కాంగ్రెస్‌లో సోనియా వర్సెస్ రాహుల్ కోటరీలు- ఆసక్తికరంగా పవర్ గేమ్.....
వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీలో తాజాగా తలెత్తిన అధికార సంక్షోభం ఆ పార్టీలో గ్రూపు రాజకీయాలపై చర్చను మరోసారి తెరపైకి తెచ్చింది. ముఖ్యంగా పార్టీలో సోనియా గాంధీ విధేయులుగా ఉన్న వయసు మళ్లిన సీనియర్ నేతలకూ, టీమ్ రాహుల్ గాంధీగా ఉన్న యువనేతలకూ మధ్య సాగుతున్న ఆధిపత్య పోరు పరాకాష్టకు చేరిందనే చర్చ సాగుతోంది. పార్టీ ముందుకెళ్లాలంటే ఎన్నికలు నిర్వహించి తీరాలన్న యువనేతల డిమాండ్‌ను సీనియర్లు అడ్డుకుని అనారోగ్యంతో బాధపడుతున్న సోనియా గాంధీనే మరోసారి పగ్గాలు చేపట్టేలా చేశాయన్నది ఆ పార్టీలో వినిపిస్తున్న మాట. అయితే ఇదెంత కాలం అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారుతోంది.

నాయకత్వ సంక్షోభం...
కాంగ్రెస్ పార్టీకి సంక్షోభాలు కొత్త కాదు. గతంలో నెహ్రూ, ఇందిర కాలంలోనూ సంక్షోభాలు అనుభవించి రాటు దేలిన పార్టీ అది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటున్న సంక్షోభం నాయకత్వం అజెండాగా కావడం మాత్రమే కొత్త అంశం. వారసత్వ రాజకీయాల కేంద్రంగా సాగే కాంగ్రెస్‌లో నిజంగా నాయకత్వ సంక్షోభం ఉందా అంటే ఉందనీ చెప్పలేని, అలా అని లేదనీ చెప్పలేని పరిస్ధితి. దీనికి కారణం యువ నేత రాహుల్ గాంధీ చంచల మనస్తత్వమే. తల్లి సోనియాగాంధీ నుంచి వారసత్వంగా వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని సవాల్‌గా స్వీకరించి గెలుపోటములకు అతీతంగా ముందుకు సాగిపోతే ఎలాంటి సమస్యా వచ్చి ఉండేది కాదు. అలా కాకుండా పార్టీలో అంతర్గతంగా ఎదురయ్యే విమర్శలకు భయపడి గతేడాది సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత కాడి కింద పడేయడమే రాహుల్ చేసిన పొరబాటు. ఇప్పుడు ఇదే పార్టీలో నాయకత్వ సంక్షోభానికి కారణమవుతోంది.

సోనియా వర్సెస్ రాహుల్ కోటరీలు..
కాంగ్రెస్ పార్టీలో తాజా సంక్షోభం గమనించిన వారు ఎవరికైనా పార్టీలో ఏం జరుగుతోందో ఇట్టే అర్ధమవుతుంది. కానీ ఎవరూ దీనిపై బహిరంగంగా మాట్లాడేందుకు సాహసించరంతే. పార్టీలో అధినేత్రి సోనియాగాంధీకి అండగా వయసు మళ్లిన సీనియర్లు అండగా నిలుస్తుండగా.. ఆమె తనయుడు రాహుల్ గాంధీకి యువతరం నేతలు మద్దతుగా ఉంటున్నారు. వీరిద్దరికీ మధ్య సున్నితంగా జరిగిపోవాల్సిన నాయకత్వ మార్పు సాఫీగా సాగకపోవడంతో తాజాగా సంక్షోభం బయటపడింది. ముఖ్యంగా సోనియా నాయకత్వంపై అనధికారిక తిరుగుబాటుగా సాగిన 23 మంది సీనియర్ల లేఖలు సంక్షోభాన్ని పరాకాష్టగా మార్చాయి. దీనిపై స్వయంగా రాహుల్ గాంధీ లేఖలు రాసిన వారిపై సీడబ్ల్యూసీలోనే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా సమస్యకు పరిష్కారం మాత్రం లభించలేదు.

అభద్రతాభావమే అసలు సమస్య...
కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఎదుర్కొంటున్న నాయకత్వ సంక్షోభం వెనుక సోనియా, రాహుల్ కోటరీల మధ్య సాగుతున్న ఆధిపత్య పోరే కారణమన్నది తెలుస్తూనే ఉంది. అయితే దీని వెనుక అసలు కారణం గమనిస్తే నేతల్లో నెలకొన్న అభద్రతా భావమే అన్నది అర్దమవుతుంది. ముఖ్యంగా సోనియాకు అండగా నిలుస్తున్న సీనియర్లు.. రాహుల్ నేతృత్వంలో పుంజుకుంటున్న యువ నేతల ఆధిపత్యాన్ని చూసి అభద్రతాభావానికి లోనవుతున్నట్లు తెలుస్తోంది. సోనియా అనారోగ్యం కారణంగా పార్టీలో క్రియాశీలకంగా లేకపోవడంతో రాహుల్ యువ మంత్రం దెబ్బకు తాము ఇన్నాళ్లు పార్టీలో అనుభవించిన పెద్దరికానికి గండి పడుతుందని వీరు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే సోనియా నాయకత్వం మరికొన్నాళ్లు కొనసాగాలని వీరు కోరుకుంటున్నారు.