హత్రాస్ ఎఫెక్ట్ : కేంద్రమంత్రి స్మృతీ ఇరానీకి వారణాసిలో షాక్... చుట్టుముట్టిన నిరసనకారులు...
హత్రాస్ గ్యాంగ్ రేప్ నేపథ్యంలో కేంద్రమంత్రి స్మృతీ ఇరానీకి వారణాసి పర్యటనలో నిరసనల సెగ తగిలింది. సమాజ్‌వాదీ పార్టీ,కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు స్మృతీ ఇరానీని అడ్డుకుని 'గో బ్యాక్' నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఇరు పార్టీల కార్యకర్తలు గాజులు,నల్లజెండాలు చూపిస్తూ నిరసన తెలియజేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను హత్రాస్ పర్యటనకు అనుమతినించాలని డిమాండ్ చేశారు. షహన్హాపూర్లో రైతులతో ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన స్మృతీ ఇరానీకి నిరసనల రూపంలో ఇలా ఊహించని షాక్ ఎదురైంది.
హత్రాస్ గ్యాంగ్ రేప్... బాధితురాలి కుటుంబంతో డీజీపీ భేటీ... ఏం మాట్లాడారు...?

పోలీసులు-నిరసనకారుల వాగ్వాదం....
స్థానిక కమిషన్ ఆఫీస్ అడిటోరియంలో ప్రసంగించేందుకు వెళ్తున్న సమయంలో స్మృతీ ఇరానీని నిరసనకారులు అడ్డుకున్నారు. హత్రాస్ ఘటనలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ బీజేపీ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. ఈ క్రమంలో నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించగా కాంగ్రెస్ కార్యకర్తలకు,వారికి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఎట్టకేలకు నిరసనకారులను అదుపుచేసి స్మృతీ ఇరానీని అక్కడికి నుంచి పంపించేశారు.

రాహుల్‌పై స్మృతీ విమర్శలు...
అనంతరం ఈ ఘటనపై స్మృతీ ఇరానీ మాట్లాడుతూ... 'ఒక ప్రజాస్వామ్య దేశంలో ఓ నాయకుడిని నేను ఆపలేను. అదీ ఓ అత్యాచార ఘటనపై రాజకీయం చేయాలనుకునేవారిని అసలు ఆపలేను.
కానీ ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే... కాంగ్రెస్ నేతలు అక్కడికి వెళ్తామని పట్టుబడుతున్నది బాధితురాలికి న్యాయం జరగాలని కాదు... వాళ్ల స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం..' అని విమర్శించారు. హత్రాస్ లాంటి ఘటనలను ప్రతీ ఒక్కరూ వ్యతిరేకించాలని అన్నారు.బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ను కోరినట్లు తెలిపారు.

మహిళలకు మోదీ సర్కార్ రక్షణగా ఉంటుందని...
సిట్ విచారణ బృందం తమ నివేదికను సమర్పించిన తర్వాత కఠిన చర్యలు తప్పకుండా ఉంటాయని స్మృతీ ఇరానీ అన్నారు. మహిళా హక్కులకు,వారి భవిష్యత్తుకు మోదీ సర్కార్ ఎప్పుడూ రక్షణగా ఉంటుందన్నారు. కొంతమంది సమాజ్‌వాదీ పార్టీ మహిళా కార్యకర్తలు వ్యక్తిగతంగా తనను కలిశారని... సోషల్ మీడియాలో బాధితురాలి పేరును బయటపెట్టకుండా చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. రాహుల్‌పై విమర్శలతో కాంగ్రెస్ కార్యకర్తలు ఆమె కాన్వాయ్‌ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ప్లకార్డులతో నిరసన తెలియజేశారు. మరోవైపు రాహుల్‌పై స్మృతీ విమర్శలను కాంగ్రెస్ నేత రణదీప్ సూర్జేవాలా తిప్పికొట్టారు.

హత్రాస్‌కు రాహుల్..
ఇక నిన్నటిదాకా ఎవరినీ హత్రాస్‌లో అడుగుపెట్టకుండా కట్టడి చేసిన ప్రభుత్వం శనివారం(అక్టోబర్ 2) ఎట్టకేలకు మీడియాను అనుమతించింది. ఆపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హత్రాస్ పర్యటనకు కూడా అనుమతించింది. అయితే ఐదుగురికి మించి ఒకేసారి అక్కడికి వెళ్లకూడదని నిబంధన పెట్టింది. ప్రస్తుతం హత్రాస్ వెళ్తున్న రాహుల్ గాంధీ బాధిత కుటుంబంతో మాట్లాడనున్నారు. అనంతరం ఆయనతో మీడియాతో మాట్లాడి అక్కడి పరిస్థితులను వివరించే అవకాశం ఉంది.