరిస్థితి తీవ్రతను చాటుతోంది. సీట్ల సర్దుబాటు వ్యవహారం విషయంలో కాంగ్రెస్ కూడా వెనక్కి తగ్గట్లేదు. దీనితో ఈ రెండు పార్టీల మధ్య ఉన్న పొత్తు డోలాయమానంలో పడింది. పరిస్థితి ఎక్కడిదాకానైనా వెళ్లవచ్చని తెలుస్తోంది. అధికారంలో ఉన్నప్పుడే పార్టీని బలోపేతం చేసుకోవాలని జేడీఎస్ ప్రయత్నిస్తుండగా.. జేడీఎస్ బలపడితే పక్కలో బల్లెంలా ఎక్కడ మారుతుందోననే భయం కాంగ్రెస్ లో కనిపిస్తోంది. దీనితో రెండు పార్టీల మధ్య సయోధ్య సాధ్యమయ్యేలా లేదు.

లోక్ సభ సీట్ల సర్దుబాటుపై కుమారస్వామి పార్టీ నాయకులతో భేటీ అయ్యారు. పార్టీకి గట్టిపట్టు మండ్య వంటి లోక్ సభ స్థానాలను కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను నిలబెట్టడానికి ప్రయత్నిస్తోందని ఈ సందర్భంగా వారు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

కుమారుడి కోసం కుమారస్వామి, సుమలత కోసం కాంగ్రెస్ పట్టు

కుమారుడి కోసం కుమారస్వామి, సుమలత కోసం కాంగ్రెస్ పట్టు

నిజానికి మండ్య లోక్ సభ స్థానం అటు కాంగ్రెస్, ఇటు జేడీఎస్ కు ప్రతిష్ఠాత్మకమైనదే. గత ఏడాది కన్నుమూసిన కన్నడ రెబల్ స్టార్ అంబరీష్ మండ్య లోక్ సభ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున మూడుసార్లు విజయం సాధించారు. మండ్య లోక్ సభ స్థానంపై బీజేపీ ఒక్కసారి కూడా జెండా పాతలేదు. కాంగ్రెస్ లేదా జనతాదళ్ మధ్యే చేతులు మారుతూ వచ్చింది. 1998, 1999, 2004లో అంబరీష్ ఈ స్థానం నుంచి గెలుపొందారు. మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో సహాయమంత్రిగా పనిచేశారు. 2009 ఎన్నికల్లో ఆయన ఆ స్థానాన్ని ఖాళీ చేశారు. అసెంబ్లీకి పోటీ చేసి విజయం సాధించారు. 2009 ఎన్నికల్లో ఈ స్థానాన్ని జేడీఎస్ కైవసం చేసుకుంది. 2013లో జరిగిన ఉప ఎన్నికల్లో ప్రముఖ నటి రమ్య కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలుపొందారు. అనంతరం 2014తో పాటు 2018 ఉప ఎన్నికలో జేడీఎస్ ఈ స్థానాన్ని నిలబెట్టుకుంది.

తాజాగా మండ్య లోక్ సభ స్థానంలో ఈ సారి అంబరీష్ భార్య, నటి సుమలత లేదా వారి కుమారుడు అభిషేక్ ను నిలబెట్టాలనేది కాంగ్రెస్ ప్రయత్నం. వారిద్దరిలో ఎవర్ని అభ్యర్థిగా ప్రకటించినా ఈ స్థానం కాంగ్రెస్ దే అవుతుంది. అదే సమయంలో జేడీఎస్ కూడా ఈ స్థానాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. తన కుమారుడు, `జాగ్వార్` ఫేమ్ హీరో నిఖిల్ గౌడను నిలబెట్టాలని కుమారస్వామి భావిస్తున్నారు. లోక్ సభ ఎన్నికల్లో తన కుమారుడి ఎంట్రీ ఇవ్వాలనేది ఆయన ఆలోచన. మండ్య స్థానాన్ని రెండు పార్టీలూ ప్రతిష్ఠగా తీసుకోవడంతో సర్దుబాటు కుదరట్లేదు.

