వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహిళలు చేసే ఇంటి పనికి ఆర్థిక విలువ ఉండాలా... సుప్రీం కోర్టు వ్యాఖ్యపై వారేమంటున్నారు?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
కళ్యాణి ముక్తేవి

"మా అమ్మగారు ఊర్లో తెలిసిన వారి ఇంటికి వెళ్లి డబ్బులిచ్చి వెన్న కొనుక్కుని రమ్మనగానే, నేను ఆశ్చర్యపోయి, అదేమిటమ్మా? మన ఇంట్లో కూడా పాడి ఉంది కదా. కొనుక్కుని రావడం ఎందుకని అడిగాను. దానికి మా అమ్మ, 'ఆమెకి ఇంట్లో ఎవరూ డబ్బులివ్వరు. ఆమె చేసే ఇంటి పనికి విలువ లేదు. కనీసం ఇంట్లో నేయి, పచ్చళ్ళ లాంటివి అమ్మి తన పిల్లలకు లోదుస్తులు అయినా కొనుక్కుంటుంది అని ప్రోత్సహిస్తున్నా'నని చెప్పిన మాటలు ఇన్నేళ్లయినా నేను మరిచిపోలేదు" అని హైదరాబాద్ కి చెందిన కళ్యాణి ముక్తేవి తనకు తెలిసిన ఒక గృహిణి ఆర్ధిక పరిస్థితి గురించి గుర్తు చేసుకున్నారు.

ఆమె ఎన్ఐఐటీ ఆంధ్రప్రదేశ్ మార్కెటింగ్ హెడ్, ఆంధ్ర ప్రదేశ్ పర్యటక శాఖలో కన్సల్టెంట్ గా పని చేసి ఒక సంవత్సరం నుంచి ఇంటి బాధ్యతలకే అంకితమయ్యారు.

దేశంలో గృహిణులు చేసే పనికి ఎంత ఆదాయం లభించాలో అంచనా వేయడం అత్యంత ముఖ్యమని 'కీర్తి వర్సెస్ ఓరియంటల్ ఇన్సూరెన్సు' కేసులో మంగళవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో ఇంట్లో గృహిణులు చేసే పనికి ఆర్ధిక విలువ కట్టడం వారిని సాధికారత వైపు తీసుకుని వెళుతుందా అనే అంశం పై బీబీసీ న్యూస్ తెలుగు పలువురు మహిళలతో మాట్లాడింది.

ఈ నష్టపరిహారం కేసుకు సంబంధించి బెంచ్‌ ఇచ్చిన తీర్పుకు అదనంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్వీరమణ తన అభిప్రాయాన్ని జత చేశారు.

గృహిణులు చేసే పనికి ఎలాంటి ఆర్థిక విలువా లేదన్న అభిప్రాయాన్ని మార్చుకోవాలని ఆయన చెప్పారు. ఒక గృహిణి చేసే పనులు కుటుంబ ఆర్థిక వ్యవస్థకు, తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు దోహదం చేస్తాయని జస్టిస్‌ రమణ అభిప్రాయపడ్డారు.

గృహిణులు చేసే పనుల పట్ల న్యాయంగా వ్యవహరించాలనేది మనుషుల ఆలోచన దృక్పథంలో వస్తున్న మార్పులకు, అంతర్జాతీయ న్యాయ ప్రమాణాలను ప్రతిఫలింపచేసేలా ఉన్నాయని అన్నారు.

2011 జనాభా లెక్కల ప్రకారం 15.98 కోట్ల మంది మహిళలు ఇంటిపని చేస్తుండగా 57.9 లక్షల మంది పురుషులు మాత్రమే ఇంటిపని చేస్తున్నారు.

సుప్రీంకోర్టు

మహిళలు చేసే ఇంటి పనికి ఆర్ధిక విలువను ఎలా అంచనా వేస్తారు?

