వ్యవసాయ బిల్లుకు నిరసనగా ... సస్పెండ్ అయిన ఎంపీలకు మద్దతుగా.. శరద్ పవార్ నిరాహార దీక్ష
రాజ్యసభలో ప్రతిపక్ష పార్టీల ఎంపీలు ప్రవర్తించిన తీరుతో మనస్థాపానికి గురి అయ్యామని డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నిరాహార దీక్షకు దిగడంతో జాతీయ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. అయితే ఎనిమిది మంది ఎంపీల పై విధించిన సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ విపక్ష పార్టీలు సమావేశాలను బహిష్కరించాయి. తాజాగా ఎన్సీపీ అధినేత ,ఎంపీ శరద్ పవార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా , సస్పెండ్ అయిన ఎంపీలకు మద్దతుగా శరద్ పవార్ నిరాహార దీక్ష
సస్పెండ్ అయిన ప్రతిపక్ష ఎంపీలకు మద్దతుగా మహారాష్ట్ర నాయకుడు, ఎన్సిపి చీఫ్ శరద్ పవార్ నేడు నిరాహార దీక్ష చేస్తున్నట్లుగా ప్రకటించారు. కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులపై నిరసన తెలియజేయటంతో పాటు , 8మంది ఎంపీలను సస్పెండ్ చేసిన నేపథ్యంలో పార్లమెంటు ఆవరణలో నిరసన తెలుపుతున్న సభ్యులకు సంఘీభావంగా తాను ఒక రోజు నిరాహార దీక్ష చేస్తున్నట్లుగా ప్రకటించారు.
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ నిరాహార దీక్ష ప్రకటించిన కాసేపటికే శరద్ పవార్ నిర్ణయం
ఎనిమిది మంది ఎంపీలపై సస్పెన్షన్ రద్దు చేయకపోతే రాజ్యసభ సమావేశాలను బహిష్కరించాలని కాంగ్రెస్ మరియు ఇతర ప్రతిపక్ష పార్టీలు నిర్ణయించిన తరువాత, ఎన్సీపీ అధినేత తన నిర్ణయాన్ని ప్రకటించారు.రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ ఎంపీలు ప్రవర్తనతో తాను తీవ్ర వేదనకు గురయ్యామని, అనుచితంగా ప్రవర్తించారని నేడు నిరాహారదీక్ష చేస్తున్నట్లుగా ప్రకటించగా, ఆ ఎంపీలకు మద్దతుగా తాను ఒక రోజు నిరాహార దీక్ష చేస్తున్నట్లుగా శరద్ పవార్ ప్రకటించారు.

సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రతిపక్షాల డిమాండ్ ..
రాజ్యసభ నుంచి సస్పెన్షన్ కు గురైన ఎంపీలకు మద్దతుగా రంగంలోకి దిగిన శరద్ పవార్ తీసుకున్న నిర్ణయంతో నూతన వ్యవసాయ బిల్లులపై కొనసాగుతున్న రగడ మరింత పెరిగినట్లుగా కనిపిస్తోంది. ఎనిమిది మంది ఎంపీలు సభా నియమాలను ఉల్లంఘించి ,డిప్యూటీ చైర్మన్ ను బెదిరింపులకు పాల్పడ్డారని, సభను అవమానించారని వారిపై సస్పెన్షన్ ఎత్తివేసే ఆలోచన లేదని ఛైర్మన్ వెంకయ్య నాయుడు ఇప్పటికే స్పష్టం చేశారు. డిప్యూటీ చైర్మన్ హరివంశ్ పై అవిశ్వాస తీర్మానం కోసం ఇచ్చిన నోటీసును కూడా చైర్మన్ వెంకయ్యనాయుడు తిరస్కరించారు.
వ్యవసాయ బిల్లులపై పార్లమెంట్ లో రగడ ..
కాంగ్రెస్ పార్టీ ఎంపీలు రాజీవ్ సాతావ్, సయ్యద్ నాసిర్ హుస్సేన్ , రిపున్ బోరా , టీఎంసీ ఎంపీలు డోలా సేన్ , ఓబ్రియన్, సీపీఎం ఎంపీలు కెకె రాగేష్, ఎలమారామ్ కరీన్ తో పాటు సింగ్ లను సస్పెండ్ చెయ్యగా వారు రాత్రంతా పార్లమెంట్ ఆవరణలోనే తమ నిరసన తెలియజేస్తూ గడిపారు. వారికి ప్రతిపక్ష రాజకీయ పార్టీల నుండి మద్దతు లభించింది . దీంతో తాజా పరిణామాల నేపథ్యంలో కొత్త వ్యవసాయ బిల్లుల రగడ ఎంత దాకా వెళుతుందో అన్న ఆసక్తికర చర్చ జరుగుతోంది.