• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

స్మార్ట్ గ్లాసెస్: స్మార్ట్ ఫోన్ పనులన్నీ కళ్ల జోళ్లే చేస్తే ఏమవుతుంది? - డిజిహబ్

By BBC News తెలుగు
|
స్మార్ట్ గ్లాసెస్

ఎన్.టి. రామారావు కృష్ణుడిగా వేసిన పాత 'మాయాబజార్' సినిమాలో ఘటోత్కచుడు ద్వారకకు చేరగానే పరీక్షించడానికి శ్రీకృష్ణుడు ముసలి తాత రూపంలో వచ్చి ఒక తత్త్వాన్ని వల్లిస్తాడు.

"చిన చేపను పెద్ద చేప, చిన మాయను పెను మాయ.. అది స్వాహా ఇది స్వాహా.. అది స్వాహా ఇది స్వాహా"

ఈ తత్వం టెక్నాలజీ విషయంలో మరీ నిజమనిపిస్తుంది. ఒకదాని తరువాత ఒకటిగా టెక్నాలజీ విస్తరించి మాయాజాలం చేస్తోంది.

ఒక పదిహేను, ఇరవై ఏళ్ళ కిందట, జేబులో పట్టేంత స్మార్ట్ ఫోనులు వచ్చి సెల్ఫీలు చాటింగ్‍లు వీడియో కాలింగ్‍లు ఇంత సునాయాసంగా చేయచ్చుననీ, అవి మన జీవితంలో ఇంతలా భాగమై పోతాయని సామాన్యులు ఎవరూ ఊహించి ఉండరు.

కంప్యూటర్, లాప్‍టాప్‍ చేరలేని ప్రజానీకానికి కూడా స్మార్ట్ ఫోన్లు చేరాయి. అదే పెను మాయ అనుకునే లోపు, పెట్టుకునే కళ్లద్దాల్లో, వాచీల్లో, బట్టల్లో నిక్షిప్తమై కనిపించకుండా మాయ చేయడానికి సిద్ధమవుతోంది టెక్నాలజీ.

ధరించగలిగే టెక్నాలజీ కాబట్టి దీన్ని Wearable Technology అంటారు.

ఒక పక్కకు టచ్ చేస్తూ లేదా తడుతూ స్మార్ట్ గ్లాసెస్‌కు సూచనలు ఇవ్వొచ్చు

ఈ మాయ ఎలా సాధ్యం అవుతోంది?

పనులు చేసిపెట్టాలంటే పరికరాల్లో కంప్యూటింగ్ కెపాసిటీ ఉండాలి. ఒక్కప్పుడు పెద్ద పెద్ద గదుల్లో మాత్రమే పట్టగలిగే కంప్యూటర్లు ఉండేవి. ఎందుకంటే, కంప్యూట్ చేయడానికి కావాల్సిన వాక్యూమ్ డ్రమ్ములు, ఆంప్లిఫయర్లు భారీ సైజులో ఉండేవి.

రాను రానూ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లు, మోనోలిత్ ఇంటిగ్రేటెడ్ సర్కూట్లూ చిన్న సైజులో రావడంతో కంప్యూటర్‍ సైజు కూడా తగ్గిపోతూ వచ్చింది.

గదినంతా ఆక్రమించుకునే దగ్గర నుంచి ఒక మూల పట్టేంత సైజుకి వచ్చింది. అక్కడి నుంచి బల్ల మీదకు (పర్సనల్ కమ్యూటర్), ఆ తరువాత ఒడిలోకి (లాప్‍టాప్), ఇప్పుడు అరచేతిలో పట్టుకునేంత (స్మార్ట్ఫోన్లు, టాబ్లెట్లు) వరకూ వచ్చి, అక్కడితో ఆగక ధరించే దుస్తుల్లోనూ, వస్తువుల్లోనూ చేరిపోతోంది.

మన ఫిట్‍నెస్ పరీక్షించడానికి స్మార్ట్ వాచీలు, మన బట్టల్లో ఉండి, మన శరీర ఉష్ణోగ్రతను కంట్రోల్ చేయడానికి పర్సనల్ థర్మల్ సిస్టమ్స్ వచ్చేశాయి. ఆ కోవకు చెందినవే స్మార్ట్ గ్లాసెస్ కూడా.