ఈ కేసులో మహిళలు ఇంట్లో చేసే పనికి ఒక నోషనల్ (అంచనాగా) వెల కట్టారు. ఇంటి పనితీరును బట్టి గృహిణుల శ్రమకు తగ్గ విలువను లెక్కించే అంశానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. దీని వల్ల గృహిణుల పనిని, శ్రమను, త్యాగాలను గుర్తించినట్లవుతుంది. అందరికీ సమాన న్యాయం చేయాలనే జాతీయ, అంతర్జాతీయ న్యాయ సూత్రాలను, సామాజిక న్యాయంపై రాజ్యాంగ సూత్రాలను గుర్తించినట్లు అవుతుంది అని ఈ తీర్పులో పేర్కొన్నారు.

ఒక మహిళ కుటుంబ జీవన శైలిని బట్టి ఆమె అర్హతలను పరిగణనలోకి తీసుకుని కోర్టు ఆమె ఆదాయాన్ని అంచనాగా లెక్కిస్తుంది. దీనినే నోషనల్ ఆదాయం అని అంటారు. ఎంఆర్ కృష్ణ మూర్తి, న్యూ ఇండియా ఎష్యురెన్సు కేసులో కూడా ఈ ప్రస్తావన వచ్చింది.

ఆయా పరిస్థితులకు అనుగుణంగా గృహిణి శ్రమకు తగ్గ విలువను ఊహించి న్యాయస్థానం ఆమె ఆదాయాన్ని నిర్ణయించేందుకు రకరకాల పద్ధతులను ఉపయోగించుకోవచ్చు.

గృహిణుల ఆదాయాన్ని ఊహించి నిర్ణయించేటప్పుడు కోర్టు వాస్తవాలు, పరిస్థితులను, కేసుకు సంబంధించి నిర్దిష్ట అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి. అంతేగానీ, మరీ సంకుచితంగా, మరీ ఉదారంగా కూడా వ్యవహరించ కూడదు. భవిష్యత్తులో అటువంటి కేసుల్లో గృహిణుల ఆదాయాన్ని లెక్కిస్తే అది పరిహారంలో భాగంగా ఉండొచ్చు.

అయితే, ఇది నిర్ణయించడానికి ఒక ప్రత్యేకమైన పద్దతి ఏమి ఉండకూడదని, గృహిణి చేసే పనికి విలువ కల్పించడమే ఈ తీర్పు వెనకనున్న ఉద్దేశమని కోర్టు పేర్కొంది.

బిందు నాయుడు

ఇంటి పనికి విలువ కట్టడం సాధ్యమేనా?

మహిళలు పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఇంట్లో చేసే పనులకు అంతం ఉండదు. ఇంట్లో పొద్దున్న పనులు మొదలుపెట్టేది మహిళే. రాత్రయ్యాక ఆఖరున పనులు ముగించేది కూడా మహిళే. మరి ఆమె చేసే పనులకు రోజుకు 8 గంటలు చేసే పనిలా ఎలా అంచనా వేస్తాం అని నిపుణులు అంటున్నారు.

"చాలా మంది గృహిణి చేసే పనులకు విలువ ఇవ్వరు. ఇంట్లోనే ఉంటావు కదా..నీకేం పనుంది. అని తేలిక చేస్తారు.

ఇంటి పనంతా గృహిణులదే అని భావిస్తూ ఉంటారు. కానీ, ఒక ఇంట్లో మహిళ చేసే పని ఆగిపోతే ఇంటి చక్రం తిరగడమే ఆగిపోతుంది" అని మ్యాట్రిమోనియల్ న్యాయవాది బిందు నాయుడు అన్నారు.

సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు మహిళల విషయంలో ఒక ట్రెండ్ సెట్టర్ గా మారుతుంది అని ఆమె అన్నారు. ఇది మహిళలకు ఇచ్చే పరిహారం విషయంలో గణనీయమైన మార్పులు తెస్తుందని సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు పై ఆమె హర్షం వ్యక్తం చేశారు.

"ఇంట్లో పనివాళ్ల నిర్వహణను కూడా గృహిణి చేస్తున్న పనిగా భావించాల్సిందే" అని ఆమె అన్నారు.

"ఇల్లు నడపడం కోసం గృహిణి తన శక్తిని, మనసును, సమయాన్ని కూడా వెచ్చిస్తుంది. ఇంట్లో అందరూ టీవీ చూసే సమయంలో కూడా ఆమె వారి కోసం ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. మరి వీటన్నిటికీ ఆమెకు ఆర్ధిక ప్రయోజనం చూపించాల్సిందే. దీనికి, ఇంట్లో వాళ్ళిచ్చే బహుమతులకు సంబంధం లేదు" అని ఆమె అన్నారు.

