విషాదం: హిమపాతంలో చిక్కుకున్న ఏడుగురు సైనికులు మృతి
న్యూఢిల్లీ: అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలో హిమపాతంలో కూరుకుపోయిన ఏడుగురు సైనికుల ఘటన విషాదాంతమైంది. ఫిబ్రవరి 6న అరుణాచల్ ప్రదేశ్‌లోని కమెంగ్ సెక్టార్‌లోని ఎత్తైన ప్రాంతంలో హిమపాతం సంభవించి ఏడుగురు ఆర్మీ సిబ్బంది మరణించినట్లు నిర్ధారించారు.
భారత సైన్యం తెలిపిన వివరాల ప్రకారం.. హిమపాతం జరిగిన ప్రదేశం నుంచి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఆర్మీ సెర్చ్ అండ్ రెస్క్యూ టీమ్‌లను ప్రదేశానికి రప్పించింది.

గత కొన్ని రోజులుగా భారీ మంచు కురుస్తున్న నేపథ్యంలో ఈ ప్రాంతంలో ప్రతికూల వాతావరణం నెలకొందని ఆర్మీ ఒక ప్రకటనలో తెలిపింది. చుమే గ్యతేర్ ప్రాంతం తవాంగ్ జిల్లా ప్రధాన కార్యాలయం నుంచి 100 కి.మీ దూరంలో ఉంది.
ఏడుగురు సైనికులు 19వ జమ్మూ & కాశ్మీర్ రైఫిల్స్, భారత సైన్యంలోని పదాతిదళ రెజిమెంట్‌కు చెందినవారు. మరోవైపు ఏడుగురు సైనికుల మృతి పట్ల పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంతాపం తెలిపారు.
అరుణాచల్ ప్రదేశ్‌లో మంచు తుఫానులో విధి నిర్వహణలో ఉన్న మన 7 మంది వీర జవాన్లు దురదృష్టవశాత్తు మరణించడం గురించి తెలిసి చాలా బాధపడ్డాను. మన జవాన్లు నిస్వార్థంగా మన భద్రత కోసం ప్రయత్నిస్తున్నారు. జవాన్లకు, వారి కుటుంబం, సహచరులు నా వందనం. నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను' అని మమత అన్నారు.