కేంద్రానికి ఢిల్లీ సర్కార్ షాక్ .. ఢిల్లీలో తాత్కాలిక జైళ్ళకు నో .. రైతుల డిమాండ్స్ న్యాయబద్ధమే
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న రైతులకు మద్దతు ప్రకటిస్తున్న ఢిల్లీ సర్కార్ ఆ దిశగా నిర్ణయం తీసుకుంది. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఢిల్లీకి చలో ఢిల్లీ పేరుతో లాంగ్ మార్చ్ నిర్వహిస్తున్న క్రమంలో రైతుల నిరసనలు మిన్నంటుతున్నాయి. దీంతో దేశ రాజధానిలోని స్టేడియంలను తాత్కాలిక జైళ్లుగా మార్చాలని ఢిల్లీ పోలీసులు ఢిల్లీ ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. అయితే అభ్యర్ధనను తిరస్కరిస్తూ ఢిల్లీ సర్కారు నిర్ణయం తీసుకుంది.
రైతులు నేరస్థులు, ఉగ్రవాదులు కాదు ... ఢిల్లీ పోలీసుల తాత్కాలిక జైళ్ళ అభ్యర్ధనపై ఆప్ ఎమ్మెల్యేలు ఫైర్

ఢిల్లీ పోలీసుల విజ్ఞప్తిని తిరస్కరించిన ఢిల్లీ సర్కార్
రాష్ట్రంలోని 9 స్టేడియంలను తాత్కాలిక జైళ్లుగా మార్చడానికి అనుమతి కోరుతూ పోలీసులు చేసిన విజ్ఞప్తిని ఖండిస్తూ ఢిల్లీ ప్రభుత్వం, రైతుల డిమాండ్లు న్యాయబద్ధమైనవని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం వీలైనంత త్వరగా రైతుల న్యాయబద్ధమైన డిమాండ్లను పరిష్కరించాలని, వాటిని నెరవేర్చాలని ప్రకటన విడుదల చేసింది. నిరసన తెలియజేస్తున్న రైతులను జైళ్లలో పెట్టడం పరిష్కారం కాదని ఢిల్లీ ప్రభుత్వం పేర్కొంది. వారు శాంతియుతంగా నిరసన తెలుపుతున్నారన్న ఢిల్లీ ప్రభుత్వం ప్రతి భారతీయుడికి శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ఉందని తన ప్రకటనలో తెలిపింది.

నిరసన తెలిపినందుకు జైలుకు పంపలేరు .. అందుకే తాత్కాలిక జైళ్లకు నో
కేవలం నిరసన తెలిపినందుకు వారిని జైలుకు పంపలేరు. అది చట్టవిరుద్ధమని, అందువల్ల స్టేడియంలను తాత్కాలిక జైళ్లుగా మార్చాలన్న ఢిల్లీ పోలీసుల అభ్యర్థనను ఢిల్లీ ప్రభుత్వం తిరస్కరించింది.
అంతకుముందే ఆర్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న రైతులకు తన మద్దతు తెలిపారు. రైతులపై వాటర్ క్యానన్ లను ప్రయోగించి వారి ఆందోళనను అణచివేయటాన్ని ఆయన వ్యతిరేకించారు. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు రైతులు నేరస్తులు, ఉగ్రవాదులు కాదని వారికోసం తాత్కాలిక జైళ్ళను ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.

రైతుల పోరాటానికి మద్దతుగా .. కేంద్రానికి ఢిల్లీ సర్కార్ షాక్ ..
ఢిల్లీ ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. మొదటి నుంచి కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్న ఢిల్లీ ప్రభుత్వం, ప్రస్తుతం రైతుల పోరాటానికి మద్దతుగా నిలిచింది. పంజాబ్, హర్యానా తదితర రాష్ట్రాల నుండి భారీ ఎత్తున రైతులు చలో ఢిల్లీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడంతో ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. నిరసన కారులను కంట్రోల్ చేయడానికి హర్యానా, పంజాబ్ రాష్ట్రాలలో పోలీసులు హింసాత్మక ఘటనలకు దిగుతున్నారు.

ఢిల్లీ బోర్డర్ కు భారీగా చేరుకుంటున్న రైతులు ... రాజధాని ఢిల్లీ లో ఉద్రిక్త వాతావరణం
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆమోదించిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా వేలాది మంది రైతులు తమ ఢిల్లీ ఛలో లో భాగంగా నేడు కూడా ఢిల్లీ సరిహద్దుకు చేరుకున్నారు. అక్కడ వారిని అడ్డుకునే క్రమంలో టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగిస్తున్నారు . భారీ బారికేడింగ్ ఏర్పాటు చేశారు . సంయుక్త్ కిసాన్ మోర్చా మరియు అఖిల భారత కిసాన్ సంఘర్ష్ సమన్వయ కమిటీ ఈ నిరసనలకు నాయకత్వం వహిస్తున్నాయి . వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేసే వరకు రైతులు తిరిగి రారని పేర్కొన్నారు. ఈ రోజు సాయంత్రం నాటికి 50,000 మందికి పైగా రైతులు చేరుకుంటారని భావిస్తున్నారు. రైతులు, ఎక్కువగా పంజాబ్ మరియు హర్యానాకు చెందినవారు. పెద్ద సంఖ్యలో ఢిల్లీ బోర్డర్ వద్ద రైతులు నిరసనలకు శ్రీకారం చుట్టినా ఢిల్లీ సర్కార్ తీసుకున్న తాజా నిర్ణయంతో రైతుల నిరసన ఏ మలుపు తీసుకుంటుందో వేచి చూడాలి.