బీఎన్ నీలిమ

మహిళల ఇంటి పనికి వేతనం

పురుషుల కంటే ఎన్నో రెట్లు మహిళలు ఇంటి పనులు చేస్తున్నారని జస్టిస్ ఎన్ వి రమణ చెప్పారు.

కుటుంబానికి వండిపెట్టడం, ఇంటి నిర్వహణ , డబ్బుల జమ, ఖర్చుల బాధ్యత చూడడం, ఇంటికి అవసరమైన సరుకులు కొనడం, పిల్లలు, వృద్ధుల అవసరాలు చూడడం వంటి ఎన్నో పనులు చేస్తారని చెప్పారు.

గ్రామాల్లో మహిళలు పొలం పనులు, పశుపోషణ బాధ్యతలు కూడా నిర్వహిస్తారని గుర్తు చేశారు. సామాజిక, సాంస్కృతిక కారణాల వంటి వాటి వాళ్ళ వారు ఈ పనులు చేస్తున్నారని చెప్పారు.

మహిళలు చేసే పనికి వేతనం ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వం గృహిణులకు వేతనం ఇవ్వాలంటూ సినీ నటుడు కమల్ హాసన్ ప్రతిపాదించిన ఆలోచనను కాంగ్రెస్ నాయకుడు శశి థరూర్ సమర్ధిస్తూ ట్వీట్ చేశారు.

https://twitter.com/ShashiTharoor/status/1346319856086335488

అలా చేయడం వలన గృహిణుల పనిని గుర్తించి ఆర్ధిక విలువను చేకూరుస్తుందని కమల్ హాసన్ అన్నారు. దీని వలన వారికి స్వతంత్రం పెరిగి అందరికీ కనీస ఆదాయం సంపాదించుకునే స్థితి వస్తుంది అని ట్వీట్లో అన్నారు.

"ఇదే ఆచరణాత్మకంగా జరిగితే గృహిణికి ఆర్ధిక స్థిరత్వాన్ని కల్పించి కచ్చితంగా సాధికారతను కలుగ చేస్తుంది" అని బిందు నాయుడు అన్నారు.

ప్రేమతో చేసే పనికి ఖరీదా?

అయితే, ఇంట్లో మహిళలు ప్రేమతో ఆప్యాయతతో చేసే పనికి ఖరీదు కట్టవద్దని అంటూ సినీ నటి కంగనా రనౌత్ ట్వీట్ చేశారు.

https://twitter.com/KanganaTeam/status/1346332993577771008

"మా చిన్న సామ్రాజ్యానికి రాణులుగా ఉన్నందుకు మాకు జీతం అక్కరలేదు. మా సొంత బిడ్డలను పెంచుతున్నందుకు మాకు డబ్బులు చెల్లించకండి. ప్రతి విషయాన్ని వ్యాపారంగా చూడటం ఆపేయండి. మీకు సంబంధించిన మహిళకు మీరు పూర్తిగా లొంగిపోండి. మీ నుంచి ఆమె కోరుకునేది ప్రేమ, గౌరవం, డబ్బు మాత్రమే కాదు. మీరు పూర్తిగా ఆమెకే సొంతం కావాలనుకుంటుంది" అని ఆమె ట్వీట్ చేసారు.

"ఇంటిని నిర్వహించడానికి గృహిణి పనికి విలువ కట్టడాన్ని ఎందుకో నేను సమర్ధించను. నేను ఈ ఇంటి బాధ్యతను నిర్వహించడం నా బాధ్యతగా భావిస్తాను. ఒక మంచి గృహ వాతావరణం, కుటుంబ సభ్యుల ఆనందమే నాకు లభించే ఫలితంగా అనుకుంటాను.కుటుంబ సభ్యులు నాకిచ్చే ప్రేమ, ప్రశంసలే నాకు లభించే వేతనం. ఇంట్లో సభ్యులు కొందరు బయట పని చేయడానికి వెళితే, నేను ఇంట్లో బాధ్యతలు నిర్వహిస్తాను. భాగస్వామి భార్యను చూసుకునే తీరు పై ఆమె భావాలు ఆధారపడి ఉంటాయి" అని గీత వేదుల అనే గృహిణి అన్నారు.

