సెన్సెక్స్ ఢమాల్...స్టాక్ మార్కెట్లను వెంటాడుతున్న భయాలు ఏంటి..?
ముంబై: స్టాక్ మార్కెట్లు మరోసారి కుప్పకూలాయి. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) అధికారికంగా విడుదలవడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంటు బలహీనపడింది. భారత వృద్ధి రేటు 5శాతానికి పడిపోవడంతో ఇన్వెస్టర్లు డీలా పడ్డారు. ప్రారంభం నుంచే పతనం దిశగా సాగిన మార్కెట్లు ఏ క్షణంలోనూ పుంజుకోలేదు. మంగళవారం మధ్యాహ్నం వరకు ఈ పతనం కొనసాగింది. మధ్యాహ్నం 3గంటల 20 నిమిషాలకు సెన్సెక్స్ 810 పాయింట్లు నష్టపోయి 36,522.18 పాయింట్ల వద్ద ట్రేడ్ అయ్యింది. అదే సమయంలో నిఫ్టీ 237.25 పాయింట్లు నష్టపోయి 10,780 పాయింట్ల వద్ద నిలిచింది.
అటాకింగ్‌లో నెంబర్ వన్: అపాచీ ఏహెచ్ హెలికాఫ్టర్ విశిష్టతలు ఏంటి..?

జీడీపీ ఎఫెక్టే స్టాక్ మార్కెట్ల పతనానికి కారణమా..?
మార్కెట్లు ఈ స్థాయిలో బలహీన పడ్డాయంటే ఇందుకు కారణం కచ్చితంగా జీడీపీ డేటానే అని నిపుణులు చెబుతున్నారు. గత ఆరేళ్లలో ఎప్పుడూ లేనంతగా జీడీపీ 5శాతానికి చేరుకోవడం మార్కెట్లను ఇన్వెస్టర్లను ఆందోళనకర పరిస్థితిలోకి నెట్టివేయడం జరిగింది. ఆర్థిక వ్యవస్థ పుంజుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నప్పటికీ జీడీపీలో వృద్ధి కనిపించకపోవడం కలవరపెడుతోంది. దీంతో దేశీయ, మరియు విదేశీ పెట్టుబడిదారుల్లో నెగిటివ్ సంకేతాలు వెళుతున్నాయి. పెట్టుబడులకు ఊతం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలాని చాలా మంది ఆర్థికవేత్తలు ప్రభుత్వంకు సూచించారు. పతనం దిశగా సాగుతున్న ఆర్థిక వ్యవస్థ పుంజుకోవాలంటే ఇదొక్కటే మార్గమని వారు చెబుతున్నారు.

ప్రధాన రంగంలో క్షీణించిన వృద్ధి రేటు
ఇక మార్కెట్లు బలహీన పడ్డాయంటే అందుకు మరో కారణం ప్రధాన పరిశ్రమలు లేదా ప్రధాన రంగాల్లో వృద్ధి లేకపోవడం. ఎనిమిది ప్రధాన రంగాలకు సంబంధించి వృద్ధి రేటు 2.1శాతంకు పడిపోవడంతో ఆ ప్రభావం షేర్ మార్కెట్లపై స్పష్టంగా కనిపించింది. ఇక రూపాయి విలువ కూడా పడిపోవడం మార్కెట్ సెంటిమెంటును దెబ్బతీసిందని నిపుణులు చెబుతున్నారు. డాలరకు రూపాయి విలువ 72గా ఉండటం కూడా మార్కెట్లకు కలిసి రాలేదని నిపుణులు చెబుతున్నారు. ఇక ఆర్థిక వ్యవస్థ క్రమంగా తగ్గిపోతుండటంతో విదేశీ స్వదేశీ పెట్టుబడులదారులు తమ పెట్టుబడులను ఈక్విటీ మార్కెట్‌నుంచి దాదాపు రూ. 5,500 కోట్లు ఉపసంహరించుకోవడం జరిగింది. ఇక జూలై నెలలో విదేశీ మదుపరులు భారత ఈక్విటీ మార్కెట్ల నుంచి రూ. 3వేల కోట్లు మేరా ఉపసంహరించుకున్నారు.

పతనం దిశగా ఆటో మొబైల్ బ్యాంకింగ్ రంగాలు
చివరిగా మార్కెట్ల పతనానికి కారణంగా ఆటో రంగం మరియు బ్యాంకింగ్ రంగాలు కూడా నిలిచాయి. గత 10 నెలల్లో ఎన్నడూ లేనంతగా ఆటోమొబైల్ రంగంలో సేల్స్ పడిపోగా.. ఆటోరంగం పరిస్థితి ప్రమాదపుటంచుల్లో ఉందని చెప్పాలి. ఆగష్టు నెలలో ఆటోమొబైల్ రంగానికి సంబంధించిన సేల్స్ దారుణంగాపడిపోయాయి. టాటా మోటార్స్, మారుతీ సుజుకీ, ఈచర్ మోటార్స్, మహీంద్ర & మహీంద్ర, అశోక్ లేలాండ్ల సేల్స్ పరిస్థితి డేంజర్ మార్క్‌ను తాకింది. ఇదిలా ఉంటే బ్యాంకులను విలీనం చేస్తున్నట్లు కేంద్ర ఆర్థికశామంత్రి ప్రకటించగానే పంజాబ్ నేషనల్ బ్యాంకు, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, కెనరా బ్యాంకుల షేర్లు దారుణంగా పడిపోయాయి.