స్మార్ట్ గ్లాసెస్ ఎలా పనిచేస్తాయి?

స్మార్ట్ గ్లాసెస్ అంటే బాక్‍గ్రౌండ్ నుంచి వస్తున్న సమాచారాన్ని కళ్ళద్దాలకు పెట్టిన చిన్న స్క్రీన్ మీదో లేదా ఎదురుగా ఒక స్క్రీన్ మీదో ప్రొజెక్ట్ చేయగలిగేవి.

అంటే, స్క్రీన్ కోసం మరో డివైజు అవసరం లేకుండా ఇన్‍ఫర్మేషన్ మనకు చేరుతుంది. ఈ స్కీన్ పారదర్శకంగా ఉంటుంది కాబట్టి మన చుట్టూ ఉన్నవి కూడా మనకు కనిపిస్తూనే ఉంటాయి, వాటిపైనే పారదర్శకంగా మనకు కావాల్సిన సమాచారాన్ని చూపెడతాయి.

ఉదాహరణకు, ఇప్పుడు మనం జి.పి.ఎస్ వాడాలంటే అప్పుడప్పుడూ రోడ్డుపైనుంచి కళ్ళు తప్పించి మొబైల్ కేసి చూడక తప్పదు. అదే, ఈ గ్లాసెస్ పెట్టుకుంటే, నిజమైన రోడ్డూ కనిపిస్తుంది, దానిపై దారి చూపించే గుర్తులు (arrow marks) కూడా కనిపిస్తాయి.

ఇవి మామూలు కళ్ళద్దాల్లాగానే ఉంటాయి. ఒక స్మార్ట్ ఫోన్ చేయగల పనుల్లో కొన్నింటిని సమర్థవంతంగా చేయగలవు.

డ్రైవింగ్ చేస్తున్నప్పుడు జి.పి.ఎస్ దారి చూపించడం, ఫోన్‍కు ఏవైనా మెసేజ్‍లు, కాల్ నోటిఫికేషన్లూ వస్తే చూపించడం, ఎదురుగా కనిపిస్తున్నవాటి ఫోటోలు తీయడం, తీసిన ఫోటోల్లో అక్షరాలు ఉంటే ఆ అక్షరాలను గుర్తించి వాటిని మనకు కావలసిన భాషలోకి తర్జూమా చేయడం లాంటివి చేయగలవు.

FoV (field of view - అంటే ఒక్క క్షణంలో మన చూడగలిగే దూరం, వైశాల్యం తెలిపే కొలమానం), జూమ్ కెపాసిటీలను బట్టి మనిషి కళ్ళు చూడగలిగే వాటికన్నా ఎక్కువ దూరానికి దృష్టి సారించగలవు. అలాగే దూరంలో ఉన్న వస్తువులను మన కళ్లకు దగ్గరగా చూపగలవు.

ఈ పనులన్నీ చేయడానికి కావాల్సిన సరంజామాలోనే ఉంది మాయ అంతా!

ఒక dual/quad-core processor, OLED display unit, ఒక బాటరీ, టచ్ పాడ్, వైఫై, బ్లూటూత్‍లు ఉంటే వాటి కోసం మాడ్యూల్స్, కెమరా మాడ్యూల్, మైక్రోఫోన్, స్పీకర్లు, ఆపరేటింగ్ సిస్టమ్ (ఆండ్రాయిడ్/మాక్) లాంటివన్నీ.. బరువును, ఖరీదును పెంచకుండా కళ్ళద్దాల్లో పట్టించగలగాలి.

ఈ భాగాలన్నీ ధాన్యపు గింజకన్నా తక్కువ సైజులో లభిస్తున్నాయి కాబట్టి స్మార్ట్ గ్లాసెస్‌లో అమర్చడానికి వీలుపడుతోంది.

గూగుల్ ప్రవేశపెట్టిన స్మార్ట్ గ్లాసెస్

వర్చువల్ రియాల్టీ vs అగ్‍మెంటడ్ రియాల్టీ

'వర్చువల్ రియాల్టీ' అనే టెక్నాలజీ కూడా ఇప్పుడు ఊపందుకుంటోంది. దీనిలో వాడేవి కూడా హెడ్‍సెట్స్, స్మార్ట్ గ్లాసెస్ అయినా అది 100% immersive virtual technology.

