రాహుల్ కోసం సోనియా ఆపరేషన్ ప్లాప్- ఎన్నికలకే సీనియర్ల పట్టు- కోర్టుకెక్కెందుకూ రెడీ
వరుస పరాజయాలతో కుదేలైన కాంగ్రెస్ పార్టీని నడిపిస్తున్న సోనియా, రాహుల్ గాంధీలను తమ పదవులు వదులుకోవాలని అసమ్మతి వాదులు ఎప్పుడూ కోరలేదు. కానీ వరుసగా రెండుసార్లు సార్వత్రిక ఎన్నికలతో పాటు రాష్ట్రాల్లో ఎదురవుతున్న పరాజయాలతో పార్టీని నడిపిస్తున్న తల్లీ కొడుకులకే ఆ దిశగా ఆలోచించాల్సిన పరిస్ధితి తలెత్తింది. తాజాగా బీహార్‌లో తాము ఓడిపోవడంతో పాటు మహాకూటమిని కూడా ముంచారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీలో ప్రక్షాళనకు అధినేత్రి సోనియా మరోసారి రంగంలోకి దిగాల్సి వచ్చింది. అయితే రాహుల్ తిరిగొచ్చే వరకూ పనిచేసేలా సోనియా ఏర్పాటు చేసిన కమిటీలు అసమ్మతిని చల్లార్చలేకపోయాయి.

నానాటికీ దారుణంగా కాంగ్రెస్...
వాస్తవానికి గాంధీల నేతృత్వంలో వరుస విజయాలు సాధించిన రోజుల్లో కాంగ్రెస్ పార్టీని కుటుంబ పార్టీగా చెప్పడానికి ఎవరూ సాహసించలేకపోయారు. వరుస ఓటముల నేపథ్యంలో అసమ్మతి నేతలు మరోసారి కుటుంబ పార్టీగా కాంగ్రెస్‌ను చెప్పాల్సిన అవసరం కూడా లేకపోయింది. పార్టీని నడిపించే నేతలు కరవై, గాంధీల నాయకత్వాన్ని ఓటర్లతో పాటు పార్టీలో ఓ వర్గం కూడా తిరస్కరిస్తున్న పరిస్ధితుల్లో కాంగ్రెస్ కుటుంబ పార్టీగా విమర్శలు ఎదుర్కోకపోవడం విశేషం. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలోనే అసమ్మతి నేతలంతా తమ భవిష్యత్తు గురించే ఎక్కువగా దిగులు చెందుతున్నట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఒకప్పుడు యూపీఏ ప్రభుత్వంలో మంత్రులుగా వ్యవహరించి ఇప్పుడు అసమ్మతి స్వరాలు వినిపిస్తున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు పార్టీ ఇప్పటికైనా టీపీటీ ( హిందీలో టాంగ్ పే టాంగ్) విధానాన్ని వదిలిపెట్టాలని కోరుతున్నారు. టీపీటీ అంటే ఏమీ చేయకుండా కాళ్లపై కాళ్లు వేసుకుని కూర్చునే విధానం అన్నమాట. అంటే క్రియాశీలకంగా వ్యవహరించాలని వారు కోరుకుంటున్నారు. కానీ రాహుల్ గాంధీ బీహార్ ఎన్నికల్లో ప్రచారం చేసినా, తన మనుషుల్ని మోహరించినా ఫలితాలు మాత్రం ఆశాజనకంగా రాకపోవడంతో ఆయన ఛరిష్మాపై నేతల్లో నమ్మకం సన్నగిల్లుతోంది.

రాహుల్ వర్సెస్ అసమ్మతివాదులు...
కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి స్వరాలు వినిపిస్తున్న సీనియర్లు కపిల్ సిబల్, గులాం నబీ ఆజాద్, శశి థరూర్ వంటి వారు ప్రస్తుతం పార్టీలో ప్రతీ స్ధాయిలోనూ నేతలను ఎన్నుకునేందుకు ఎన్నికలు నిర్వహించాలని కోరుతున్నారు. కానీ ఇది తిరుగుబాటుగానే కనిపిస్తోంది. గతంలో గాంధీలు నిర్వహించిన పదవులన్నింటికీ ఎన్నికలు జరగాలని కోరుకోవడం ద్వారా వారు ఏం ఆశిస్తున్నారనే దానికి అధిష్టానం వద్ద కూడా సమాధానం దొరకడం లేదు. దీంతో వీరి చర్యలు పార్టీని ధిక్కరిస్తున్నట్లుగానే ఉన్నాయన్న అభిప్రాయం కలుగుతోంది.
ప్రస్తుతం కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ఉన్న రాహుల్ గాంధీ తల్లి సోనియా గాంధీ నీడనే ఉన్నట్లు కనిపిస్తున్నారు. టీమ్ రాహుల్ కూడా ఆయన్ను ప్రమోట్ చేయడానికి తల్లి సోనియానే రబ్బరు స్టాంపుగా ఉపయోగించుకుంటోంది. పార్టీలో ఎన్నికలు లేకుండా తిరిగి తనకు అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే తీసుకోవడానికి రాహుల్ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అలా కాకుండా తనకు పోటీగా అధ్యక్ష పదవికి ఎవరైనా పోటీ పడే పరిస్దితి ఉంటే మాత్రం రాహుల్ గాంధీ ఎన్నికలకు మొగ్గు చూపించకపోవచ్చని తెలుస్తోంది. అలాంటి పరిస్ధితే వస్తే తనకు ప్రత్యర్ధులుగా ఉన్నవారిని పార్టీకి పూర్తిగా దూరం చేసేందుకు కూడా రాహుల్ వెనుకాడకపోవచ్చని సమాచారం. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కోశాధికారిగా, అధినేత్రి సోనియాకు రాజకీయ సలహాదారుగా ఉన్న అహ్మద్ పటేల్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. కొన్నేళ్లుగా పార్టీలో నేతలకూ, సోనియాకూ మధ్య వారధిగా వ్యవహరించిన అహ్మద్ పటేల్ గైర్హాజరీతో ఇప్పుడు వీరిద్దరి మధ్య దూరం పెరిగిపోతోంది. పార్టీలో తాజా సంక్షోభానికీ ఇది కూడా ఓ ప్రధాన కారణంగా నిలుస్తోంది. ప్రస్తుతం సోనియా, రాహుల్‌పై తిరుగుబాటు చేస్తున్న నేతలు కూడా ఇదే అదనుగా భావిస్తున్నట్లు తెలుస్తోంది.

