వేడిగా ఉందా? వచ్చి నా ఒళ్లో కూర్చో: మహిళ పట్ల ఉబేర్ క్యాబ్ డ్రైవర్ దురుసు ప్రవర్తన
న్యూఢిల్లీ: ఆన్ లైన్ ద్వారా కార్లను అద్దెకు సమకూర్చే ఉబేర్ సంస్థ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఉబేర్ క్యాబ్ డ్రైవర్ ఓ మహిళా జర్నలిస్టు పట్ల అసభ్యకరంగా పదజాలంతో వేధించాడు. దేశ రాజధానిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ సమయంలో ఆమె భర్త కూడా వెంట ఉన్నప్పటికీ.. డ్రైవర్ బరి తెగించాడు. దురుసుగా ప్రవర్తించాడు. తన చేదు అనుభవాన్ని బాధిత మహిళ ట్విట్టర్ ద్వారా ఉబేర్ సంస్థ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. ఢిల్లీ పోలీసుల దృష్టికీ తీసుకెళ్లారు.
ఆమె పేరు అమృతా దాస్. ఢిల్లీలో జర్నలిస్ట్ గా పని చేస్తున్నారు. మంగళవారం రాత్రి అమృతా దాస్ తన భర్తతో కలిసి ఉబేర్ క్యాబ్ లో ప్రయాణిస్తున్న సమయంలో ఉక్కపోతకు గురయ్యారు. ఏసీ వేయాలని డ్రైవర్ ను కోరారు. ఏసీ వేయడానికి డ్రైవర్ అంగీకరించలేదు. బాధిత మహిళ మరోసారి కూడా ఏసీ వేయాలని సూచించగా.. డ్రైవర్ ఆగ్రహానికి గురయ్యాడు. తాను ఏసీ వేయనని కరాఖండిగా చెప్పాడు. అంత వేడిగా ఉంటే వచ్చి నా ఒడిలో కూర్చో.. చల్లగా ఉంటుంది అని దూషించాడు.
కారు దిగాలని దురుసుగా ప్రవర్తించాడు. క్యాబ్ డ్రైవర్ ద్వారా తనకు ఎదురైన చేదు అనుభవాన్ని అమృతా దాస్ ట్విట్టర్ ద్వారా ఉబేర్ సంస్థ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. అతనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ట్వీట్ పై ఉబేర్ యాజమాన్యం సానుకూలంగా స్పందించింది. డ్రైవర్ పై చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. ఈ ట్వీట్ ను చూసిన పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.
@Uber_Delhi @Uber @Uber_Support rude and creepy driver. I demand action. First he refused to turn on ac then says garmi lag rahi hai to age mere godi me baith jao. He also ended trip moments after starting to drive and forced me out. This is when I was with husband. @DelhiPolice pic.twitter.com/qE40ib3B5d
— Amrita D (@amritadas) March 19, 2019