అంటే, ఆ డివైజులను ధరించాక మన చుట్టూ ఉన్న ప్రపంచం (రియాల్టీ) కనుమరుగైపోయి, కేవలం ఆ పరికరాల్లో ప్రోగ్రామ్ చేయబడిన వర్చువల్ ప్రపంచానికి చెందిన దృశ్యాలు, శబ్దాలు మాత్రమే మన అనుభవంలోకి వస్తాయి.

ఉదాహరణకు, ఇప్పుడు మాల్స్‌లో వర్చువల్ రియాల్టీ గేమ్ కౌంటర్లు పెడుతున్నారు. మీ చుట్టూ ఎంతమంది ఉన్నా, గోలగా ఉన్నా.. ఒకసారి గేమ్ గ్లాసెస్ తొడుకున్నాక ఇంకెవరూ కనిపించరు, వినిపించరు. ఆ గ్లాసెస్‌లో ఉన్న గేమ్ మాత్రమే కనిపిస్తుంది. క్రికెట్ ఆడుతుంటే, పిచ్‌లో బౌలరో, యంత్రమో మీకు బాల్ వేస్తున్నట్లు కనిపిస్తుంది. అది మాత్రమే ఆ క్షణానికి మీకు కనిపించే వాస్తవం..వర్చువల్ రియాలిటీ.

అదే స్మార్ట్ గ్లాసెస్ పెట్టుకుంటే వాస్తవ ప్రపంచం, వర్చువల్ రియాలిటీ రెండూ మన కళ్లకు కనిపిస్తుంటాయి. మాల్ వాతావరణం, మనుషులూ కనిపిస్తారు. పిచ్‌లో బాల్ వేస్తున్న బౌలరూ కనిపిస్తాడు. బాల్ మన పైకి వస్తున్న వేగం, స్పిన్ రొటేషన్స్, అది మనకి ఎంత దూరంలో పడబోతుంది లాంటి వివరాలు స్క్రీన్ మీద కనిపించవచ్చు. చుట్టూ ఉన్న వాస్తవాన్ని చూస్తూనే గేమ్ కూడా ఆడగలుగుతాం.

మనం కొట్టిన షాట్ వల్ల బంతి ఎంత వేగంగా వెళ్ళింది, బంతిని ఆపడానికి ఫీల్డర్ ఎంత దూరంలో ఉన్నాడు, అంతలోపల ఎన్ని రన్నులు తీసే అవకాశముంది లాంటి విషయాలన్నీ అప్పటికప్పుడు లెక్కించి మన స్క్రీన్ మీద చూపించచ్చు. అంపైర్ నిర్ణయాలు, రీ ప్లే షాట్లు అన్నీ కనిపించవచ్చు.

అలా వాస్తవికతకు డిజిటల్‍ ఇన్‍ఫర్మేషన్‍ను జోడించి, మన అనుభవాన్ని ఇనుమడిస్తుంది (augmenting or reinforcing) కాబట్టే దీన్ని అగ్‍మెంటడ్ రియాల్టీ (Augmented Reality) అంటారు.

స్మార్ట్ గ్లాసెస్

సవాళ్లు - సమస్యలు

టెక్నాలజీ అందుబాటులో ఉన్నా, పెద్ద పెద్ద సంస్థలు పెట్టుబడులు పెడుతున్నా ఈ పరికరాలు ఇంకా మార్కెట్లో విరివిగా రాకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి.

ఈ గ్లాసెస్ ధరించడానికి వీలుగా ఉండాలి. ముఖ్యంగా, ఇవి పెట్టుకున్నప్పుడు సున్నితమైన ముక్కు, చెవుల మీద బరువు ఆనుతుంది కాబట్టి గ్లాసెస్ బరువు ఎక్కువ ఉండకూడదు. అలాగే, వాడకం వల్ల వేడెక్కిపోకూడదు.

Wearablity vs Functionality మధ్య సయోధ్య కుదిరితేనే వీటిని కొనడానికి జనం ముందుకు వస్తారు.