కీలకాంశాలపై కాంగ్రెస్‌లో స్పష్టత కరవు..
త్వరలో ఎన్నికలు జరిగే బెంగాల్లో వామపక్షాలతో కలిసి పయనిస్తున్న టీమ్ రాహుల్‌కు ఆ బలం ఏమాత్రం సరిపోవడం లేదు. దీంతో వారు అధికార తృణమూల్‌తో పొత్తు కోసం ఆరాటపడుతున్నారు. వామపక్షాలతో ఉన్నా లేకున్నా తృణమూల్‌కు భాగస్వామిగా ఉంటే తమకు ఢిల్లీలో సవాల్ విసురుతున్న బీజేపీని కనీసం బెంగాల్లో అయినా గట్టిగా ఎదుర్కోవచ్చనే వ్యూహం కాంగ్రెస్ నేతల్లో కనిపిస్తోంది. ఢిల్లీలో టీఎంసీకి 20 మంది ఎంపీలున్నారు. వీరికి కాంగ్రెస్ బలం కూడా తోడయితే బెంగాల్లో బీజేపీని ఎదుర్కోవడం మమతకు కూడా సులువవుతుంది. అప్పుడు ఇద్దరూ కలిసి బీజేపీని లక్ష్యంగా చేసుకోవచ్చు. మరోవైపు కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు విషయంలో స్ధానిక రాజకీయ పార్టీలకు మద్దతు పలికిన కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు తాజాగా ఆవిర్భవించిన గుప్కార్ కూటమి విషయంలో మాత్రం క్లారిటీ లేకుండా పోతోంది. ఫరూక్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీలతో తాము కలిసి పనిచేస్తున్నామా లేదా అనే విషయంలో కాంగ్రెస్ పార్టీలోనే నేతలకు స్పష్టత లేదు. గుప్కార్ కూటమితో తమకు ఎలాంటి సంబంధాలు లేవని పైకి చెప్తున్న కాంగ్రెస్... అంతర్గతంగా మాత్రం అక్కడి పార్టీలతో టచ్‌లోనే ఉంది. దీంతో కాంగ్రెస్‌లోనే దీనిపై గందరగోళం నెలకొంది.

ఎన్నికలు కోరుతూ ప్రజల్లోకి, కోర్టులకూ...
వరుస పరాజయాలతో కుదేలైన కాంగ్రెస్ పార్టీలో తాజాగా జరుగుతున్న పరిణామాలపై అసంతృప్తిగా ఉన్న పలువురు సీనియర్ నేతలు, అసమ్మతి వాదులు దీనిపై ప్రజల్లోకి వెళ్లాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. రాహుల్ గాందీ కాంగ్రెస్‌ను భ్రష్టు పట్టిస్తున్నారని, దీనికి అడ్డుపడుతున్న తమను పార్టీ నుంచి తప్పించాలని ప్రయత్నిస్తున్నట్లు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వారు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
ఇప్పటికే పార్టీలో జరుగుతున్న పరిణామాలపై అధినేత్రి సోనియాగాంధీకి లేఖ రాసిన వీరంతా.. పరిస్ధితుల్లో ఎలాంటి మార్పు లేకపోవడంతో తమ దారి తాము వెతుక్కునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. పార్టీలో అసమ్మతి రాగాలు వినిపిస్తున్న నేతలను బుజ్జగించేందుకు మిగతా సీనియర్లతో కలిపి అధినేత్రి సోనియాగాంధీ పలు కమిటీలు ఏర్పాటు చేశారు. అయినా వీటిలో స్ధానం దక్కించుకున్న అసమ్మతివాదులు మాత్రం చల్లారలేదు. రాహుల్ తిరిగి బాధ్యతలు చేపట్టేవరకూ ఈ కమిటీలు పనిచేయాలని సోనియా భావిస్తున్నా అందులో ఉన్న అసమ్మతి వాదులు మాత్రం రాహుల్ రాకను తిరిగి కోరుకోవడం లేదు. రాహుల్‌తో సమానంగా తమకూ పదవుల్లో స్ధానం దక్కాలని వారు కోరుకుంటున్నారు. దీంతో సోనియా ప్రయత్నాలు వృథాగా మారిపోతున్నాయి. వీరిలో కొందరు పార్టీలో సంస్ధాగత ఎన్నికల కోసం కోర్టుకెళ్లేందుకూ సిద్ధమవుతున్నారు.