ఎన్డీఏకు శివసేన రాం రాం..? శీతకాల సమావేశాలకు దూరం.., ఎందుకంటే..
ఎన్డీఏ మిత్రపక్షం శివసేన కూటమి నుంచి వైదొలిగినట్టే అనిపిస్తోంది. మహారాష్ట్రలో సీఎం పీటం నెలకొన్న ఉత్కంఠతో బీజేపీతో దూరంగా ఉంటోంది. సోమవారం నుంచి పార్లమెంట్ శీతకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆదివారం ఢిల్లీలో ఎన్డీఏ పక్షాలు సమావేశం కాబోతున్నాయి. ఆ సమావేశానికి తాము హాజరుకాబోమని శివసేన తేల్చిచెప్పింది.

దూరం.. దూరం...
ఆదివారం జరిగే సమావేశానికి హాజరుకాబోమని ఆ పార్టీ నేత సంజయ్ రౌత్ తెలిపారు. మహారాష్ట్రలో జరిగిన పరిణామాల తర్వాత కూడా తాము ఎన్డీఏతో ఎలా ఉంటామని మీడియా ప్రతినిధులను ప్రశ్నించారు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా పార్టీ అధినేత ఉద్దవ్ థాకరేతో సమావేశమయ్యాక మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తాము ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేసినట్టేనని పేర్కొన్నారు. కానీ దానిని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది అని రౌత్ క్లారిటీ ఇచ్చారు.

థాకరేనే సీఎం..
మహారాష్ట్రలో థాకరే సీఎం పదవీ చేపట్టాలని శివసేన భావిస్తోందని రౌత్ ఉద్గాటించారు. అందుకోసమే తాము ఎన్డీఏ కూటమి నుంచి బయటకొచ్చామని స్పష్టంచేశారు. తమతో కలిసి పనిచేసేందుకు ముందుకొచ్చిన ఎన్సీపీ- కాంగ్రెస్ పార్టీతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్పారు. కనీస ఉమ్మడి ప్రణాళికపై ఇప్పటికే స్పష్టత వచ్చిందని చెప్పారు.

పవార్ గ్రీన్‌సిగ్నల్
మరోవైపు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కూడా మహారాష్ట్రలో తమ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడబోతుందని స్పష్టంచేశారు. శివసేనతో కలిసి కాంగ్రెస్, కూటమి జట్టుకట్టబోతున్నాయని వివరించారు. త్వరలోనే సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడి.. ఐదేళ్లు పాలిస్తోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ప్రతిష్టంభన
మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు 145 సభ్యుల మద్దతు తప్పనిసరి. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన బీజేపీ అధికారానికి 40 సీట్ల దూరంలో నిలిచిపోయింది. దీంతో తమ భాగస్వామ్య పక్షం శివసేన 50-50 ఫార్ములాను తెరపైకి తీసుకొచ్చింది. ఇందుకు బీజేపీ అంగీకరించకపోవడంతో ప్రభుత్వం ఏర్పాటు ప్రక్రియ ఆలస్యమైంది. ఈ లోపు గవర్నర్ శివసేన, ఎన్సీపీలకు కూడా అవకాశం ఇచ్చారు.

రాష్ట్రపతి పాలన
నిర్దేశిత సమయంలో మెజార్టీ నిరూపించుకోవడంలో విఫలమవడంతో రాష్ట్రపతి పాలనకు గవర్నర్ కోషియారి సిఫారసు చేశారు. మంగళవారం నుంచి రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది. ఈ క్రమంలో శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీ కనీస ఉమ్మడి ప్రణాళికతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెబుతోంది. త్వరలోనే సర్కార్ కొలువుదీరుతుందని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!