గూగుల్ ఇలాంటి కళ్లద్దాలను 2013లోనే ప్రవేశపెట్టింది గానీ, అవి వాడడానికి సంక్లిష్టంగానూ, ఖరీదుగానూ (సుమారు లక్ష రూపాయలు) ఉండడం వల్ల పెద్దగా నడవలేదు.

కాగా, గత వారంలో షామీ (Xiaomi) మార్కెట్లో ప్రవేశపెట్టిన స్మార్ట్ గ్లాసెస్ తక్కువ ఖర్చు, ఎక్కువ పనితనంతో పాటు వాడడానికి కూడా తేలికగా ఉంటాయని టెక్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

గూగుల్ ప్రవేశపెట్టిన స్మార్ట్ గ్లాసెస్

ఒక పది పదిహేనేళ్ళ క్రితం జీ.పీ.ఎస్, ఫోన్ కెమేరాల టెక్నాలజీ జనాదరణ పొందుతున్నప్పుడు ప్రైవసీ గురించి చింతలూ, ఆందోళనలూ కేవలం పరిశోధకులకు, విశ్లేషకులకు మాత్రమే పరిమితమయ్యాయి.

కానీ, ఇప్పుడు ప్రైవసీ మీద చర్చలు పార్లమెంటు మొదలుకుని చాయ్ దుకాణాల వరకూ అన్ని చోట్లా వినిపిస్తున్నాయి.

అసలే తికమకగా ఉన్న ఈ వ్యవహారాన్ని స్మార్ట్ గ్లాసెస్ టెక్నాలజీ లాంటివి మరింత జటిలం చేయబోతున్నాయి.

ఈ అద్దాలకు, సాధారణ ఫ్రేములతో ఉన్న మామూలు కళ్ళద్దాలకు పెద్ద తేడా కనిపించదు. ఒక పక్కకు చేయి పెడితేనో, లేదా అద్దం ఒక పక్కన రెండు మూడు సార్లు కొడితేనో, లేదా కాస్త లోగొంతుకలో సూచన (voice instruction) ఇస్తేనో ఇవి పనులు చేసి పెడతాయి.

అంటే, అద్దాలు సర్దుకుంటున్నట్లో లేదా తమలో తామే ఏదో మాట్లాడుకుంటున్నట్లో ఎదుటివారికి కనిపిస్తుంది.

కానీ, ఈ లోపే ఆ పరికరం వారి ఫోటోలు, వీడియోలు తీసేస్తుంది. స్మార్ట్ ఫోన్‍లో ఫొటో తీస్తే ఎదుటివారికి తెలుస్తుంది. కానీ స్మార్ట్ గ్లాసెస్‌లో ఎదుటివారికి తెలియకుండానే వారి ఫొటోలు తీయవచ్చు.

అందుకే ఫేస్‍బుక్ టెక్నాలజీ ప్రవేశపెడుతున్న రే-బాన్ అద్దాలు ప్రైవసీకి గొడ్డలిపెట్టని ఐరిష్ కోర్టులు అడ్డుపడుతున్నాయి.

శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రభావం

తలకు ధరించే పరికరాల (Head Mounted Display - HDM) వల్ల తలనొప్పి, కంటిపై ఒత్తిడితో పాటు చదవడం, ఫోకస్ పెట్టడం లాంటి పనులు కష్టం కావచ్చని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి.

ప్రస్తుతం స్మార్ట్ ఫోన్లకే మనం చాలా అలవాటుపడిపోయాం. వాటిని పక్కన పెట్టలేకపోతున్నాం. అలాంటిది, గ్లాసెస్‍ లాంటి వాటికి అలవాటు పడిపోతే ఎలాంటి దుష్ప్రభావాలు ఉంటాయో తెలీదు.

పైగా ఇప్పటి వరకూ మనం వాడుతున్న డివైజుల స్క్రీన్ వైపు చూస్తేనే మనకు సమాచారం కనిపిస్తుంది. కానీ స్మార్ట్ గ్లాసెస్‍ పెట్టుకుంటే ఎటు చూసినా ఏదో ఒక డిజిటిల్ సమాచారం మన కళ్ళ ముందు కదలాడుతూనే ఉంటుంది.

