We Miss U Shinzo:భారత్ జపాన్ బంధంలో కీలకంగా షింజో..చైనాకు వ్యతిరేకంగా..ఇండియాకు అండగా..!
జపాన్ ప్రధాని షింజో అబే తాను తప్పుకుంటున్నట్లు చెప్పి శుక్రవారం రోజున రాజీనామా చేశారు. ఆరోగ్యం సహకరించకపోవడంతో 65 ఏళ్ల షింజో అబే ఈ నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఏడాది సెప్టెంబర్ వరకు ఆయన పదవీకాలం ఉన్నప్పటికీ అనారోగ్యకారణంగా ఒక ఏడాది ముందే షింజో అబే రాజీనామా చేశారు. అయితే షింజో అబే భారత్‌తో ఎలాంటి సంబంధాలు నడిపారు..? భారత్ అంటే ఎందుకు అంత గౌరవం ఇస్తారు..? షింజో అబే సహకారం భారత్‌కు ఎలా ఉపయోగపడింది..?

భారత్‌తో షింజోకు మంచి సంబంధాలు
షింజో అబేది రాజకీయ కుటుంబం. తన తాత జపాన్ ప్రధానిగా పనిచేశారు. తండ్రి షింతారో అబే విదేశాంగ శాఖ మంత్రిగా చేశారు. ఇప్పటివరకు జపాన్ చరిత్రలో అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసిన రికార్డు షింజో అబే సొంతం చేసుకున్నారు. 2006లో తొలిసారిగా ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన షింజో అబే..2007లో అనారోగ్యంతో రాజీనామా చేశారు. తిరిగి 2012లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఇక షింజో అబేకు భారత్‌తో మంచి సంబంధాలు ఉన్నాయి. 2006-07లో తొలిసారిగా భారత పర్యటనకు వచ్చిన సమయంలో పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించారు. ఇక రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చెప్పటినప్పుడు జనవరి 2014, డిసెంబర్ 2015, సెప్టెంబర్ 2017 సంవత్సరాలకు మొత్తం కలిపి మూడుసార్లు భారత్‌లో పర్యటించారు. ఒక జపాన్ ప్రధాని భారత్‌లో ఇన్నిసార్లు పర్యటించడం ఇదే తొలిసారి.

మోడీ జపాన్ పర్యటన సందర్భంగా...
2014లో దేశ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ముఖ్య అతిథిగా షింజో అబే పాల్గొన్నారు. ఆసమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నింది. ఇక భారత్ జపాన్ల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలపడేందుకు, రెండు దేశాల మధ్య పనులు వేగవంతం అయ్యేందుకు షింజో అబే ప్రత్యేక చొరవచూపారు. 2007 ఆగష్టులో తొలిసారిగా ప్రధాని హోదాలో భారత్‌కు వచ్చిన సమయంలో ఇండో పసిఫిక్ కాన్సెప్ట్‌కు శంకుస్థాపన చేశారు. భారత్-జపాన్ బంధం బలోపేతంకు ఈ అంశం దోహదపడింది. రెండో సారి భారత పర్యటనకు వచ్చినప్పుడు బంధం మరింత బలపడేందుకు ఆయన కృషి చేశారు. ఇక గుజరాత్ సీఎం హోదాలో మోడీ పలుమార్లు జపాన్‌లో పర్యటించారు. ఇక అధికారంలోకి వచ్చాక తొలి విదేశీ పర్యటన చేసింది జపాన్ దేశంలోనే. ఆ సమయంలో మోడీ, షింజో అబేలు కలిసి ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత మెరుగుపడేందుకు చర్యలు తీసుకున్నారు. అణుశక్తి నుంచి తీరప్రాంతాల గస్తీ, బుల్లెట్ ట్రైన్స్, మరియు నాణ్యమైన మౌలిక సదుపాయాల వరకు ఒప్పందాలు ఇరు దేశాల మధ్య జరిగాయి. వ్యూహాత్మక ఇండో పసిఫిక్ కు యాక్ట్ ఈస్ట్ పాలసీని జోడించడం జరిగింది.

