
కాంగ్రెస్ కు షాక్: బెంగాల్ ఉప ఎన్నికల వేళ కీలక నేత రాజీనామా; టీఎంసీలో చేరిక ముహూర్తం ఫిక్స్ !!
పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. సిఎం మమతా బెనర్జీ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో బలపడుతోంది. పశ్చిమ బెంగాల్లో, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే, ఏఐసిసి కార్యదర్శి మైనుల్ హక్ మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. మాజీ ఎమ్మెల్యే మైనుల్ హక్ సెప్టెంబర్ 23 న తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.
ఏఐసిసి సెక్రటరీ మైనుల్ హక్ రాజీనామా
పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో మూడు స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్న సమయంలో రాష్ట్ర రాజకీయాలలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మొన్నటికి మొన్న బిజెపి ఎంపీ బాబుల్ సుప్రియో భారతీయ జనతా పార్టీకి గుడ్ బై చెప్పి తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఇక తాజాగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఏఐసిసి సెక్రటరీ మైనుల్ హక్ కూడా కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా పనిచేసిన నేత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం పెద్ద షాక్ అని చెప్పాలి.

సెప్టెంబర్ 23 న తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరిక ముహూర్తం ఫిక్స్
కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మరియు ఏఐసిసి కార్యదర్శి మైనుల్ హక్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన సెప్టెంబర్ 23 న తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని విశ్వసనీయ సమాచారం .ఆయన ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ సోనియా గాంధీకి తన రాజీనామా లేఖ పంపించారు . ఏఐసీసీ సెక్రటరీ పదవికి తాను రాజీనామా చేస్తున్నట్లుగా రాజీనామా లేఖలో పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తనకు అత్యంత ప్రతిష్ఠాత్మకమైన పదవిని ఇచ్చి గౌరవించారని, కాంగ్రెస్ పార్టీలో అనేక కీలక పదవులను తాను నిర్వర్తించానని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా
1996 నుండి 2016 వరకు వరుసగా ఐదు సార్లు తాను ఫరక్కా నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా గెలుపొంది, నియోజకవర్గానికి సేవలందించానని మైనుల్ హక్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. మూడు అసెంబ్లీ స్థానాలకు పశ్చిమ బెంగాల్ లో ఉప ఎన్నికలు జరుగుతున్న తరుణంలో బిజెపి నుండి, కాంగ్రెస్ నుండి తృణమూల్ కాంగ్రెస్ వైపు నేతలు వలస బాట పడుతున్నారు.
Former Congress MLA and AICC Secretary Mainul Haque resigns from his post. He will join Trinamool Congress (TMC) on September 23. pic.twitter.com/YWc7KmJohg
— ANI (@ANI) September 21, 2021
మమతా బెనర్జీ ప్రధాని రేసులో .. టీఎంసీలో చేరిన నేత బాబుల్ సుప్రియో
ఇదిలా ఉంటే 2024 ఎన్నికల్లో ప్రధానమంత్రి పదవికి పోటీ పడే అభ్యర్థుల జాబితాలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ముందున్నారని ఇటీవల బీజేపీ నుంచి టీఎంసీలో చేరిన నేత బాబుల్ సుప్రియో వెల్లడించారు. మా పార్టీ కెప్టెన్ మమతా బెనర్జీ ప్రధాని కావాలని కోరుకుంటున్నానని పేర్కొన్న ఆయన ప్రధాని నరేంద్ర మోడీని ఎదుర్కోవడంలో కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ విఫలమవుతున్నారని ఈ క్రమంలోనే ప్రధాని రేసులో మమతా బెనర్జీ ముందువరుసలో ఉన్నారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ కీలక నేత టీఎంసీ తీర్ధం .. ఎన్నికల వేళ పార్టీలో జోష్
గత అసెంబ్లీ ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో హోరాహోరీగా పోరాడి గెలిచిన తరువాత, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన అనేక మంది కీలక నాయకులు ఆ పార్టీలకు రాజీనామా చేసి తృణమూల్ కాంగ్రెస్ బాట పట్టారు. గతంలో, మాజీ కేంద్ర మంత్రి మరియు అసన్సోల్ నుండి బిజెపి లోక్ సభ ఎంపీ, బాబుల్ సుప్రియో శనివారం పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) లో చేరారు. తృణముల్ కాంగ్రెస్ ఎంపీలు అభిషేక్ బెనర్జీ మరియు డెరెక్ ఓబ్రెయిన్ బాబుల్ సుప్రియోను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఇక ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కీలక నేత టీఎంసీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి చేరికలతో మమతా బెనర్జీ పార్టీలో జోష్ కనిపిస్తోంది.