ఇలాంటి స్థానాలు సుమారు 10 వరకు ఉన్నట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. హాసన్ లోక్ సభ స్థానం కూడా ఈ జాబితాలో ఉంది. ఈ సారి హాసన్ లో తన సోదరుడు రేవణ్ణ కుమారుడు ప్రజ్వల్ ను బరిలో దింపాలని కుమారస్వామి యోచిస్తున్నారు. ఈ స్థానాన్ని జేడీఎస్ కు ధారాదాత్తం చేయకూడదని కాంగ్రెస్ కూడా భావిస్తోంది. ఇక్కడా పీటముడి పడే అవకాశాలు లేకపోలేదు.

వీరప్ప మొయిలీ, మునియప్ప స్థానాలపైనా జేడీఎస్ కన్ను

వీరప్ప మొయిలీ, మునియప్ప స్థానాలపైనా జేడీఎస్ కన్ను

ఉత్తర కర్ణాటకతో పోల్చుకుంటే దక్ణిణ కర్ణాటక జిల్లాల్లో జేడీఎస్ కు మంచి పట్టు ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని సాధ్యమైనన్ని లోక్ సభ స్థానాలను దక్ణిణ కర్ణాటక నుంచే లాక్కోవాలనేది జేడీఎస్ వ్యూహం. కాంగ్రెస్ సీనియర్లు, కేంద్ర మాజీ మంత్రులు వీరప్పమొయిలీ, కెహెచ్ మునియప్ప ప్రాతినిథ్య వహిస్తున్న చిక్ బళ్లాపురా, కోలార్ లోక్ సభ స్థానాలను కూడా దక్కించుకోవాలని జేడీఎస్ కసరత్తు చేస్తోంది.

సీట్ల సర్దుబాటు ఎన్నిచోట్ల కుదురుతుందనేది తనకూ తెలియడం లేదని కుమారస్వామి వ్యాఖ్యానించడం రెండుపార్టీల మధ్య ఉన్న అయోమయాన్ని సూచిస్తోంది. `ఏడా, అయిదా, మూడా అనేది విషయంపై నాకూ స్పష్టత లేదు` అని ఆయన అన్నారు. తామేమీ బిచ్చగాళ్లం కాదని, అడుక్కోవాల్సిన దుస్థితి తమకు లేదని కుమారస్వామి తేటతెల్లం చేశారు. పొత్తు కుదుర్చుకునే సమయంలోనే లోక్ సభ సీట్ల సర్దుబాటు విషయం ఈ రెండు పార్టీల ముందుకు వచ్చింది. ఉన్న 28 స్థానాల్లో 12 సీట్లను తమకు బేషరతుగా ఇవ్వాల్సి ఉంటుందని మాజీ ప్రధాని, జేడీఎస్ సుప్రీమ్ దేవేగౌడకు కాంగ్రెస్ కు షరతు విధించారు. ఇప్పుడా షరతును కాంగ్రెస్ ఉల్లంఘిస్తోందని కుమారస్వామి ఆరోపిస్తున్నారు.

పక్కలో బల్లెం అవుతుందనేది కాంగ్రెస్ భయం

పక్కలో బల్లెం అవుతుందనేది కాంగ్రెస్ భయం

జేడీఎస్ కు అవకాశం ఇస్తే, రాజకీయంగా బలపడి మున్ముందు ప్రమాదకరంగా మారవచ్చనే భయం ఉండటం వల్ల కాంగ్రెస్ పార్టీ ఎప్పటికప్పుడు అడ్డుకుంటోంది. ఇందులో భాగంగానే లోక్ సభ సీట్ల వద్ద మోకాలడ్డుతోంది. కాంగ్రెస్ కు బలమైన ఓటుబ్యాంకుగా ఉన్న వక్కళిగ కులాన్ని తమవైపు తిప్పుకోవడానికి ఇప్పటికే జేడీఎస్ అనేక ప్రయత్నాలు చేసిందని, ఆ ఓటు బ్యాంకును కోల్పోతే పరిస్థితి దిగజారుతుందని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అడకత్తెర చిక్కుకున్నట్టయింది. ఒకవైపు జేడీఎస్ ను రాజకీయంగా ఎదగనీయకుండా చేయడం, మరోవైపు బీజేపీని ఎదుర్కోవాల్సి వస్తోంది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
BENGALURU: The Lok Sabha seat sharing agreement in Karnataka between the Janata Dal (Secular) and the Congress is not going to be a smooth affair, if the statements made by the top leadership of two parties is anything to go by. And this is the situation even before formal rounds of talks between the two parties is yet to commence. “I don’t know if it will be seven, five or three seats. But we JD(S) are not beggars," he said in Mysuru.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more