పితృస్వామ్య సమాజం గృహిణిని చూసే దృక్పధం మారాలని బిందు నాయుడు అంటారు. మహిళలు ఎవరికి వారే తమకు ఆర్ధిక లాభం అక్కరలేదు అనిపిస్తే దానికి ఏమి చెప్పలేం కానీ, వారు చేసే పనులకు మాత్రం కొంత ఆర్ధిక లాభం చేకూరితే వారికి ఆర్ధిక స్థిరత్వం చేకూరినట్లే" అని బిందు నాయుడు అన్నారు.

మణి పవిత్ర

ఎన్ని ఆధునిక పరికరాలున్నా అలసటే

హౌస్ వైఫ్, హోమ్ మేకర్, తల్లి వీటి మధ్య ఉన్న తేలికపాటి తేడా ఏమిటో ఇంకా అర్ధం కావటం లేదని విశాఖపట్నంకు చెందిన సౌమ్య అనే గృహిణి అంటున్నారు.

"ఆధునిక యుగంలో వంటింట్లోకి, ఇంట్లోకి కావాల్సిన అనేక పరికరాలు వచ్చేసాయి. కానీ, గృహిణి బాధ్యత మాత్రం రోజు రోజుకీ పెరుగుతూనే ఉంది కానీ, ఏ మాత్రం తగ్గలేదు. గృహిణుల పై ఉండే శారీరక, మానసిక ఒత్తిడి కూడా చాలా ఎక్కువవుతోంది" అని ఆమె అన్నారు.

గృహిణికి ఆర్ధిక స్వాతంత్య్రం రావాలంటే ఆమె చేసే పనికి కచ్చితంగా ఆర్ధిక విలువ ఉండాలని ఆమె అన్నారు.

సాధారణంగా ఇంట్లో ఏ చిన్న తప్పు జరిగినా ఇంట్లోనే కదా ఉన్నావు, ఏమి చేస్తున్నావు చూసుకోకుండా అని చాలా మంది సులభంగా మాట విసిరేస్తారు. కానీ, ఇంటి పని అంత తేలికైన పని కాదు అని మరి కొంత మంది గృహిణులు అంటున్నారు.

అసలు గృహిణి చేసే పనికి విలువ కట్టలేమని కళ్యాణి ముక్తేవి అన్నారు. తన కుటుంబాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఒక గృహిణి తన పూర్తి హృదయాన్ని, ప్రేమను, సమయాన్ని పెట్టి చేస్తుంది. దానికి విలువ ఎలా కట్టగలం అని ప్రశ్నించారు.

ఒక మహిళ ఇంట్లో చేసే పనికి విలువ కట్టలేమనే విషయంతో శ్రీ పద్మావతి మహిళా విశ్వ విద్యాలయం అసోసియేట్ ప్రొఫెసర్ బిఎన్ నీలిమ ఏకీభవించారు.

ఒక తల్లి ఇచ్చే మానసిక భద్రత మరెవ్వరూ ఇవ్వలేరని, దానికొక విలువ కట్టడం సాధ్యం కాని పనని, కానీ, అవసరమైన చోట ఆమె పనికి తప్పకుండా విలువ ఇవ్వాల్సిందేనని ఆమె అన్నారు.

మన సంస్కృతిలోనే ఆర్ధిక విషయాలకు ఇచ్చినంత ప్రాధాన్యత క్రియాత్మక, మానసిక అంశాలకు ఇవ్వకపోవడం కూడా ఈ పరిస్థితికి కారణమని నీలిమ అన్నారు.

ఒక మహిళ ఇంటిని తీర్చిదిద్దడంలో ఆ కుటుంబం మనుగడ, పరిణితి ఆధారపడి ఉంటాయన్న విషయాన్ని కూడా అర్ధం చేసుకోవాలని ఆమె అన్నారు.