అణు ఒప్పందంలో కీలకంగా వ్యవహరించిన షింజో
2014లో భారత ప్రధాని మోడీ జపాన్‌లో పర్యటించినప్పుడు రెండు దేశాల మధ్య అణు ఒప్పందం జరగాల్సి ఉండగా కొన్ని కారణాలతో అది నిలిచిపోయింది. అయితే షింజో అబే తన చాణక్యతను ప్రదర్శించి ఎదురైన అడ్డంకులను అధిగమించి 2016లో ఒప్పందం జరిగేలా చర్యలు తీసుకున్నారు. భారత్ జపాన్‌లు చేసుకున్న ఈ ఒప్పందం అమెరికా మరియు ఫ్రెంచ్ అణు సంస్థలకు కీలకంగా మారాయి. ఎందుకంటే ఆ కంపెనీల్లో మెజార్టీ వాటాలు జపాన్ సంస్థలకు కలిగి ఉన్నాయి. ఇక ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా దూకుడు ఎక్కువ అవుతుండటంతో ముప్పు వాటిల్లే అవకాశం ఉందని భావించిన షింజో అబే చర్యలకు దిగారు. ఇండో పసిఫిక్ సముద్ర ప్రాంతంలో భద్రతను పటిష్టం చేయాలని భావించారు. అనుకున్నట్లే 2017 నవంబర్‌లో ఆ కార్యక్రమాన్ని పూర్తి చేశారు.

భారత్ చైనా మధ్య ఘర్షణ:
2013 నుంచి భారత్ చైనా మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడినప్పుడల్లా... జపాన్ భారత్‌కు అండగా నిలవడంలో షింజో అబే పాత్ర ఎంతో ఉంది. డొక్లామ్ ఘటన సమయంలో అయితేనేమీ, ప్రస్తుతం భారత్ చైనాల మధ్య నడుస్తున్న వివాదంలో కూడా చైనా స్టేటస్ కో మెయిన్‌టెయిన్ చేయాలని చెబుతూ షింజో అబే భారత్‌కు మద్దతుగా నిలిచారు. ఇక మౌళిక సదుపాయాల పరంగా కూడా భారత్‌కు జపాన్ సహకారం అందించింది. 2015లో షింజో అబే భారత్‌లో పర్యటించినప్పుడు బుల్లెట్ ట్రైయిన్లను భారత్‌కు పరిచయం చేయాలన్న భావించారు. ఇది 2022 కల్లా ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది. ఇక యాక్ట్ ఈస్ట్ ఫోరంను రెండు దేశాలు సంయుక్తంగా ఏర్పాటు చేసి ఈశాన్య భారతంలో పలు ప్రాజెక్టులకు ఆమోదం తెలిపాయి. దీన్ని చైనా నిశితంగా పరిశీలిస్తోంది. అంతేకాదు రెండు దేశాలు మాల్దీవులు శ్రీలంకలో కలిసి ప్రాజెక్టులు పూర్తి చేయాలని నిర్ణయించాయి. చైనా ప్రభావం ఎక్కడా కనిపించకుండా చేయాలని భారత్ జపాన్‌లు కలిసి పనిచేస్తున్నాయి.

షింజోను మిస్ అవుతున్న భారత్
భారత్‌కు షింజో అబే ఒక చిరకాల మిత్రుడిగా ఉన్నాడు. అంతేకాదు జీ-7 నేతగా భారత్‌కు అండగా నిలిచారు. వ్యూహాత్మక భాగస్వామ్యాల్లో, ఆర్థిక పరమైన అంశాల్లో, రాజకీయ పరమైన అంశాల్లో భారత్‌కు షింజో అబే అండగా ఉన్నారు. భారత అభివృద్ధిలో జపాన్ భాగస్వామ్యం కూడా ఉందంటే అది షింజో అబే చొరవతోనే అని అంతర్జాతీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటి వరకు ఏ దేశ ప్రధానికి లేదా అధ్యక్షుడికి దొరకని గౌరవం జపాన్‌లో ప్రధాని మోడీకి దక్కింది. జపాన్‌లోని యమనాషిలోని షింజో అబే ముత్తాతల కాలంనాటి నివాసంలో మోడీకి విందు ఏర్పాటు చేసి గౌరవించారు. అబేకు కూడా అహ్మదాబాదులో అంతే ఘనంగా మోడీ స్వాగతం పలికారు. గతేడాది డిసెంబరులో గౌహతికి షింజో అబే రావాల్సి ఉండగా అప్పటి స్థానిక సమస్యలతో పర్యటన రద్దు కావడం జరిగింది. ఇక షింజో అబే వారసుడు ఎవరా అని భారత్ ఎదురు చూస్తోంది. షింజో అబే స్థానంను భర్తీ చేయగలరా అని భారత్ చూస్తోంది...