షారుక్ కు శివసేన చురక : చెంపదెబ్బ కొట్టే ఛాన్స్ మిస్
ముంబై : అమెరికా అధికారుల చేతిలో అవమానం ఎదురైన వెంటనే.. షారుక్ తిరిగి ఇండియాకు వచ్చేసి ఉంటే అమెరికాను చెంపదెబ్బ కొట్టినట్లుగా ఉండేదని అభిప్రాయపడింది శివసేన. అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారుల దుశ్చర్యను తిప్పికొట్టడంలో షారుక్ విఫలమయ్యాడన్న తరహాలో పార్టీ అధికార పత్రికయిన సామ్నాలో శివసేన పేర్కొంది.
గత ఏడేళ్లలో మూడుసార్లు అమెరికాలో నిర్బంధానికి గురైన షారుక్.. వాళ్లు అవమానిస్తున్నారని తెలిసినా అగ్రరాజ్యానికి వెళ్లడం మాత్రం మానలేకపోతున్నారని విమర్శించింది. 'ఇదో సాధారణ విషయంగా మారిందని, ఇలా చేస్తే.. అమెరికాలో మరోసారి అడుగుపెట్టనని అమెరికాను గనుక హెచ్చరించి షారుక్ స్వదేశానికి వచ్చేసుంటే.. అమెరికా మొహం మీద చెంపదెబ్బ కొట్టినట్లుగా ఉండేదని' శివసేన తన పత్రికలో చెప్పుకొచ్చింది.
ప్రతీ ముస్లింను అమెరికా అనుమానస్పద దృష్టితో చూడడాన్ని తప్పుబట్టిన శివసేన.. కశ్మీర్ యువత తప్పుదోవ పట్టకుండా చూడాల్సిన బాధ్యతను షారుక్ తీసుకోవాలని సూచించింది.