"వ్యక్తిగతంగా నా పనికి ఆర్ధిక విలువ కట్టాలని నేనైతే అనుకోవడం లేదు కానీ, ఆర్ధిక విలు చాలా మందికి సాధికారతను కలుగ చేస్తుంది" అని కళ్యాణి అభిప్రాయపడ్డారు.

"మహిళకు చేసే పనికి డబ్బులు ఇచ్చినా కూడా అవి తిరిగి తన ఇంటి కోసమే ఖర్చు పెడుతుందని, ఒక కార్పొరేట్ ఉద్యోగం చేసేవారి కంటే ఉత్తమంగా హోమ్ మేకర్స్ పని చేస్తారు" అని ఆమె అన్నారు.

ఆఖరికి ఇన్ఫోసిస్ స్థాపించడానికి సుధా మూర్తి ఆమె భర్తకు ఆమె ఆదా చేసిన సొమ్మును తొలి పెట్టుబడిగా ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.

అయితే, చాలా మంది ఉద్యోగం చేస్తున్న మహిళలకు కూడా ఆర్ధిక స్వాతంత్య్రం ఉండదని, ఆస్తులైతే ఇంట్లో మగవాళ్ళకి, పరువు ప్రతిష్టలను మోసే బాధ్యత మహిళల పైన నెట్టేసే వ్యవస్థ ఉన్నంత వరకు పరిస్థితులు మారవని మిలియన్ మామ్స్ వ్యవస్థాపకురాలు డాక్టర్ మణి పవిత్ర అన్నారు. . ఆమె ఫార్చ్యూన్ ఎకాడమి డైరెక్టర్ గా మహిళలకు ఆర్ధిక సాధికారత గురించి సలహాలు, సూచనలు ఇస్తారు.

ఈ తీర్పు పై విస్తృతంగా చర్చ జరిగి మహిళల ఆర్ధిక స్వావలంబనకు తోడ్పడాలని ఆమె అన్నారు.

జస్టిస్ ఎన్‌వీ రమణ

జస్టిస్‌ రమణ ఇచ్చిన తీర్పులో ఏమన్నారు?

గృహిణులకు నష్టపరిహారం చెల్లించడం న్యాయ శాస్త్ర పరంగా సమ్మతమైన చర్య.

లత వాద్వా, స్టేట్ ఆఫ్ బీహార్ మధ్య జరిగిన కేసులో ఒక ఉత్సవంలో తలెత్తిన అగ్ని ప్రమాదంలో మరణించిన గృహిణులకు కూడా పరిహారం ఇవ్వాలని సుప్రీం కోర్టు పేర్కొంది. ఇందులో గృహిణులకు పరిహారం ఇవ్వడానికి సంవత్సరానికి 10,000 - 12,000 రూపాయిలు వార్షిక ఆదాయాన్ని లెక్కించారు.

ఇటీవల మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రాం ఇంప్లిమెంటేషన్ విడుదల చేసిన "టైం యూజ్ ఇన్ ఇండియా 2019 నివేదికలో ఇంటి పనుల కోసం మహిళలు సగటున రోజుకు 299 నిమిషాలు వెచ్చిస్తే పురుషులు మాత్రం రోజుకు 97 నిమిషాలు మాత్రమే వెచ్చిస్తున్నట్లు వెల్లడైనట్లు ఇదే తీర్పులో పేర్కొన్నారు.

ఆఖరికి 2001 జనాభా లెక్కలలో కూడా ఇంటి పని చేసే వారిని అడుక్కునేవారు, వేశ్యలు, ఖైదీలతో పోలుస్తూ వారి పనికి ఆర్ధిక విలువ లేనట్లుగా పరిగణించడం పట్ల కోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇలా దేశంలో 36 కోట్ల మంది మహిళల పనిని ఆర్ధికంగా విలువ లేని పనిగా అంచనా వేసింది.

గృహిణులు చేసే పనికి విలువ లేకపోవడం ఒక్క భారతదేశానికే పరిమితం కాదని, ఇదే పరిస్థితి జర్మనీ, ఇటలీ, అమెరికా, బ్రిటన్ లాంటి దేశాలలో కూడా ఉందని ఈ తీర్పులో ప్రస్తావించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Women response to House maker remarks by Supreme court
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X