అలా కంటికి ఎప్పుడూ ఏదో ఒకటి కనిపిస్తుంటే మన మెదడు ఎలా ప్రాసెస్ చేసుకుంటుందో ఇంకా ఎవరికీ తెలీదు.

పైగా డ్రైవింగ్ చేసేటప్పుడు ఇవి ప్రమాదకరం కావొచ్చు. ఇప్పటికే సైటు ఉండి అద్దాలు వాడేవారికి, స్మార్ట్ గ్లాసెస్ వాడడం ఇంకాస్త కష్టం కావొచ్చు.

ఇదో కొత్త మార్కెట్ కాబట్టి, దాన్ని చేజిక్కించుకోవాలనే అత్యుత్సాహంతో ఎంతమంది బీటా-యూజర్లపై కంపెనీలు వీటిని ప్రయోగించి పరీక్షిస్తున్నాయో తెలీదు.

మాయా టెక్నాలజీలే ఇక మన భవిష్యత్తు

ఇవాళ్టికి కొన్ని కంపెనీలు స్మార్ట్ గ్లాసెస్‌పై పరిశోధనలు చేసే స్థాయిలోనే ఉన్నాయి. కొన్ని మార్కెట్లోకి తీసుకురావడానికి తొందరపడుతున్నాయి. ఈ ప్రయత్నాలన్నీ ఫలించవచ్చు లేదా వికటించవచ్చు.

అయితే, ఈ టెక్నాలజీలు మాత్రం ఎప్పుడో ఒకప్పుడు మన జీవితంలో భాగం కాక తప్పదు.

ప్రారంభంలో, కంప్యూటర్లు ప్రయోగశాలలు దాటి ఇళ్ళల్లోకి చేరడం మొదలైనప్పుడు ఆఫ్-లైన్‌లోనే పనిచేసేవి. పోను పోనూ ఇంటర్నెట్‍కు కనెక్ట్ అయి, మెయిల్స్ పంపించడం వరకు వచ్చాయి.

వెబ్ 2.0 (బ్లాగులు, తొలితరం సోషల్ మీడియా) మొదలయ్యేసరికి ఇంటర్నెట్ వాడకందారులు ఎక్కువయ్యారు.

“ఆన్‍లైన్ ఐడెంటిటీ” అని ఒకటి ఏర్పడడం మొదలైంది. మొబైల్ టెక్నాలజీలు పెరిగే కొద్దీ సోషల్ మీడియాల హవా కూడా ఎక్కువైంది.

మన ప్రస్తుతం ఉన్న దశ ఇదే. ఇక్కడ నుంచి ఆఫ్‍లైన్‍కూ, ఆన్‍లైన్‌కూ తేడా లేని దిశగానే ప్రయాణం నడవబోతుంది. వర్చువల్ రియాల్టీ, అగ్మమెంటడ్ రియాల్టీ లాంటివే మనముందున్న దారి.

ఈ డిజిహబ్ సీరీస్‍లో దాదాపుగా ప్రతీ వ్యాసంలో చెప్పుకునే మాటే ఇక్కడా చెప్పుకోవాలి.

స్మార్ట్ గ్లాసెస్‌ను కేవలం వినోదానికే కాకుండా వైద్య, ఆరోగ్య, సంక్షేమ కార్యక్రమాల్లో కూడా వీటిని ఉపయోగించచ్చు. మన కళ్లకు ఉండే పరిమితులు దాటి పనులు చేయవచ్చు.

అయితే, టెక్నాలజీని ఎలా వాడుతున్నాం, దాని వల్ల మన పైనా, మన పర్యావరణం పైనా ఎలాంటి ప్రభావాలు పడుతున్నాయనేది గమనించుకోవడం ముఖ్యం.

చిన మాయను పెను మాయ స్వాహా చేస్తే పర్లేదుగానీ. ఆ మాయ మన గుప్పిట్లోంచి జారి మనల్ని స్వాహా చేసే వరకూ తెచ్చుకోకూడదు.

(ఈ కథనం టెక్నాలజీ మీద అవగాహన కోసం మాత్రమే. ఇందులో రచయిత అభిప్రాయాలు వ్యక్తిగతం)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Smart Glasses: What happens if all the smart phone works done by spects? - Digihub
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X